– నిర్దిష్టమైన హామీలు ఇచ్చిన ఆరోగ్యశాఖ కమిషనర్ కర్నన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నాలు నిర్వహించాలని ఆశా యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ పిలుపులో భాగంగా హైదరాబాద్ సెంట్రల్, సౌత్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ఆధ్వర్యంలో హైదరాబాద్ కోఠి ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా సందర్భంగా ప్రతినిధులు వైద్యారోగ్యశాఖ కమిషనర్ కర్ణన్‌కు వినతిపత్రం అందజేసి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కర్నన్ ఆశాలకు పలు హామీలిచ్చినట్టు యూనియన్ నాయకులు తెలిపారు. డిసెంబర్ ,జనవరి రెండు నెలల పారితోషికాలు వారం రోజుల్లో ఆశాల అకౌంట్లో వేస్తామని తెలియజేశారు. యాక్సిడెంట్ అయినా లేదా సాధారణంగా మరణించినా, ఏ విధంగా మరణించినా రూ.50 లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పారు. దహన సంస్కారాలు మట్టి ఖర్చుల కోసం రూ.50 వేలు ఇస్తామని చెప్పారు. అభయహస్తం, మహాలక్ష్మి, గ్యాస్ సిలిండర్ తదితర సర్వేలు చేయాల్సిన అవసరం లేదనీ, చేయొద్దని చెప్పారు. అవసరమైన రిజిస్టర్స్ ప్రింట్ చేసి సరఫరా చేస్తామని తెలిపారు. రిటైర్మెంట్ వయసు, వయస్సుతో పాటు బెనిఫిట్స్ కూడా ఫైనల్ చేస్తామని హామీ ఇచ్చారు. ఫిక్స్డ్ వేతనం, ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం పోస్టుల్లో వెయిటేజ్ మార్కులు, జాబ్ చార్ట్ తదితర సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయనున్నట్టు కర్ణన్ హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి.జయలక్ష్మి, రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.కవిత, ఏ.హేమలత, రాష్ట్ర నాయకులు హైదరాబాద్ సౌత్ ఎం.మీనా, కల్పన. రంగారెడ్డి జిల్లా సునీత, లలిత, హైదరాబాద్ సెంట్రల్ యాదమ్మ, అనిత మేడ్చల్ ఎం.రేవతి, సీఐటీయూ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా నాయకులు రాములు తదితరులు పాల్గొన్నారు.