రాష్ట్ర పోలీసు శాఖకు మరో జాతీయ అవార్డు

– గువహతిలో స్వీకరించిన అధికారులు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్ర పోలీసు శాఖకు మరో జాతీయ అవార్డు లభించింది. రాష్ట్ర పోలీసు కంప్యూటర్‌ సర్వీసెస్‌ విభాగానికి కంప్యూటర్‌ స్టాండర్డైజేషన్‌-2024 జాతీయ అవార్డు అందింది. ఈ అవార్డును అసోంలోని గువహతిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పవన్‌ కుమార్‌ అందజేశారని రాష్ట్ర పోలీసు సాంకేతిక విభాగం అదనపు డీజీ వి.వి శ్రీనివాస్‌రావు తెలిపారు. ముఖ్యంగా, ఈ-పెట్టీ కేసుల పరిష్కారంలో అన్ని రాష్ట్రాల కంటే మెరుగైన ఫలితాలను సాధించినందుకు గానూ ఈ అవార్డును ప్రకటించారని ఆయన చెప్పారు. చిన్న నేరాలకు సంబంధించి రాష్ట్రంలో నమోదవుతున్న ఈ-పెట్టీ కేసుల కారణంగా కోర్టులలో పెండింగ్‌ కేసుల సంఖ్య కూడా తగ్గుతున్నదని తెలిపారు. ఈ అవార్డును రాష్ట్ర పోలీసు, కంప్యూటర్‌ సర్వీసెస్‌ తరఫున డీఎస్పీ కిరణ్‌ కుమారీ అందుకున్నారని డీజీ చెప్పారు. ఈ అవార్డు సాధనకు కృషి చేసిన పోలీసు కంప్యూటర్‌ సర్వీసెస్‌(పీసీఎస్‌) విభాగానికి చెందిన అధికారులు, సిబ్బందిని వి.వి శ్రీనివాస్‌రావు అభినందించారు.

Spread the love