కరీంనగర్ తర్వాత రాష్ట్రంలో
రెండో కేంద్రంగా కంసాన్‌పల్లి
త్వరలో పూర్తి స్థాయిలో సేవలు ప్రారంభిస్తాం
షాద్ నగర్‌లో 3500 ఇండ్ల మంజూరుకు ఎమ్మెల్యే కృషి :
రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
నవతెలంగాణ-షాద్ నగర్
కంసాన్‌పల్లిలో పశు ఘనీకృత వీర్య నాలికల ఉత్పత్తి కేంద్రం త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌తోర కలిసి పశు వీర్య గణాభివృద్ధి కేంద్రాన్ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు కేంద్రం నిర్మాణం, అందుబాటులో ఉన్న సదుపాయాలు, లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణను మంత్రి, ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కరీంనగర్ తర్వాత రాష్ట్రంలో ఇలాంటి పశు ఘనీకృత వీర్య నాలికల ఉత్పత్తి కేంద్రం కంసాన్‌పల్లిలోనే ఉందని తెలిపారు. ఈ కేంద్రం పూర్తి స్థాయిలో ప్రారంభమైతే మేలు జాతి పశువుల ఉత్పత్తి గణనీయంగా పెరిగి, రైతులకు అధిక పాల ఉత్పత్తి చేసే పశువులు అందుబాటులోకి వస్తాయని అన్నారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయినా ఉపయోగంలోకి రాని ఈ కేంద్రాన్ని రూ.21 కోట్లతో అన్ని హంగులతో సన్నద్ధం చేసి త్వరలోనే ప్రారంభించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. అవసరమైన సిబ్బంది నియామకం, మౌలిక వసతుల కల్పన, సాంకేతిక ఏర్పాట్లపై అధికారులు నివేదికలు సమర్పించిన వెంటనే కేంద్రాన్ని పూర్తి స్థాయిలో వాడుకలోకి తీసుకువస్తామని పేర్కొన్నారు.
మాంసం, పాల విక్రయాల్లో తెలంగాణ మంచి పురోగతి సాధిస్తున్నప్పటికీ, పాల ఉత్పత్తిలో మాత్రం ఇంకా వెనుకబడి ఉందని తెలిపారు. అనంతరం ఫరూఖ్‌నగర్ మండలం అన్నారం గ్రామంలో గిరిజన మహిళ నేనావత్ జ్యోతి నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. షాద్‌నగర్ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే దూరదృష్టితో పనిచేస్తున్నారని అన్నారు. మంజూరైన 3,500 ఇందిరమ్మ ఇండ్లలో ఇప్పటికే 2,780 ఇండ్లు వివిధ దశల్లో పూర్తవుతుండగా, మరో 720 ఇండ్ల నిర్మాణం ప్రారంభం కావాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఎన్.ఆర్ సరిత, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ చప్లా నాయక్, డిప్యూటీ ఇంజనీర్ సురేష్, ఏఈ సాయినాథ్, ఎంపీడీవో శ్రీకాంత్,తహసీల్దార్ నాగయ్య, పశుసంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ గోపి, అదనపు సంచాలకులు డాక్టర్ సుబ్బారాయుడు, పశుగణాభివృద్ధి శాఖ కార్యనిర్వహణాధికారి, పశుగణాభివృద్ధి సంస్థ చైర్మెన్ సింగం చరణ్ కౌశిక్ యాదవ్, పీవీ నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ జ్ఞానప్రకాశ్, కంసాన్‌పల్లి సర్పంచ్ గీతా నరేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ అగ్గనూర్ బసవేశ్వర్, వైస్ చైర్మెన్ అందే మోహన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.



