ఎక్కువ తాగేస్తున్నారా?

Are you drinking too much?కాఫీ మీద ఎన్నో రకాల అపోహలు ఉన్నాయి. కొందరు కాఫీ ఆరోగ్యానికి మంచిది అని చెబితే మరికొందరు కాఫీ అలవాటు చేసుకోవద్దని చెబుతారు. అయితే కాఫీలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనేది ఎక్కువ మంది అభిప్రాయం. అందుకే.. కొందరు ఉదయాన్నే కప్పు కాఫీ తాగందే వారి దినచర్యను ప్రారంభించరు. ఇది రోగ నిరోధక శక్తిని మెరుగుపర్చడానికి, రోజును ఉత్సాహంగా ప్రారంభించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే, కాఫీని ఎక్కువగా తాగడం, సమయపాలన లేకుండా తీసుకోవడం కూడా మంచిది కాదని అధ్యయనాలు చెబుతున్నాయి. దీని వల్ల ప్రయోజనాలకు బదులుగా దుష్ప్రభావాలే ఎక్కువగా ఉన్నాయని తేలింది.

బ్రిటీష్‌ జర్నల్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌లో ప్రచురించిన ఓ అధ్యయనంలో ఖాళీ కడుపుతో ఉదయాన్నే కప్పు బ్లాక్‌ కాఫీని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ప్రమాదకరంగా పెరుగుతాయని పేర్కొంది. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల నిద్రలేమి, డయాబెటిస్‌తో పాటు గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. అందువల్ల, అల్పాహారం తీసుకున్న తర్వాతే మొదటి కప్పు కాఫీ తీసుకోవటం మంచిదని పరిశోధకులు సిఫార్సు చేస్తున్నారు. అధికంగా కాఫీ తాగడం వల్ల కలిగే ఐదు దుష్ప్రభావాలు ఇలా ఉన్నాయి.
నిద్ర సమస్యలు : నిద్రపోయే ముందు కాఫీ తాగకూడదని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. నిద్ర రాకుండా చేయడానికి కాఫీ బాగా పని చేస్తుందన్న విషయం తెలిసిందే. అయితే, దీన్ని నిద్రపోయే ముందు తీసుకుంటే నిద్ర ఆలస్యమవడమే కాకుండా, నిద్రలేమిని ఎదుర్కొంటారు. దీన్ని నివారించడానికి చివరి కప్పు కాఫీని నిద్రపోవడానికి రెండు నుంచి మూడు గంటల ముందు మాత్రమే తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.
ఆందోళన : కాఫీ ఆడ్రినలిన్‌ విడుదలను ప్రేరేపిస్తుంది. అయితే ఎక్కువ కాఫీ తీసుకోవడం వల్ల, ఆందోళను పెంచుతుంది. ఇప్పటికే కెఫిన్‌ సెన్సిటివిటీ ఉన్న వారై, అధిక మొత్తంలో కాఫీ తీసుకుంటుంటే అది క్రమంగా ఆందోళన లేదా భయానికి దారి తీస్తుంది. అందువల్ల మీకు మైకం, నాడీ లేదా చేతులు వణుకుతున్నట్లు అనిపిస్తే అది ఎక్కువ కాఫీ తీసుకుంటున్న దానికి సంకేతంగా చెప్పవచ్చు. అందువల్ల ఎక్కువ మొత్తంలో కాఫీని తీసుకోకపోవడమే మంచిది.
జీర్ణ సమస్యలు : అధిక మొత్తంలో కాఫీ తీసుకోవడం శరీరంలో పేగు కదలికలను ప్రేరేపిస్తుంది. గ్యాస్ట్రోఎసోఫాగియల్‌ రిఫ్లక్స్‌ డిసీజ్‌ వంటి సమస్యలతో బాధపడుతున్నప్పటికీ, ఎక్కువ మొత్తంలో కాఫీ తీసుకుంటే, అది మరిన్ని సమస్యలకు దారి తీస్తుంది. దీని వల్ల అజీర్ణం, విరేచనాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల జీర్ణ సమస్యతో బాధపడుతుంటే కాఫీ తీసుకోవడం తగ్గించాల్సి ఉంటుంది. లేదంటే కాఫీకి బదులుగా టీని ఎంచుకోవచ్చు.
డిపెండెన్సీ : కొన్ని డ్రగ్స్‌ తీసుకోవడం వల్ల మెదడులో కెమికల్‌ రియాక్షన్‌ జరిగి అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాని కాఫీలో ఉండే కెఫిన్‌ వినియోగం మాత్రం ఇలాంటి వ్యసనానికి దారితీయదు. అయినప్పటికీ కాఫీ అధికంగా తీసుకోవడం కాలక్రమేణా మానసిక, శారీరక సమస్యలకు కారణమవుతుంది. అయితే, కాఫీని అకస్మాత్తుగా మానేస్తే తలనొప్పి, చికాకు, బద్ధకం లేదా అలసట వంటి సమస్యలు రావొచ్చు. అందువల్ల కాఫీని వ్యసనంగా చేసుకోకూడదు.
హై బీపీ, హార్ట్‌ రేటు : కాఫీ నిద్ర నుంచి మేల్కొలిపే ఔషధంగా పని చేస్తుందనే విషయం తెలిసిందే. అయితే, ఎక్కువ మోతాదులో కాఫీ తీసుకోవడం ద్వారా సెన్సిటివిటీ ఉన్నవారిలో బ్లడ్‌ ప్రెజర్‌తో పాటు హార్ట్‌ రేటు పెరుగుతుంది. ఇది క్రమంగా గుండె సమస్యలకు దారితీయడమే కాకుండా హదయ సంబంధ వ్యాధుల తీవ్రతను పెంచుతుంది. ఇటువంటి దుష్ప్రభావాలకు లోనవ్వకుండా ఉండాలంటే తక్కువ మోతాదులో కాఫీ తీసుకోవడం మంచిది.

Spread the love