Wednesday, July 15, 2026
E-PAPER
Homeజాతీయంమమతా బెనర్జీకి మరో షాక్

మమతా బెనర్జీకి మరో షాక్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. టీఎంసీలో కీలక నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే మదన్ మిత్ర ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. రీతాబ్రతా బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు టీఎంసీ వర్గంలో ఆయన చేరారు. కమర్హతి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మిత్ర పార్టీని వీడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ లక్ష్యంగా ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘పార్టీ నాశనమైపోతోంది.. పడవ మునిగిపోతోంది. ప్రజలు చనిపోతున్నారు. అయినా సరే, అభిషేక్ బెనర్జీని ఎలాగైనా కాపాడుకోవాలనే ధోరణిలోనే పార్టీ నిర్ణయాలు ఉన్నాయి. అభిషేక్ కనీసం ఆరు నెలలు లేదా ఏడాది పాటు పక్కకు తప్పుకోవాలని, పార్టీని మేము నిర్మిస్తామని స్వయంగా ఆయనకే సూచించాను. కానీ ఆయన దానికి నిరాకరించారు. పార్టీ అందరిదీ కాకుండా.. కేవలం అభిషేక్ బెనర్జీ చుట్టూనే తిరుగుతోంది.’ అంటూ మదన్ మిత్ర సంచలన ఆరోపణలు గుప్పించారు.

తన రాజీనామాపై స్పందిస్తూ, ‘తాను ప్రస్తుతం సాంకేతికంగా ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ, కార్యాచరణ పరంగా తృణమూల్‌తో అన్ని బంధాలనూ తెంచుకున్నానని’ స్పష్టం చేశారు. అలాగే మమతా బెనర్జీకి సవాల్ విసురుతూ… ‘ఇదొక మారథాన్ లాంటిది. రేసులో ఏ గుర్రం ముందుకెళ్తుందో కాలమే నిర్ణయిస్తుంది’ అని వ్యాఖ్యానించారు.

రోజురోజుకూ ముదురుతున్న విభేదాలు

ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. ఆ ఓటమి తర్వాత పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రోడ్డుకెక్కాయి.

తిరుగుబాటు వర్గం చేతిలోకి ప్రధాన కార్యాలయం: రీతాబ్రతా బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు వర్గం ఇప్పటికే పార్టీ ప్రధాన కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడంతో వివాదం పతాక స్థాయికి చేరింది.

డ్యామేజ్ కంట్రోల్ ఫెయిల్: పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు మమతా బెనర్జీ స్వయంగా పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. పార్టీని గాడిలో పెట్టేందుకు మదన్ మిత్ర, కునాల్ ఘోష్‌లను జనరల్ సెక్రటరీలుగా నియమిస్తూ ప్రకటన కూడా చేశారు.

నియామకం జరిగిన కొన్ని రోజులకే ట్విస్ట్: మమతా బెనర్జీ తనను జనరల్ సెక్రటరీగా నియమించిన కొద్ది రోజులకే మదన్ మిత్ర తిరుగుబాటు వర్గంలో చేరడం దీదీ నాయకత్వానికి ఎదురుదెబ్బగా మారింది.

ఇటీవలి ఎన్నికల ఓటమి ఒకవైపు, పార్టీ కీలక నేతలు ఒక్కొక్కరుగా తిరుగుబాటు బావుటా ఎగురవేయడం మమతా బెనర్జీని ఆత్మరక్షణలో పడేశాయి. ముఖ్యంగా కుటుంబ పాలన, అభిషేక్ బెనర్జీకి ఇస్తున్న ప్రాధాన్యంపై పార్టీ సీనియర్లలో ఉన్న అసంతృప్తి ఇప్పుడు బహిర్గతమవుతోంది. రాబోయే రోజుల్లో ఈ తిరుగుబాటు వర్గం మరింత బలం పుంజుకుంటుందా? మమతా బెనర్జీ ఈ సంక్షోభం నుంచి పార్టీని ఎలా గట్టెక్కిస్తారు? అనేది ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన అంశంగా మారింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -