Monday, July 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజాతీయ రహదారిపై మృత్యుఘోష

జాతీయ రహదారిపై మృత్యుఘోష

- Advertisement -

వారం రోజుల్లోనే 
రెండు ఘోర ప్రమాదాలు
ఆరుగురు మృతి.. 
ఎనిమిది మందికి తీవ్ర గాయాలు
ఫ్లైఓవర్ పనుల జాప్యం,
 ట్రాఫిక్ రద్దీపై ప్రజల ఆందోళన

నవతెలంగాణ- నల్లగొండప్రాంతీయ ప్రతినిధి
హైదరాబాద్–విజయవాడలను అనుసంధానించే జాతీయ రహదారి–65 (ఎన్ హెచ్-65)పై నల్లగొండ జిల్లా చిట్యాల మండల పరిధిలోని గుండ్రాంపల్లి–పెద్దకాపర్తి ప్రాంతం వరుస రోడ్డు ప్రమాదాలతో ‘మృత్యుమార్గం’గా మారుతోంది. కేవలం వారం రోజుల వ్యవధిలో జరిగిన రెండు ఘోర ప్రమాదాల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడడం ప్రయాణికులను కలవరపెడుతోంది. ప్రమాదాలకు అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్‌తో పాటు అసంపూర్తిగా ఉన్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులు, ఇరుకైన సర్వీస్ రోడ్లు, ట్రాఫిక్ నిర్వహణలో లోపాలు కూడా కారణమవుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పెద్దకాపర్తి వద్ద నలుగురి మృతి
ఆదివారం చిట్యాల మండలం పెద్దకాపర్తి సమీపంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న వెర్నా కారును వెనుక నుంచి అర్షియా ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రముఖ సినీ ఎడిటర్ కట్ట శ్రీకర్ ప్రసాద్ (62), మాలిరెడ్డి విజయలక్ష్మి (40), మాలిరెడ్డి శ్రియా (17), మాలిరెడ్డి ప్రభవ్ (12) అక్కడికక్కడే మృతి చెందారు. కారు నడుపుతున్న మాలిరెడ్డి వీర వెంకటనాగవరప్రసాద్ బాబు (45) తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు.

​వారం కింద గుండ్రాంపల్లి వద్ద ప్రమాదం
​జూన్ 28న గుండ్రాంపల్లి సమీపంలో టైర్ పేలిన పికప్ వాహనం డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న రెండు కార్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో కసిరెడ్డి దేవేందర్‌రెడ్డి (52), దేప సరిత (48) చికిత్స పొందుతూ మృతి చెందగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ రోజు గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించింది.చిట్యాల, పెద్దకాపర్తి, చౌటుప్పల్‌ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ల పనులు నెమ్మదిగా సాగుతుండటం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది.

​ఘటనాస్థలిని పరిశీలించిన ఎస్పీ
పెద్దకాపర్తి ప్రమాదం అనంతరం ఎస్పీ శరత్ చంద్ర పవార్ సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. స్థానిక సీఐ, ట్రాఫిక్ అధికారులతో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు. సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను సేకరించి పూర్తి నివేదిక సమర్పించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి వాహనదారుడి పాత్ర అత్యంత కీలకం. ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, ముందు వెళ్తున్న వాహనానికి సురక్షిత దూరం పాటించకపోవడం వంటి కారణాల వల్లే ప్రాణాంతక ప్రమాదాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు.

ప్రధాన సమస్యలు
కాంట్రాక్టర్ల ఆలస్యం,నిధుల కొరత,అసంపూర్తి సర్వీస్ రోడ్లు,పూర్తి కాని అండర్‌పాస్‌లు భూసేకరణ జాప్యం, విద్యుత్, పైప్‌లైన్‌ల మార్పిడి ఆలస్యం ‌వంటి కారణాలతో రహదారి పలుచోట్ల బాటిల్‌నెక్‌గా మారి ప్రమాదాలు పెరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. బ్లాక్ స్పాట్‌గా మారిన చిట్యాల.ఈ ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు కరువయ్యాయి. రాత్రివేళ తగిన వెలుతురు లేకపోవడం గుంతలతో కూడిన సర్వీస్ రోడ్లు అసంపూర్తి నిర్మాణాలు వేగ నియంత్రణ లోపం ప్రమాదాలకు దారితీస్తున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

​ప్రత్యామ్నాయ మార్గాలపై పోలీసుల సూచనలు​
రద్దీ సమయంలో విజయవాడ–హైదరాబాద్ ప్రయాణికులు మిర్యాలగూడ–హాలియా–కొండమల్లేపల్లి–చింతపల్లి–మాల్ మార్గాన్ని, భారీ వాహనాలు కోదాడ–హుజూర్‌నగర్–మిర్యాలగూడ మార్గాన్ని వినియోగించాలని పోలీసులు సూచిస్తున్నారు. జాతీయ రహదారుల సంస్థ వెంటనే ఫ్లైఓవర్ నిర్మాణాలను పూర్తి చేయాలని, సర్వీస్ రోడ్లను మెరుగుపరచాలని, రిఫ్లెక్టివ్ సైన్‌బోర్డులు, హైమాస్ట్ లైట్లు, స్పీడ్ మానిటరింగ్ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -