ఓటింగ్‌ బలం తగ్గినా అధికారం నిలబెట్టుకున్న ఎఎన్‌సి

జోహానెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికాలో బుధవారం జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (ఎఎన్‌సి) తన మెజారిటీని నిలబెట్టుకుంది. శనివారానికి 99శాతానికి పైగా ఓట్ల లెక్కింపు పూర్తయిన నేపథ్యంలో ఇప్పటికే ఎఎన్‌సికి 52.88 శాతం ఓట్లు లభించాయి. దీంతో రాబోయే ఐదేళ్ల కాలానికి ఎఎన్‌సి తన పట్టును నిలబెట్టుకోనుంది. ఆదివారం అధికారికంగా తుది ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. వచ్చే గురువారం ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినదీ నిర్దిష్టంగా వెల్లడిస్తారు. అయితే 2019లో ఎఎన్‌సికి 62.94 శాతం ఓట్లు రాగా, ఈసారి అది 52.3 శాతానికి తగ్గింది. ఆ మేరకు ప్రత్యర్థులు లాభపడ్డారు. ప్రధాన ప్రతిపక్షమైన డెమోక్రటిక్‌ అలయెన్స్‌ (డిఎ) 2019లో సాధించిన 17.05శాతానికి మరో 4.26శాతం ఓట్లు కలుపుకుని మొత్తంగా 21.31శాతం ఓట్లు వచ్చాయి. మరో ప్రతిపక్షమైన ఇఎఫ్‌ఎఫ్‌కు గత ఎన్నికల్లో 11.06శాతం ఓట్లు రాగా, ఈసారి ఆ వాటా 13.09శాతానికి పెరిగింది. ఫ్రీడమ్‌ ఫ్రంట్‌ ప్లస్‌ పార్టీకి 3.71శాతం నుండి 2.49శాతానికి ఓట్లు తగ్గాయి. ఈ ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగిందని మరో పార్టీ ఎసిటి (ఆఫ్రికన్‌ కాంగ్రెస్‌ ఫర్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌) నేత విమర్శించారు. ఆ పార్టీకి కేవలం 1.39శాతం ఓట్లే వచ్చాయి. పోలింగ్‌లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వెస్ట్రన్‌ కేప్‌లోని ప్రతిపక్ష పార్టీలు రీకౌంటింగ్‌కు డిమాండ్‌ చేశాయి.

Spread the love