మారా కలెక్టివ్… హింసకు గురైన మహిళల స్వరాన్ని ప్రపంచానికి వినిపిస్తోంది. బాధిత అందునా దళిత మహిళలు తమ కథలను తిరిగి రాయడానికి అవసరమైన శక్తినిస్తోంది. గ్రామీణ మధ్యప్రదేశ్‌లో లైంగిక, కుల ఆధారిత హింస నుండి బయటపడినవారు దళిత మహిళా నాటక రచయితలు మారారు. నాటకాన్ని తమ ప్రతిఘటనకు ఒక సాధనంగా మలుచుకున్నారు. ఇప్పటి వరకు వినని తమ మనసులోని వేధనను ధైర్యంగా సమాజానికి చాటిచెబుతున్నారు.
మారా లైంగిక హింస, అత్యాచారానికి గురైన మొదటి వ్యక్తి కథలను వివరిస్తుంది. ‘మీలో చెప్పలేని కథను మోయడం కంటే గొప్ప వేదన మరొకటి లేదు’ అంటారు తన ‘ఐ నో వై ది కేజ్డ్ బర్డ్ సింగ్స్’ (1969) అనే కవితా సంపుటిలో ప్రముఖ రచయిత్రి మాయా ఏంజెలో. 2018లో గ్రామీణ భారతదేశంలోని దాదాపు వంద మంది మహిళలు లైంగిక, లింగ ఆధారిత హింస అనుభవాలను వివరించారు. వాటిని విన్న తర్వాత అంగారికా గుహ, అనుషి అగర్వాల్ ఓ ఆలోచన చేశారు. బెంగళూరుకు చెందిన ‘మారా’ అనే సంస్థ ఆధ్వర్యంలో ఆ బాధిత మహిళల అనుభవాలను ‘చు కర్ దేఖో’ (టచ్ అండ్ సీ) అనే నాటకాన్ని రూపొందించారు.
సామూహిక ప్రతిధ్వని
మారా కలెక్టివ్ సభ్యులలో మమతా సోలంకి ఒకరు. ఊహించలేని హింసకు గురైన తర్వాత సోలంకి నిశ్శబ్దంలోకి నెట్టబడింది. భర్త ఆమెను విడిచిపెట్టి వెళ్లిన తర్వాత ఇండ్లలో వంట చేసుకుంటూ బతికింది. అనేక కష్టాలు అనుభవించింది. ఒక రోజు క్యాటరింగ్ ఆర్డర్ ఇస్తామని చెప్పి ఆమెను సుదూర గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ ఆధిపత్య కులానికి చెందిన వ్యక్తుల బృందం ఆమెను బంధించి రెండు రోజులు లైంగికంగా వేధించింది. కానీ పోలీసులు ఆమె చెప్పిన విషయాన్ని నమ్మలేదు. నిందితులపై చర్య తీసుకోవడంలో ఆలస్యం చేశారు. చివరికి నేరస్థులను అరెస్టు చేసినా కోర్టు వారికి వెంటనే బెయిల్ ఇచ్చేసింది. విడుదలయ్యాక ఆమెపై మళ్లీ దాడి చేసి బెదిరించడం మొదలుపెట్టారు. దాంతో సోలంకి తన గ్రామంలో ఇక జీవించడం కష్టమని నిర్ధారించుకున్నారు. గుహ, అగర్వాల్‌లను మొదటిసారి కలిసినప్పుడు ఆమె వారితో మాట్లాడలేక పోయింది. బయటకు అడుగు పెట్టడానికి కూడా భయపడింది. కానీ ‘చు కర్ దేఖో’ చూసిన తర్వాత సోలంకిలో ఏదో మార్పు వచ్చింది.
ప్రేక్షకులకు వేరే మార్గం లేదు
‘వేదికపై మా కథలు చూసినప్పుడు చలించిపోయాను. కానీ నేను ఒంటరిగా లేను, నా చుట్టూ ఉన్న చాలా మంది మహిళలు కూడా ఏడుస్తున్నారు. ఆ క్షణంలో, మేమందరం కోలుకోవడం ప్రారంభించామని నేను అనుకుంటున్నాను. చాలా కాలంగా సమాజం నన్ను నమ్మడానికి, నా బాధను అంగీకరించ డానికి నిరాక రించింది. కానీ ఇప్పుడు, నేను ప్రపంచం ముందు నిలబడి నా సొంత మాటలలో నా కథను చెప్పాను. నేను వేదికపై ఉన్నప్పుడు ప్రేక్షకులకు వినడం తప్ప వేరే మార్గం లేదు. వారు అసౌకర్యంతో కూర్చోవాలి, వారి మనసులలో, శరీరాలలో దానిని అనుభవించాలి, దానిని అంగీకరించాలి. ఎందుకంటే నేను ఇకపై కనిపించను’ అంటూ ఆమె గుర్తు చేసుకున్నారు.
ధైర్యంగా చెప్పడానికి
సమాజంలో చాలా మంది మహిళలు చదవలేరు, రాయలేరు. అందుకే వారు స్కెచ్‌లు గీయడం ప్రారంభించారు. అవి స్టోరీబోర్డులుగా మారాయి. ఈ మహిళలు థియేటర్‌ను ప్రతిఘటన రూపంగా మలుచుకున్నారు. తమలోని బాధను, నిజాలను సమాజానికి ధైర్యంగా చెప్పడానికి ఈ వేదికను ఉపయోగించుకుంటున్నారు. సమాజంలో తమను తాము ఓ శక్తిగా నిలబెట్టుకుంటున్నారు. దీని నుండి రూపుదిద్దుకున్న మొదటి నాటకం ‘నజర్ కే సామ్నే’ (ఇది ఇప్పుడు బ్యాంకాక్‌లో 50 ప్రదర్శనలు పూర్తి చేసింది). ఈ నాటకం మహిళల జీవిత అనుభవాల ద్వారా హింసలోని గతిశీలతను అన్వేషిస్తుంది. అయితే ఇది హింసను ఒక ఏకైక సంఘటనగా చూడటాన్ని తిరస్కరిస్తుంది. దీనికి బదులుగా బాధిత మహిళలు స్వేచ్ఛగా, ఇష్టంగా, ఎలాంటి భయం లేకుండా ఇంటి నుండి బయటకు అడుగు పెట్టే హక్కును అన్వేషిస్తుంది. డ్రాయింగ్, ఇంప్రూవైజేషన్, కదలికల ద్వారా స్క్రిప్ట్‌ను రూపొందించారు.
అవమానంగా భావించారు
మరొక సభ్యురాలైన వర్ష మాల్వియా.. ఆమె శరీరం, మనసు భరించిన హింసను వివరిస్తుంటే ఇప్పటికీ ఆమె వణికిపోతుంది. అగర్వాల్, గుహతో మొదటిసారి తన కథను పంచుకోమని అడిగినప్పుడు ఆమె అపరాధ భావన, సిగ్గుతో కుంగిపోయింది. ‘నన్ను నా ఇంటి నుండి కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి, డెహ్రా డూన్‌లో అమ్మే శారు. నేను తప్పించుకుని తిరిగి ఇంటికి వెళితే కుటుంబ సభ్యులు నన్ను నిరాకరించారు. నన్ను వాళ్లు అవమానంగా భావించారు. చాలా కాలం పాటు నేను కూడా దాన్ని నమ్మాను. జరిగిన ప్రతిదానికీ నన్ను నేను నిందించుకున్నాను’ అని ఆమె పంచుకున్నారు. మారా బృందంతో రోజుల తరబడి కూర్చున్న తర్వాతే ఆమె అవగాహన మారిపోయింది. ‘ఇది నేను భరించాల్సిన అవమానం కాదని, అసలైన నిజం ఏమిటో స్పష్టంగా కనిపించడానికి వారు నాకు సహాయం చేసారు’ అంటూ జత చేశారు. తర్వాత ఆమె పంచాయితీ హాళ్లు, కమ్యూనిటీ స్థలాలు, గ్రామాలలో ప్రదర్శన ఇవ్వడం ప్రారంభించారు. ఇక్కడ పితృస్వామ్య, కుల ఆధారిత హింస రోజువారీ వాస్తవికత. కొన్నిసార్లు ప్రేక్షకులలోని ఆధిపత్య కుల పురుషులు నాటకం ఇతివృత్తాలను తోసిపుచ్చారు. కొన్ని సార్లు భద్రతా కారణాల రీత్యా ప్రదర్శనలను తరలించాల్సి వచ్చింది. అయినప్పటికీ మహిళలు చూడటానికి వచ్చారు.
థియేటర్ ఉపయోగించుకుంటూ…
ఈ బృందం ఇప్పుడు మార్జు ఔర్ మోయినా కి కహానీ అనే కొత్త నాటకాన్ని విడుదల చేసింది. ఇది ఇద్దరు యువతులు తమ భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్న అవినీతిపరుడైన రాజు, మంత్రిపై పోరాడే కథ. అయితే ఇది వ్యక్తిగత చరిత్రల నుండి ఉద్భవించిన నజర్ కే సామ్నే మాదిరిగా కాకుండా, మహిళలు వారి సొంత అనుభవాల నుండి బయటపడటానికి, విస్తృత అధికార వ్యవస్థలను విమర్శించడానికి థియేటర్‌ను ఉపయోగించడానికి ఈ నాటకం వీలు కల్పిస్తుంది. ప్రదర్శన ఈ మహిళలకు చలనశీలత, స్వాతంత్య్రం, కొంతమందికి ఆర్థిక స్థిరత్వాన్ని కూడా ఇచ్చింది. ఒకప్పుడు గ్రామాలకే పరిమితమైన వారు ఇప్పుడు ప్రదర్శనల కోసం నెలకు 15-20 రోజులు ప్రయాణిస్తారు. నగరాల్లో, స్త్రీవాద సమావేశాలలో, అంతర్జాతీయ ప్రదేశాలలో ప్రదర్శనలు ఇచ్చారు. మారా చేస్తున్న కృషికి స్త్రీవాదులు, వ్యక్తిగత దాతలు మాత్రమే మద్దతు ఇస్తున్నారు. అయితే నిధులు పొందడం వీరికి ఎప్పుడూ ఒక సవాలే.