కౌంటింగ్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు..

– జూన్ 4వ తేదీన పార్లమెంటు ఓట్ల లెక్కింపు
– అసెంబ్లీ నియోజకవర్గానికి 14 టేబుల్స్ కేటాయింపు
నవతెలంగాణ – భువనగిరి
జూన్ 4వ తేదీన నిర్వహించే పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు భువనగిరి పట్టణం అరోరా ఇంజనీరింగ్ కళాశాలలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఆ ప్రాంతం అంతా పోలీసుల పహారా మధ్య కట్టుదిట్టమైన భద్రతా వలయంలో ఉంది. ర్యాండమైజేషన్ ద్వారా కౌంటింగ్ సిబ్బందిని కేటాయించారు. సిబ్బంది కౌంటింగ్ రోజున ఉదయం 6 గంటల వరకు అందరూ ఓట్ల లెక్కింపు కేంద్రం వద్దకు  వచ్చేటట్లు ఆదేశాలు జారీ చేశారు. వీరితోపాటు అభ్యర్థులు, వారి తరఫున హాజరయ్యే ఏజెంట్లకు సమాచారం అందించారు.
ఉదయం 8 గంటలకు కౌంటింగ్..
జూన్ 4వ తేదీన 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నది ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపును ప్రారంభించానున్నారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ఓట్ల లెక్కింపు కోసం అవసరమైన అన్ని సదుపాయాలు కౌంటింగ్ సెంటర్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు, ముఖ్యంగా విద్యుత్ అంతరాయం తలెత్తకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. ఓట్ల లెక్కింపు ప్రశాంత వాతావరణంలో పూర్తి పారదర్శకంగా కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేలా పర్యవేక్షణ చేయనున్నారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించిన వివరాలను రౌండ్ల వారీగా ఫలితాలు వెల్లడించే సమయంలో తప్పిదాలకు తావులేకుండా జాగ్రత్తలు పాటించనున్నారు. కౌంటింగ్ సెంటర్ వద్ద  పోలీసులు నాలుగు అంచల పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.
ఒక్కొక్క అసెంబ్లీ కి 14 టేబుల్స్ ద్వారా లెక్కింపు..
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 14 టేబుల్స్ ద్వారా ఓట్ల ఓట్ల లెక్కింపు జరగనున్నది.  ముందుగా పోస్టల్ బ్యాలెట్ లను లెక్కించిన అనంతరం 14 టేబుల్స్ ద్వారా ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు . ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు మొత్తము 98 టేబుల్స్ ను లెక్కింపు కోసం వేరువేరుగా ఏర్పాటు చేశారు. సిబ్బందితోపాటు పెద్ద ఎత్తున ఏజెంట్లు ఓట్ల లెక్కింపు కేంద్రానికి రానున్నారు. ప్రధాన పార్టీలైన సిపిఎం, కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి తరఫునుండి సుమారుగా 500 మంది తోపాటు ఇతర పార్టీలు స్వతంత్ర అభ్యర్థులు మరో వెయ్యి మంది కౌంటింగ్ కేంద్రానికి రానున్నారు. ప్రతి టేబుల్ కు తహశీలుదారు స్థాయి ఎ.ఆర్.ఓ, ఒక కౌంటింగ్ సూపర్వైజరు, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్ సూపర్వైజర్లు నియమించారు. పోస్టల్ బ్యాలెట్ విధానంలో పోలింగ్ విధులలో ఉన్న సిబ్బంది,  హోమ్ ఓటింగ్ రెండు రకాలు ఉన్నాయి. ఈటిపిబిఎస్ (ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సర్వీసెస్) సర్వీస్ ఓట్లను లెక్కించడం జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పై అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు.
మైక్రో అబ్జర్వర్లు. 
ఓట్ల లెక్కింపు ప్రక్రియ పై మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేశారు కంట్రోల్ నీట్లతోపాటు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పరిశీలనకు మైక్రో అబ్జర్వర్లు ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తారు ఫలితాలను ఎప్పటికప్పుడు నమోదు చేసుకుంటారు పూర్తి వివరాలను జనరల్ అబ్జర్వర్కు నివేదికలు సమర్పిస్తారు.
మౌలిక సదుపాయాల కల్పన..
ఓట్ల లెక్కింపు సందర్భంగా మౌలిక వసతులు కల్పించనున్నారు . మంచినీరు,  ఆహారము, టెంట్లు, ఏర్పాటు చేయనున్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలో కి బయట నుండి ఎలాంటి పదార్థాలు, నీటి బాటిల్స్,  తీసుకురాకుండా ముందస్తుగానే తనిఖీలు నిర్వహించనున్నారు. విలేకరుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.
Spread the love