కాలిఫోర్నియా వర్సిటీలో

కాలిఫోర్నియా వర్సిటీలో– పాలస్తీనా అనుకూల ఆందోళనకారుల నిరసనలు
లాస్‌ఏంజెల్స్‌ : లాస్‌ఏంజెల్స్‌లోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల ఆందోళనకారులు సోమవారం పోలీసులతో ఘర్షణ పడ్డారు. కాలేజీ కేంపస్‌లో మూడోసారి శిబిరాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. యూనివర్సిటీలోని డిక్సన్‌ ప్లాజా పశ్చిమ ప్రాంతంలో ఆందోళనకారులు శిబిరాలు వేసి, బారికేడ్లు ఏర్పాటు చేశారని విద్యార్ధుల పత్రిక డైలీ బ్రూయిన్‌ పేర్కొంది. ఇజ్రాయిల్‌ దాడుల్లో మరణించిన పాలస్తీనియన్లకు ప్రతీకగా రక్తమోడుతున్న శరీరపు భాగాల బొమ్మలను పట్టుకుని ఆందోళనకారులు ప్రదర్శన నిర్వహించారు. ”మన అమరులను గౌరవిద్దాం” అని వారు నినదించారు. ఇప్పటివరకు 46వేల మందికి పైగా పాలస్తీనియన్లు ఈ మారణహౌమంలో మరణించారని ఈ నిరసన ప్రదర్శన నిర్వాహక సంస్థ స్టూడెంట్స్‌ ఫర్‌ జస్టిస్‌ ఇన్‌ పాలస్తీనా తెలిపింది. ఈ నిరసనలకు చేతులు కలపాల్సిందిగా ప్రజలను కోరింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతమంతా అలర్ట్‌ ప్రకటించారు. వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోవాల్సిందిగా ఆందోళనకారులను పలుసార్లు ఆదేశించారు. పోలీసు అధికారులు, నిరసనకారుల మధ్య అనేకసార్లు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. రాత్రయిన తర్వాత, వందలాదిమంది పాలస్తీనా అనుకూల ఆందోళనకారులు దాడ్‌ హాల్‌ వెలుపల నిలుచుని నినాదాలు చేశారు. పదుల సంఖ్యలో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.

Spread the love