– నిర్వాసితులు 70 కుటుంబాలు…
– మూడు గ్రామాల్లో వేలాది ఎకరాలలో పంట నష్టం…
– ప్రభుత్వ ఆసరా కోసం ఎదురుచూపులు…
– ప్రశ్నార్ధకంగా ప్రాజెక్టు పరీవాహక సాగు….
నవతెలంగాణ – అశ్వారావుపేట
అర్ధం శతాబ్ధం పాటు మూడు మండలాల్లోని 16 వేల ఎకరాలకు సాగునీరు అందించిన జలాశయం పెద్ద ఎత్తున సామర్ధ్యం మించి వచ్చిన పడిన అదే వరదకు గండి పడి కరకట్ట కొట్టుకుని పోవడంతో ప్రస్తుతం నిర్జలం గా,నిర్జీవంగా మారింది. దీంతో ఈ ప్రాజెక్ట్ పరిధిలోని సాగు నేలలు ఈ వరదలతో కూడిన ఇసుక,రాళ్ళతో కప్పబడి ఎడారి ని తలపిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి పెద్ద వాగు ప్రాజెక్ట్ లోకి ఊహించని విధంగా సామర్ధ్యం మించి వరద నీరు వచ్చి పడటంతో గేట్ల పైనుండి పొంగి కరకట్ట పైనుండి వరద నీరు ప్రవహించడంతో ఈ నెల 18 గురువారం రాత్రి భారీగా గండి కొట్టింది. ఈ క్రమంలో వరద ప్రవాహ దాటికి గుమ్మడవల్లి గ్రామం కొంత నీట మునిగింది. ముందస్తు చర్యలో భాగంగానే అధికారులు గ్రామస్తులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఉన్నఫలంగా గ్రామస్తులను అధికారులు ఖాళీ చేయించడంతో ఇంట్లో ఉన్న సామాగ్రిని వదిలేసి ప్రాణ భయంతో బయటకు వెళ్లిపోయారు. వారిని ఖాళీ చేయించిన కొద్ది నిమిషాల్లోనే కరకట్ట గండి పడటంతో గ్రామంలో ఉన్న గృహ పరికరాలు, వంట సామాగ్రి, బట్టలు, ఆవులు, గేదెలు కొన్ని ప్రవాహంలో కొట్టుకుపోయాయి.
వరద ప్రవాహానికి పంట పొలాలలో భారీగా ఇసుక మేటలు వేసి ఉండటం ఆ ఇసుక మేటలు తొలగించడానికి భారీగా వ్యయం అయ్యే పరిస్థితి ఉంది.ఇక ఈ ఏడాది సాగు పరిస్థితి అంతుపట్టడం లేదని రైతులు బెంబేలెత్తుతున్నారు.వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు. గాండ్లగూడెం,నారాయణపురం మధ్యగల బ్రిడ్జి వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. గుమ్మడి వల్లి,కొత్తూరు,అనంతారం గ్రామాల్లో 70 కుటుంబాలు నిర్వాసితులు అయ్యారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ను సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్ రావు, జిల్లా నాయకులు కనకయ్య, పుల్లయ్య, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తోపాటు జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్.పీ రోహిత్ రాజు, నీటి పారుదల శాఖ సీ.ఈ శ్రీనిధి రెడ్డిలు ప్రాజెక్ట్ ను పరిశీలించి తగు చర్యలు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.