– భారత్‌కు ఆర్థిక సాయంపై ట్రంప్ వ్యాఖ్యలు
– అలా సాయం చేయాల్సిన అవసరమేంటని ప్రశ్న
న్యూయార్క్ : ‘ఓటర్ టర్నవుట్’ కోసం భారత్‌కు 21 మిలియన్ల డాలర్లను కేటాయించాలని గత బైడెన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రశ్నించారు. ‘బహుశా మరెవరినో గెలిపించేందుకు వారు ప్రయత్నించినట్లు వుంది.’ అని తాను భావిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. మియామిలో ఎఫ్‌ఐఐ ప్రాధాన్యతా సదస్సులో మాట్లాడుతూ ట్రంప్ పై వ్యాఖ్యలు చేశారు. గతంలోకూడా ఆయన ఇదే అంశంపై ఆందోళనల వ్యక్తం చేశారు. అటువంటి ఆర్థిక సాయం భారత్‌కు చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. భారత ఎన్నికల్లో ఓటు వేసే ఓటర్ల సంఖ్యను పెంచేందుకు ఈ మొత్తాన్ని అంద చేయాల్సిన అవసరాన్ని ఆయన బుధవారం కూడా ప్రశ్నించారు. భారత్‌లో అధిక సుంకాలు విధిస్తారని, ఆ స్థాయికి అమెరికా చేరుకోవడం చాలా కష్టమని ఆయన పునరుద్ఘాటించారు. భారత్‌లో ఓటర్ల శాతాన్ని పెంచేందుకు ఎన్నికల కమిషన్‌కు యుఎస్‌ఎయిడ్ 21 మిలియన్ల డాలర్లను అందచేసిందని ఎలన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ విభాగం వెల్లడించింది. ఆ నేపథ్యంలో ట్రంప్ పై విధంగా స్పందించారు. ఎఫ్‌ఐఐ సదస్సులో ట్రంప్ మాట్లాడుతూ, తాను అధ్యక్షుడిని కాకముందు ప్రజల డబ్బు అంతా ఎక్కడకు పోతోందో కొన్ని ఉదాహరణలు వివరించారు. ఇందుకు చాలా ఉదాహరణలు వున్నాయని చెప్పారు. ”అందులో భాగంగానే, 21 మిలియన్ల డాలర్లు భారత్‌కు వెళ్ళాయి. అసలు అక్కడ ఓటర్ల శాతాన్ని పెంచేందుకు మనం ఇంత మొత్తం ఖర్చు పెట్టాల్సిన అవసరమేముంది? బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిస్థితులను బలోపేతం చేసేందుకు 29 మిలియన్ల డాలర్లు అందచేశారు. ..నేపాల్‌లో జీవ వైవిధ్య పరిక్షణ కోసం 10మిలియన్ల డాలర్లు ఇచ్చారు. ఆసియా దేశాల పరిస్థితి బాగానే వుంది. వారికి మనం డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు.” అని ట్రంప్ పేర్కొన్నారు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమేనని, ఇలాంటి జాబితా సుదీర్ఘంగా వుందన్నారు.
ఏఏ అంశాలపై అమెరికా పన్నుదారుల డబ్బు ఖర్చు చేస్తున్నారో వివరిస్తూ ఫిబ్రవరి 16న డోజ్ ఒక జాబితా ఇచ్చింది. అందులో భారత్‌కు ఇచ్చిన మొత్తం గురించి వుంది. ఆ జాబితాలోని అంశాలన్నింటినీ రద్దు చేసామని డోజ్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా యుఎస్‌ఎయిడ్ చేపట్టే మానవతా సాయాన్ని నిలిపివేస్తూ ఈ నెల 7న డోజ్ ఆదేశాలు జారీ చేసింది.
ఎవరినో గెలిపించేందుకు ప్రయత్నం
1:59 am