కల్తీమందులు.. ఎన్నికల బాండ్లు..!

Counterfeit drugs.. Election bonds..!అవినీతి, అశ్రిత పక్షపాతం, కర్తవ్య నిర్వహణలో నిర్లక్ష్యం, ఇందులో ఏ ఒకటిగాని, లేదా అన్ని కానీ… ఫార్మా రంగంలో కల్తీ మందుల ఉత్పత్తి, అవకతవకలకు కారణమై ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు ఏ అగచాట్లు పడుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు చూస్తూ మిన్నకుం టున్నాయి. మే9, 2021 కోవిడ్‌ రెండో అల తీవ్రంగా ఉన్న రోజుల్లో డా.జితేంద్రపాల్‌కి ఝాన్సీలో ఓఘటన, మరో ఆస్పత్రిలో ఘటనలో యాంటీ వైరల్‌ ఇంజక్షన్‌ రెండెసివిర్‌ ఇచ్చిన తరువాత కోవిడ్‌ పేషెంట్ల పరిస్థితి విషమిస్తోందనీ, తీవ్రమైన చలిజ్వరంతోపాటు రక్తంలోని ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోతున్నాయని అర్థమైంది. దీనికి కారణం రెండెసివిర్‌ ఇంజక్షన్‌ బ్యాచ్‌ నెంబర్‌ V100167 కారణం. ఈ ఇంజక్షన్‌ను గుజరాత్‌లోని జైడస్‌ క్యాడిల్లా కంపెనీ తయారు చేసింది. రెండెసివిర్‌ యాంటీ వైరస్‌ మందు.
డా.పాల్‌ అతని ఇతర సహచరులు అనుమానించింది ఎమిటంటే, ఈ మందులోని ఇతర పదార్థమేదో ఈ విషమ పరిస్థితికి కారణం. కానీ వారివద్ద దానిని పరీక్షించడానికి సమయం లేకపోయింది. ఆసుపత్రి నిండా కోవిడ్‌ రోగులు, డాక్టర్ల లేమి, ఇంతమంది రోగుల చికిత్స ఒకపెద్ద ఛాలెంజ్‌ అక్కడి డాక్టర్లకి ”ఈ పరిస్థితుల్లో మేము చేయగలిగిందల్లా ఈ విషయాన్ని పైకి రిపోర్ట్‌ చేసి మా విధుల్లో నిమగమవడమే” అన్నారు డా. పాల్‌. రెండెసివిర్‌కి బదులుగా మరో బ్రాండ్‌ మందును కొనమని రోగుల కుటుంబాలతో చెప్పారు. రెండెసివిర్‌ వాడటం మానిన తరువాత రోగుల పరిస్థితి మెరుగుపడిందని డా.పాల్‌ వివరించారు.
జైడస్‌ క్యాడిల్లా గుజరాత్‌ కంపెనీ కాబట్టి ‘గుజరాత్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌’ది చాలా పెద్ద బాధ్యత. కానీ అది తన బాధ్యతను పూర్తిగా విస్మరించింది అంటుంది ‘మింట్‌’. ఝాన్సీలో జరిగింది ఎడారిలో ఇసుక రేణువు లాంటి సంఘటన. మే 2021లోనే ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, బీహార్‌లలోని డజనుకి పై బడిన ఆసుపత్రులలో రెండేసివిర్‌ వాడిన తరువాత రోగుల పరిస్థితి విషమించిన రిపోర్టులున్నాయి. అన్నీ కూడా ఆ మందు బాచి నెంబర్‌ V100167కి అటూ ఇటూగా ఉన్న బాచిలే. అన్నీ కూడా జైడస్‌ క్యాడిల్లా కంపెనీ ఉత్పత్తి చేసినవే. దీన్ని యూపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది.ఈ మందు రోగులపై ప్రతికూల ప్రభావం చూపి ప్రాణాంతకమైనప్పటికీ ఒక్క బీహార్‌ తప్ప మిగిలిన రాష్ట్రాల్లోని డ్రగ్‌ నియంత్రణ సంస్థలు స్పదించలేదు. మింట్‌ పత్రిక ప్రకారం ఆయా సంస్థలు బాధ్యతారహితంగా ప్రవర్తించాయి. ఈ మందుపై పరీక్షలు జరిపి కంపెనీ నుండి వివరణ, సంజాయిషీ అడగాల్సిన ఈసంస్థలు ఆపని మాత్రం చేయలేదు. ‘మింట్‌’కి అందిన సమాచారం ప్రకారం..గుజరాత్‌ ఎఫ్‌డీసీఏ సంబంధిత సమస్యపై తమ లాబరేటరీలో పరీక్షించలేదని ఈమందుల్ని వెనక్కి తెప్పించిన రుజువులు కూడా ఏమీలేవని తెలిసింది. గుజరాత్‌ ఎఫ్‌డీసీఏ తాము పంపిన ఈమెయిల్స్‌కి కూడా స్పందించలేదంటుంది ‘మింట్‌’ పత్రిక.
జైడస్‌ క్యాడిల్లా గుజరాత్‌లో ఉండడటం వల్ల ఈ కంపెనీ మందుల ప్రామాణ్యతను నిర్ధారించాల్సింది గుజరాత్‌ ఎఫ్‌డీసీఏ అదే ఈ కంపెనీకి ఈ మందులు ఉత్పత్తి చేయడనికి అనుమతి ఇచ్చింది. రెండేసివిర్‌ మందు సబ్‌-స్టాండర్డ్‌ మందని బీహార్‌ నియంత్రణ సంస్థ గుజరాత్‌ ఎఫ్‌డీసీఏ తెలిపినప్పటికీ ఈమందుల్ని పరీక్షించలేదు. గుజరాత్‌ ఎఫ్‌డీసీఏ జాయింట్‌ కమిషనర్‌ సబ్‌-స్టాండర్డ్‌ మందులున్న బాచీలు V100153, 156, 166, 167, 179, ూ100 148 తమ లాబొరేటరీకి పరీక్షార్థం రాలేదని మింట్‌కి తెలిపారు. డ్రగ్స్‌ అండ్‌ కాస్మెటిక్స్‌ చట్టం ప్రకారం ప్రతి సబ్‌-స్టాండర్డ్‌ ఉత్పత్తులని వెనక్కి తీసుకోవాలిసిన బాధ్యత ఆ కంపెనీలది, లేదా ఆ రాష్ట్ర ఎఫ్‌డీసీది. గుజరాత్‌ ఎఫ్‌డీసీఏ ఈమందుల్ని వెనక్కితీసుకున్నట్లు రుజువులు లేవు. ఈ కంపెనీ అధికారిని ఈ విషయం అడిగినప్పుడు అతను వీటిని తోసి పుచ్చాడు.
ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ సంఘటనకు ఆరు నెలలముందే నవంబర్‌ 2020లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) రెండేసివిర్‌ మందు కోవిడ్‌ రోగులపై ప్రభావవంతం కాదని చెప్పింది. డబ్ల్యూహెచ్‌ఓ దీనిపై చాల విపులంగా అధ్యయనం చేసింది. మార్చ్‌ 22, 2020 నుండి జనవరి 29 2021 వరకు, తమ ఆరు రీజియన్లలోని 35 దేశాల్లో 450 అసత్ర్రుల్లో సుమారు 14వేల మంది రోగులపై విస్తారంగా పరీక్షలు జరిపిన నివేదిక ప్రచురించింది. కాని మన ప్రభుత్వం ఆ మందు ఉత్పత్తిని పెంచడానికి ఒప్పుకుంది.
ఎన్నికల బాండ్ల డేటా వల్ల తేలిందేమిటంటే, ఈ జైడస్‌ క్యాడిల్లా, కంపెనీ బీజేపీకి రూ.18 కోట్ల ఎన్నికల బాండ్లు ఇచ్చింది. కేంద్రంలోనూ, గుజరాత్‌ రాష్ట్రంలోనూ ఉండేది బీజేపీ ప్రభుత్వమే. సిక్కింని ఫార్మాహబ్‌ అంటారు. సిక్కిం క్రాంతికారి మోర్చాకి ఎలక్టోరల్‌ బాండ్లు ఇచ్చిన ఐదు కంపెనీలలో 4 ఫార్మా కంపెనీలే. 1. జైడస్‌ క్యాడిల్లా, (8 కోట్లు) 2.టోరొంట్‌ ఫార్మా (7 కోట్లు) 3. మైక్రో లాబ్స్‌ (7 కోట్లు) 4. ఇప్కా ల్యాబ్స్‌ (3.5 కోట్లు) 5వ కంపెనీ ఫ్యూచర్‌ గేమింగ్‌ అండ్‌ హోటల్‌ సర్వీసెస్‌. ఇది వాస్తవంగా లాటరి టిక్కెట్లు అమ్ముకునే సంస్థ. (11 కోట్లు) క్వాలిటీ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన కంపెనీలు రాజకీయ పార్టీలకి ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో డబ్బులు ఇచ్చారని పేర్కొంది ‘స్క్రోల్‌’. (మార్చ్‌ 18, 2024) గ్లెన్‌మార్క్‌ మందుల కంపెనీ ఉత్పత్తి చేస్తున్న ‘బీపీ’ని కంట్రోల్‌ చేయడానికి ఉపయోగించే మందు టెల్మా తక్కువ ప్రమాణాల మందు అని, సరైన ప్రమాణాలు పాటించనందుకు మహారాష్ట్ర ఎఫ్‌డీసీఏ ఈ కంపెనీకి 2022, 2023 మధ్య నాలుగు నోటీసులు పంపింది. ఎన్నికల బాండ్ల డేటా వల్ల తెలుస్తుందేమిటంటే ఈ కంపెనీ ఎన్నికల బాండ్ల ద్వారా బీజేపీకి రూ.9 కోట్లు ఇచ్చింది. టోరొంట్‌ ఫార్మా తెల్లరక్త కణాల కోసం ఉత్పత్తి చేస్తున్న డెప్లాట్‌ -150 తక్కువ ప్రమాణాలు కలదని 2019లోనే అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీసీఏ) ఈ కంపెనీ వార్నింగ్‌ ఇచ్చింది. ఇలాంటి నోటీసు వచ్చినప్పుడు సహజంగానే ప్రభుత్వం కంపెనీ ఉత్పత్తి లైసెన్స్‌ రద్దు చేయాలి. కానీ, ఈ కంపెనీ ఉత్పత్తి యూనిట్లు గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లలో ఉన్నాయి. ఇక్కడి ప్రభుత్వాలు ఈ కంపెనీపై ఎలాంటి చర్య తీసుకోలేదు. మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌ సింగ్‌ ప్రభుత్వం ఉంది. ఎన్నికల బాండ్ల డేటా ప్రకారం టోరొంట్‌ ఫార్మా 2019 నుండి ఏప్రిల్‌ 2024 వరకు రూ.77.5 కోట్ల ఎన్నికల బాండ్లు కొన్నది. బీజేపీ 61 కోట్లు, ఎస్‌కేఎం 7 కోట్లు, కాంగ్రెస్‌ 5 కోట్లు, ఎస్‌పీ 3 కోట్లు, ఆప్‌ కోటి, సిక్కిం డీఎఫ్‌ 0.5 కోట్లు నగదు చేసుకున్నట్లు తెలుస్తోంది.
మహారాష్ట్ర ఎఫ్‌డీసీఏ, సిప్లా కంపెనీకి నాణ్యత లేని మందులు ఉత్పత్తి చేసినందుకు గాను 2018- 2022 మధ్య నాలుగు షోకాజ్‌ నోటీసులు ఇచ్చింది. 2019 నుండి ఈ కంపెనీ 39.2 కోట్ల విలువగల ఎన్నికల బాండ్లు కొన్నది. 2018లో ఇది ఉత్పత్తి చేసిన దగ్గు మందు లోపభూయిష్టమైందని తేలింది. ఆ మరుసటి ఏడాది అంటే 2019లో ఈ కంపెనీ 14 కోట్ల ఎన్నికల బాండ్లు కొన్నది. జులై 2021 నాటికి సిప్లా కంపెనీ రెండుసార్లు నోటీసులు అందుకుంది. ఇది ఉత్పత్తి చేసిన కోవిడ్‌ రోగులకిచ్చే రెండేసివిర్‌ మందు సిప్రెమిలో రెండేసివిర్‌ కావలిసిన దానికంటే తక్కువ మోతాదులో ఉండటంవల్ల నోటీసులు అందుకుంది. ఆ తరువాత నవంబర్‌ 2022లో ఈ కంపెనీ రూ.25.2 కోట్ల విలువగల బాండ్లు కొన్నది. 2019లో ఇది రూ.14 కోట్ల బాండ్లు కొని ఉంది. మొత్తం 39.2 కోట్ల విలువగల బాండ్లు. అందులో బీజేపీ రెండుసార్లు, మొదట 30 కోట్లు, రెండోసారి 7 కోట్లు, అలాగే కాంగ్రెస్‌ 2.2 కోట్ల బాండ్లను నగదుగా మార్చుకుంటాయి. ఈ కంపెనీ ముంబాయిలో కొన్న బాండ్ల కాలక్రమాన్ని గమనిస్తే, జులై 2019, అక్టోబర్‌ 2019 మధ్య అది రూ.14 కోట్ల బాండ్లు కొన్నది. అప్పుడు మహారాష్ట్రలో దేవేంద్ర పడ్నవిస్‌ (బీజేపీ) ప్రభుత్వం ఉంది. నవంబర్‌ 2019లో ఉద్దవ్‌ థాక్రే ప్రభుత్వం వచ్చింది. ఉద్దవ్‌ థాక్రే జూన్‌ 2022 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తరువాత జరిగిన నాటకీయ పరిణామాలవల్ల, ఏకనాథ్‌ షిండే ప్రభుత్వం ఏర్పడింది. అప్పుడు ఈ కంపెనీ తిరిగి నవంబర్‌ 2022లో 25.2 కోట్ల బాండ్లు కొన్నది.
ఉజ్బెకిస్తాన్‌ ప్రభుత్వం తీసుకున్న చర్యలు
భారతదేశంలో తయారైన దగ్గుమందు వల్ల ఉజ్బెకిస్తాన్‌లో 18 మంది పిల్లలు మరణిస్తారు. ఆ తరువాత నెలలో ఇండియాలో ఉత్పత్తి అయిన రెండు దగ్గుమందుల వల్ల ఈ పిల్లలు మరణించినట్టు డబ్ల్యూహెచ్‌ఓ చెబుతూ ఒక హెచ్చరిక జారీ చేసింది. నోయిడాలోని మారియన్‌ బయోటెక్‌ ఉత్పత్తి చేసిన మందులు పిల్లలకు ఇవ్వొద్దంటూ ఆ హెచ్చరిక. ఉజ్బెకిస్తాన్‌ ఈ మందులపై పరీక్షలు జరిపితే ఇవి పిల్లలకు ప్రమాదమని తేల్చింది.ఈ విషాదకర సంఘటన తరువాత అక్కడి ఆరోగ్య శాఖ ఈ కంపెనీ లైసెన్స్‌ రద్దు చేయాలని కోర్టులో కేసు వేసింది. అక్కడి కోర్టు దీనికి కారణమైన 23 మందికి రెండు నుండి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇందులో ఒకరు రాఘవేంద్ర ప్రతాప్‌ సింగ్‌, ఈయన ‘క్వరామాక్స్‌’ కంపెనీకి ఇండియన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌. ఈయనకి కోర్టు 20 ఏండ్ల జైలు శిక్ష పడింది. మారియాన్‌ బయోటెక్‌ తమ దగ్గుమందు తయారీకి కావలసిన ముడిపదార్థం’ మాయా కెంటేక్‌ ఇండియా’ అనే వ్యాపారినుండి కొన్నట్టు రాయిటర్స్‌ తెలిపింది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ ‘మాయా కెంటేక్‌ ఇండియా’కి ఫార్మాస్యూటికల్‌ గ్రేడ్‌ రసాయనాలు అమ్మే లైసెన్సే లేదు. దానికి కేవలం ఇండిస్టియల్‌ గ్రేడ్‌ రసాయనాలకు మాత్రమే లైసెన్స్‌ ఉంది. దీనిని లిక్విడ్‌ డిటర్జెంట్‌ తయారీకి, పెయింట్ల తయారీకి వాడతారు. ఈ విషయమై మాయాకేంటేక్‌ ఇండియాని ప్రశ్నిస్తే, మా Propylene glycol ని మారియాన్‌ బయోటెక్‌ దగ్గు మందు తయారీకి వాడుతున్న విషయం మాకు తెలియదు’ అంటుంది. మారియాన్‌ అధినేత రాయిటర్స్‌తో మాట్లాడుతూ ”మేము గత పదేళ్లుగా ఈ మందుని Propylene glycolలో మలినాల గురించి ఏ విధమైన పరీక్షలు జరపకుండానే ఎగుమతి చేస్తున్నట్లు చెప్పారు. ఏ ఎగుమతి దారుడు కూడా ఈ పరీక్షలు నిర్వహించరు అని కూడా తెలిపారు. హెల్త్‌ యాక్టీవిస్ట్‌ దినేష్‌ ఠాకూర్‌ ట్విట్టర్‌లో: ఈ బిల్లుని పార్లమెంటులో పెద్దగా చర్చ లేకుండానే ఆమోదించడం చాలా తప్పు అన్నారు. మహారాష్ట్ర ఎఫ్‌డీసీఏ ”హెటిరో” కంపెనీకి లోపభూయిష్టమైన మందులు ఉత్పత్తి చేస్తున్నందుకు ఆరు నోటీసులు ఇచ్చింది. ఇందులో మూడు రెండేసివిర్‌ ముందుకి సంబంధించి అయితే మరో మూడు యాంటీ ఫంగల్‌ ముందుకి సంబందించినవి. కంపెనీ రూ.40 కోట్ల ఎన్నికల బాండ్లు కొన్నది. ఈ సంస్థ రూ.120కోట్ల ఎన్నికల బాండ్లు బీఆర్‌ఎస్‌కి ఇచ్చింది. ఈ కంపెనీ ఫౌండర్‌ చైర్మన్‌ ‘బండి పార్థసారథిరెడ్డి’ని బీఆర్‌ఎస్‌ 2022లో రాజ్యసభ మెంబెర్‌ని చేసింది. ఇలా తవ్వినకొద్దీ ఫార్మా రంగంలో లుకలుకలు బయటపడుతున్నాయి. ఇవి పిసరంత మాత్రమే. బయటపడనివి ఇంకెన్నో.
(ఈ సమాచారం లైవ్‌ మింట్‌ నుంచి, ధృవ్‌ రాఠీ యూట్యూబ్‌ ఛానల్‌ నుంచి గ్రహించబడింది)
– సేకరణ, సంకలనం: పి.జయప్రకాష్‌

Spread the love