– కారుతో ఉడాయించిన దుండగులు
– గంటల వ్యవధిలోనే భార్యాభర్తను పట్టుకొని అరెస్టు చేసిన పోలీసులు
– వివరాలు వెల్లడించిన ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసులు
నవతెలంగాణ-లింగంపేట్
ఇన్నోవా కారు చోరీ కేసులో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు ఎల్లారెడ్డి డి.ఎస్.పి శ్రీనివాసులు వెల్లడించారు. శనివారం రాత్రి లింగంపేట్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
లింగంపేట్ మండలంలోని కన్నాపూర్ గ్రామానికి చెందిన ధ్యారా బోయిన శ్రీకాంత్, అతని భార్య అనిత గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాదులోని చింతల్ బస్తిలో నివాసం ఉంటున్నారు. రోజువారి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటుండగా.. డబ్బులు సరిపోకపోవడంతో గుట్టుచప్పుడు కాకుండా నేరాలకు తెరతీశారు. నిందితుడు శ్రీకాంత్ పై 8 కేసులు ఉన్నాయి. గతేడాది హత్య కేసులో సంగారెడ్డి జైలుకు వెళ్లాడు. కాగా బాలనగర్‌లో ఉంటున్న ఆంధ్రప్రదేశ్‌కుచెందిన గూడవల్లి స్టీవెన్ ఓ కేసులో అదే జైలుకు వెళ్లాడు. అక్కడ నిందితుడు శ్రీకాంత్.. స్టీవెన్‌తో పరిచయం చేసుకున్నాడు.
నిందితుడు నెల రోజుల క్రితం జైలు నుండి బయటకు వచ్చాడు. స్టీవెన్ ఇన్నోవా కారులను కిరాయికి నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో జైల్లో పరిచయం ఏర్పడగా నిందితుడు శ్రీకాంత్ ఉపాధి చూపుమని ఆయనను కోరగా చూపుతానని హామీ ఇచ్చాడు. కాగా శ్రీకాంత్ ఆయన భార్య పథకం ప్రకారం ఇన్నోవ వాహాన్ని చోరీ చేసేందుకు పథకం పన్నారు. దీంట్లో భౄగంగా గురువారం రాత్రి శ్రీకాంత్ అనిత సొంత ఊరికి వెళ్లడానికి పథకం తీశారు. అదే రోజు రాత్రి సికింద్రాబాద్లోని ప్యాట్ని సెంటర్ వద్దకు వచ్చి స్టీవెన్‌కు ఫోన్ చేసి తాము తమ స్వగ్రామం కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం కన్నాపూర్ గ్రామానికి వెళ్తున్నామని అందుకు వాహనం కావాలని ఆయనకు ఫోన్లో వివరించారు. ఇద్దరిని నమ్మిన స్టీవెన్ ఇన్నోవా వాహనం తీసుకొని ప్యాట్నీ సెంటర్ వద్దకు వచ్చారు. అంత దూరం వెళ్లాలంటే 5 వేల రూపాయల కిరాయి అవుతుందని ఆయన వారితో అన్నారు. కిరాయి డబ్బులు స్వగ్రామం చేరుకొని ఇస్తామని వారు నచ్చజెప్పారు. దీంతో నర్సాపూర్ మెదక్ మీదుగా స్వగ్రామమైన కన్నాపూర్ గ్రామ సమీపంలో దట్టమైన అటవీ ప్రాంతం ఉండడంతో రాత్రి ఒంటిగంట ప్రాంతంలో అటవీ ప్రాంతంలో ఆపుకొని మూత్రానికి వెళ్దామని పథకం ప్రకారం నిందితుడు శ్రీకాంత్ అతని భార్య అనిత ఇద్దరు దిగారు. మీరు కూడా మూత్రానికి దిగండి అతనికి సూచించడంతో అతను దిగాడు. అర్ధరాత్రి అటవీ ప్రాంతంలో మూత్ర విసర్జన చేస్తున్న సమయం వెనక నుండి తలపై బలంగా స్టీవెన్‌ను శ్రీకాంత్ ఆయన భార్య బలంగా కొట్టారు. అంతే కాకుండా ఇద్దరు కలిసి చున్నీతో అతని మెడకు వేసి గుంజడంతో ఆయన అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు. ఇది గమనించిన నిందితులు మృతి చెందాడని పక్కన పొదల్లోకి అతడిని పడేసి అతడి వద్ద ఉన్న రెండు సెల్‌ఫోన్‌లను, ఇన్నోవ కారును తీసుకొని అక్కడ నుండి పరాయిరయ్యారు. స్పృహ నుంచి మేలుకొన్న స్టివెన్ పోలీస్ స్టేషన్కు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఎల్లారెడ్డి సిఐ రవీందర్, లింగంపేట ఎస్సై చైతన్య కమార్ రెడ్డి టెక్నికల్ డిపార్ట్మెంట్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ నేతృత్వంలో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానంతో వాహనం ఏ ప్రాంతంలో ఉందో గుర్తించారు. కారులో వెళ్తుండగా.. డీజిల్ అయిపోవడంతో అటవీ ప్రాంతంలో ఓ పక్కన కారును నిలిపేశారు. స్వగ్రామం కన్నాపూర్ వెళ్తుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు. వారిని అదుపులో తీసుకొని వారి వద్ద నుండి రెండు సెల్ ఫోన్లు ఒక పర్సు ఇనోవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
పోలీసులను అభినందించిన ఎస్పీ
వాహనం చోరి కేసులో చాకచక్యంగా నింతులు పట్టుకున్న ఎల్లారెడ్డి సిఐ రవీందర్ లింగంపేట ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి టెక్నికల్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తో పాటు బృందంలో ఉన్న పోలీసులు జిల్లా ఎస్పీ సింధు శర్మ అభినందించారు. వీరికి నగదు బహుమతి ఇవ్వనున్నట్టు తెలిపారు. 24 గంటలు వ్యవధిలోనే సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను పట్టుకోవడం అభినందనీయమన్నారు. ఈ సమావేశంలో ఏఎస్‌ఐ రంగారావు కానిస్టేబుల్ శంకర్ రాజు పోలీసులు ఉన్నారు.