సమస్యలపై కొట్లాడేందుకు అవకాశం కల్పించాలి

– గత 20 ఏళ్లుగా  అనేక సేవలు అందించాను
– కేసులు పెట్టి వేధించినా..  నిరుద్యోగులకు అండగా నిలబడ్డ
– నిరుద్యోగులపై పూర్తి అవగాహన ఉంది
– ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలి
– పాలకూరి అశోక్ కుమార్  గౌడ్
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలపై కొట్లాడేందుకు నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాను. గత 20 ఏళ్లుగా తెలంగాణ ఉద్యమకారుడిగా, జర్నలిస్టుగా, చరిత్రకారుడుగా, వేలమంది నిరుద్యోగులకు పాఠాలు చెప్పే అధ్యాపకుడిగా అనేక సేవలు అందించాను. సమస్యలపై కొట్లాడేందుకు అవకాశం కల్పించాలని వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల  స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి పాలకూరి అశోక్ గౌడ్ కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎస్ బి ఆర్ గార్డెన్ లో  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వేల మంది పేద విద్యార్థులకు ఫీజుల్లో రాయితీలు ఇస్తూ విద్యను అందించాను. గత పది సంవత్సరాలుగా నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వాలను లెక్క చేయకుండా పోరాటం చేస్తున్నాను. దాని ఫలితంగా గత ప్రభుత్వంలో నాపై పదుల సంఖ్యలో క్రిమినల్ కేసులు పెట్టి వేధించింది. చంచలగూడ జైల్లో పెట్టి అనేక ఇబ్బందులకు గురి చేశారు. అయినా లెక్క చేయకుండా నిరుద్యోగుల గొంతుకగా నిలబడి కొట్లాడాను. గ్రూప్ – 1, గ్రూప్-2 పరీక్షల నిర్వహణ విషయంలో నిరుద్యోగులకు జరిగిన అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ వేలమంది నిరుద్యోగులతో కలిసి టిఎస్ పిస్సి ముట్టడించి కెసిఆర్ ప్రభుత్వాన్ని ఎండగట్టాను. మెగా డిఎస్సీ వేయాలని, గూప్- 2, గూప్ 3 లలో పోస్టులను పెంచాలని, పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో ఎత్తు తగ్గించాలని, జీవో నెంబర్ 46ను తొలగించాలని, గురుకుల ఉద్యోగాలను సంపూర్ణంగా నింపాలని, టెట్ నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ చేస్తూ ఐదు రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి నిరంతరం నిరుద్యోగుల పక్షాన నిలబడుతూ కేసులను లెక్కచేయకుండా అలుపెరగని పోరాటం చేశానని పేర్కొన్నారు.  నిరుద్యోగుల సమస్యలు ఇప్పటికి అలాగే ఉన్నాయి. నిరంతరం ప్రభుత్వంపై పోరాడితేనే నిరుద్యోగుల సమస్యలు ఓ కొలిక్కి వస్తాయని ధృడ సంకల్పంతో ఉన్న నాకు, నిరుద్యోగులపై పూర్తి అవగాహన ఉంది. ఏ ప్రభుత్వం పనితీరు అయినా నిర్లక్ష్యంగానే ఉంటుంది. అందుకే నిరుద్యోగుల గొంతుకగా ప్రశ్నించేందుకు ఎమ్మెల్సీగా బరిలోకి దిగుతున్నాను. గురుకుల ఉపాధ్యాయులు పడుతున్న మానసిక వేదనలు అంతా ఇంతా కాదు. ఒక అధ్యాపకుడిగా ఉపాధ్యాయుల బాధలేంటో తెలిసిన వాడిని. వేతన జీవులుగా పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు అనేక ఇబ్బందులు ఉన్నాయి. నిరుద్యోగుల, ఉద్యోగుల సమస్యలపై కొట్లాడేందుకు అవకాశం కల్పించాలని, ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.ఈ సమావేశంలో కిరణ్, నవీన్, సురేష్, శ్రీనివాస్, శోభ, మంజుల, రాధిక, హైమావతి, రాణి, ముత్యం, సురేష్,  మహేష్, విగ్నేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love