నేటి సీఎం సభకు ముమ్మరంగా ఏర్పాట్లు

– సభ స్థలిని పరిశీలించిన మంత్రి సీతక్క
– ఎస్పీ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు
నవ తెలంగాణ-ఆసిఫాబాద్‌
పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేటి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పర్యటనకు జిల్లా శ్రేణులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌, నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాం నాయక్‌ నేతృత్వంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం సభకు 25 నుండి 30 వేల మంది జన సమీకరణకు కాంగ్రెస్‌ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్‌ పక్కన గల మైదానంలో మధ్యాహ్నం 1 గంటకు సభస్థలిలో వీవీఐపీ గ్యాలరీల ఏర్పాటుతో పాటు సభకు వచ్చేవారికి భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సభకు సంబంధించి గ్రామాల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్‌ నాయకులు జనాలను తరలించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఎదుట జిల్లా నాయకులు వారి బలాన్ని ప్రదర్శించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ద్వితీయ శ్రేణి నాయకులు చెబుతున్నారు.
ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి సీతక్క
జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచార సభకు సీఎం రేవంత్‌ రెడ్డి హాజరు కానున్న నేపథ్యంలో మంత్రి సీతక్క ఏర్పాట్లను పరిశీలించారు. పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేశారు. ఎండ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తాగు నీరు, నీడకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. సభను విజయవంతం చేసేల శ్రేణులు మరింత కష్టపడాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌, మాజీ ఎంపీపీ బాలేష్‌ గౌడ్‌, నాయకులు అనిల్‌, అసిఫ్‌, చరణ్‌, అబ్దుల్ల పాల్గొన్నారు.
పోలీసుల పటిష్ట బందోబస్తు
నేడు జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొనడానికి వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పర్యటనకు ఎస్పీ సురేష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ప్రధాన రహదారులపై పోలీసులు పహారా నిర్వహిస్తున్నారు. నూతన కలెక్టరేట్‌ నుండి రోడ్డు మార్గం ద్వారా సభాస్థలికి చేరుకోనున్న నేపథ్యంలో ఆ మార్గంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

Spread the love