మానవత్వంపై దాడులు…

– గాజాపై ఇజ్రాయెల్‌ బాంబు దాడులకు పినరరు విజయన్‌ ఖండన
తిరువనంతపురం : కొన్ని నెలల నుంచి గాజాపై కొనసాగిస్తున్న ఇజ్రాయెల్‌ బాంబుదాడులను కేరళ ముఖ్యమంత్రి పినరరు విజయన్‌ ఖండించారు. పాలస్తీనా ప్రజలను హతమార్చడమే లక్ష్యంగా ఇజ్రయిల్‌ సాగిస్తున్న దాడులను మానవత్వంపై దాడులని విజయన్‌ అన్నారు. శనివారం 91వ శివగిరి తీర్థయాత్రను పినరరు విజయన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఏసుక్రీస్తు జన్మస్థలమైన బెత్లెహాంలో ఈసారి క్రిస్మస్‌ వేడుకలు లేవు. క్రిస్మస్‌ దీపాలు, నక్షత్రాలు లేవు. అయినా ఈ సమయంలో క్రిస్మస్‌ ఎలా జరుపుకుంటారు? ముఖ్యంగా పాలస్తీనా గురించి విన్నప్పుడు ముస్లిం విశ్వాసుల చిత్రాలే గుర్తుకువస్తాయి. అయితే గాజాలో క్రైస్తవ సంఘం కూడా నివశిస్తుంది. ఈసారి శాంతి సందేశాన్నిచ్చే క్రిస్మస్‌ను పాలస్తీనియన్లు జరుపుకోలేకపోయారు.’ అని ఆయన అన్నారు. అలాగే శివగిరి మఠాన్ని స్థాపించిన నారాయణ గురు కూడా శాంతి సామరస్య సందేశాన్నే వ్యాప్తి చేశారని విజయన్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘నారాయణ గురు ఇచ్చిన సందేశం యొక్క కాంతి ఆ మట్టికి చేరినట్లయితే.. రక్తం ఏరులా ప్రవహించేది కాదు’ అని మానవత్వం గురించి నారాయణ గురు చేసిన బోధనలను విజయన్‌ నొక్కి చెప్పారు. కాగా, శివగిరిలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో కేరళ సహకార శాఖ ఆమంత్రి వి.ఎన్‌.వాసవన్‌, ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌. సోమనాథ్‌, శ్రీనారాయణ ధర్మ పరిపాలన (ఎస్‌ఎన్‌డిపి) యోగం ప్రధాన కార్యదర్శి వెల్లపల్లి నటేశన్‌లతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Spread the love