ప్రజావాణి ద్వారా వచ్చే దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: నవీన్ మిట్టల్

– సబ్ రిజిస్టర్ కార్యాలయానికి భవనం లేదా భూమి కేటాయింపు
– పెండింగ్ ధరణి దరఖాస్తుల పరిష్కారాన్ని తీసుకోవాల్సిన చర్యల పై జిల్లా కలెక్టర్లు ,అదనపు కలెక్టర్లు తహసిల్దారులతో వీడియో కాన్ఫరెన్స్
నవతెలంగాణ –  సిరిసిల్ల
ప్రత్యేక కార్యాచరణ ద్వారా పెండింగ్ ధరణి సమస్యలను పరిష్కరించాలని సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్  హైదరాబాద్ సీసీఎల్ఏ కార్యాలయం నుంచి రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, మెదక్ సిద్దిపేట జిల్లా కలెక్టర్లతో పెండింగ్ ధరణి సమస్యల పరిష్కారం పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ నిర్వహించారు. సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ.. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన కంటే ముందు మార్చ్ ఒకటి నుంచి మార్చి 15 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి రూ.1.38 లక్షల పెండింగ్ ధరణి దరఖాస్తులను పరిష్కరించామని అన్నారు. ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తుల పరిష్కారానికి మరోసారి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని, తహసిల్దార్ స్థాయిలో రెవెన్యూ డివిజన్ అధికారి స్థాయిలో అదనపు కలెక్టర్ స్థాయిలో కలెక్టర్ స్థాయిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రణాళిక బద్ధంగా కృషి చేయాలని అధికారులకు సూచించారు.
సక్సేషన్, పెండింగ్ మ్యూటేషన్ వంటి దరఖాస్తులను రికార్డులు పరిశీలించి వెంటనే పరిష్కరించాలని, డేటా కరెక్షన్ దరఖాస్తులు క్షేత్రస్థాయి  విచారణ చేపట్టిన తర్వాత పరిష్కరించాలని అన్నారు.  మండలాల వారిగా పెండింగ్ దరఖాస్తులను రివ్యూ చేసుకోవాలని, అధికంగా పెండింగ్ ఉన్న మండలాలకు అవసరమైన అదనపు సిబ్బంది కేటాయించాలని ఆయన సూచించారు. ధరణి వెబ్ సైట్ సంబంధించి జి.ఎల్.ఎం, టి.ఎం 33 దరఖాస్తులలో డిజిటల్ సంతకాల ప్రక్రియ మార్పులు చేస్తున్నామని, కొన్ని సమస్యలు తహసిల్దార్ స్థాయిలో మరికొన్ని సమస్యలు రెవెన్యూ డివిజన్ అధికారి మరికొన్ని సమస్యలు కలెక్టర్ స్థాయిలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి మంగళవారం శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం లో వచ్చే భూ సంబంధిత సమస్యలను సైతం కలెక్టర్లకు బదిలీ చేయడం జరుగుతుందని వీటిని అత్యంత ప్రాధాన్యతతో సత్వర పరిష్కారం జరిగేలా చూడాలని సిసిఎల్ఏ కమిషనర్ పేర్కొన్నారు. ప్రతి మండలంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం ఏర్పాటుకు అనువైన భవనం లేదా భూమి కేటాయించి ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్లకు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సంబంధిత అధికారులతో  *జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ.. సిరిసిల్ల జిల్లాలో పెండింగ్ ఉన్న ధరణి దరఖాస్తులను ప్రణాళిక బద్ధంగా పరిష్కరించాలని, సీ.సీ.ఎల్.ఏ కమిషనర్ సూచనల ప్రకారం వీలైనంత త్వరగా పెండెన్సీ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్, సిరిసిల్ల  అర్.డి. ఓ రమేష్ , అన్ని మండలాల తాసిల్దార్లు ,  సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love