Monday, May 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమక్కలు కొనేందుకు 
మరో రూ.1800 కోట్లకు ఆమోదం

మక్కలు కొనేందుకు 
మరో రూ.1800 కోట్లకు ఆమోదం

- Advertisement -

కొనుగోళ్లపై కేంద్రం స్పందించకపోవడంతోనే ఈ నిర్ణయం : మంత్రి తుమ్మల

‌నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఎన్నిసార్లు లేఖలు రాసినా…కేంద్ర మంత్రులకు విన్నవించినా మక్కల కొనుగోళ్లపై కేంద్రం స్పందించడం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. మొక్కజొన్న కొనుగోళ్ల కోసం ఇప్పటికే కేటాయించిన రూ.4 వేల కోట్లకు అదనంగా మరో రూ.1800 కోట్లకు సీఎం రేవంత్‌‌రెడ్డి ఆమోదం తెలిపారని ప్రకటించారు. ఆదివారం ఈ మేరకు మంత్రి తుమ్మల ఒక ప్రకటన విడుదల చేశారు. యాసంగి 2025-26 సీజన్‌లో రాష్ట్రంలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందన్నారు. ఈ సీజన్ లో మొక్కజొన్న సాగు 16.13 లక్షల ఎకరాలకు పెరిగిందని చెప్పారు. ఎకరాకు సగటు దిగుబడి 26.57 క్వింటాళ్లుగా నమోదవ్వడంతో మొత్తం ఉత్పత్తి 42.87 లక్షల మెట్రిక్ టన్నులకు చేరిందనీ, రైతులకు కనీస మద్దతు ధర అందేలా ప్రభుత్వం ఇప్పటికే రూ.4,172.94 కోట్ల గ్యారంటీ ఇవ్వగా, అదనంగా మరో 6.53 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు రూ.1867.77 కోట్ల బ్యాంకు గ్యారంటీకి క్యాబినెట్‌ ‌నిర్ణయం తీసుకున్నదని వివరించారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 354 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటికే 12.85 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను 2,33,000 మంది రైతుల నుంచి సేకరించామని చెప్పారు. రూ.1100 కోట్లతో జొన్న కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పొద్దుతిరుగుడు పంటను 25 శాతానికి మించి కొనుగోలు చేయాలనీ, జిల్లాల వారీగా జొన్న కొనుగోళ్ల ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. పదేండ్లలో మొక్కొజొన్న కొనుగోళ్లకు ఖర్చు చేసిన మొత్తాన్ని తమ ప్రభుత్వం ఈ ఒక్క సీజన్లోనే ఖర్చు చేస్తున్నదని వివరించారు. జొన్న కొనుగోళ్లలో పదేండ్లలో దానికంటే ఇప్పటికే రెండింతలు ఖర్చు చేశామని తెలిపారు. రాష్ట్రంలోని రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు పంటల కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నదన్నారు. గత ప్రభుత్వం పదేళ్లలో మొక్కజొన్న కొనుగోళ్ల కోసం మొత్తం రూ.5063 కోట్ల మేర మాత్రమే ఖర్చు చేయగా, తమ ప్రభుత్వం మాత్రం రైతుల ప్రయోజనాల కోసం ఈ ఒక్క యాసంగి సీజన్‌లోనే దాదాపు రూ.6000 కోట్ల మేర వ్యయం చేస్తోందని స్పష్టం చేశారు.

ప్రస్తుతం మార్కెట్లో జొన్న ధర క్వింటాకు సుమారు రూ.2000 మాత్రమే ఉండగా కేంద్రం నిర్ణయించిన ఎమ్‌ఎస్‌‌పీ రూ.3699గా ఉందని చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.1100 కోట్లకు పైగా వ్యయంతో జొన్న కొనుగోళ్లు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4.03 లక్షల ఎకరాల్లో జొన్న సాగు జరిగి 4.03 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా ఉన్నట్లు తెలిపారు. జిల్లాల వారీగా జొన్న కొనుగోళ్లకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. గత ప్రభుత్వం పదేండ్లలో జొన్న కొనుగోళ్ల కోసం కేవలం రూ.374 కోట్లు ఖర్చుపెట్టిందని విమర్శించారు. పొద్దుతిరుగుడు పంట విషయంలో కేంద్ర ప్రభుత్వం కేవలం 25 శాతం కొనుగోలు పరిమితి మాత్రమే అనుమతించిందనీ, రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆ పరిమితికి మించి కొనుగోళ్లు చేపట్టాలని నిర్ణయించిందని వివరించారు. ప్రస్తుతం పొద్దుతిరుగుడు ఎమ్‌ఎస్‌‌పీ క్వింటాకు రూ.7721 ఉండగా మార్కెట్ ధర రూ.5376 మాత్రమే ఉండటం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కేంద్రానికి పంపిన ప్రతిపాదనలతో పాటు రాష్ట్ర పూల్ ద్వారా అదనంగా 10,175 మెట్రిక్ టన్నుల కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నామన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, మార్కెట్‌లో ధరలు స్థిరీకరించడం, రైతు ఆదాయాన్ని రక్షించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -