బాల సాహిత్య వికాసోద్యమం, దళిత చేతన, బాల సాహిత్య రచన, బోధనారంగంలో తనదైన ముద్రతో రాస్తున్న నేటి తరం రచయితలు, కవుల్లో వేము రాములు ఒకరు. వృత్తిరీత్యా తెలుగు పండితులు. ప్రవృత్తి రీత్యా కవి, రచయిత, విమర్శకులు, వ్యాసకర్త, బాల సాహితీవేత్త.
ఖమ్మం జిల్లా నిదానపురానికి చెందిన వేము రాములు 24 ఆగస్టు, 1974న పుట్టారు. వేము దానమ్మ – ప్రసాదు వీరి అమ్మానాన్నలు. తెలుగు, ఆంగ్ల సాహిత్యాల్లో స్నాతకోత్తర పట్టా పొందిన వీరు బి.ఇడి చదివి ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడ్డారు. తాను పని చేసిన ప్రతిచోట పాఠాలతో పాటు పిల్లలకు పాటలు, ఆటలు, రచనలు చేయించడం ఈయనకు బాగా తెలుసు.
పద్యాన్ని, వచన కవిత్వాన్ని, గేయాన్ని ఇలా అన్ని కవితా రూపాల్లో రచనలు చేసిన వేము రాములు మొదటగా ‘వేము శతకము’ పద్య కవిత్వాన్ని అచ్చువేశాడు. తరువాత వచ్చిన మరో శతక పద్య సంపుటి ‘మాతృశతకము’. కవిత్వంతో పాటు సాహిత్య విమర్శ వ్యాసాలను కూడా అచ్చులోకి తెచ్చాడు. ‘బ్లాక్ సిగేచర్’ పేరుతో వచ్చిన దళిత సాహిత్య వ్యాస సంపుటి వీరి విమర్శా గ్రంథం. బాల సాహితీవేత్తగా ఆయన ప్రస్థానం కూడా ఎన్నదగింది. బాలల కోసం కథలు, గేయ కథలను రాశారు రాము. అందులో ‘ఉపాయం’ గేయ కథ ఒకటి. ఇవేకాక ‘మార్పు’, ‘సర్కారు బడి’, ‘పిసినారి పాపయ్య’, ‘సెల్ ఫోన్’, ‘ఇమ్మాన్యుయేలు’ వేము రాములు రాసిన నాటికలు. తొలుత తన బడి పిల్లలతో రాయించిన రచనలను వివిధ సంకలనాల కోసం అందించారీయన. వాటిలో డా.పత్తిపాక మోహన్, గరిపెల్లి అశోక్‌ల సంపాదకత్వంలో వచ్చిన ‘ఆకు పచ్చని ఆశలతో..’ తెలంగాణ బడి పిల్లల హరిత కవితా సంపుటి ఒకటి. ఇందులో వేము రాము విద్యార్థులు రాసిన ఏడు ఆకు పచ్చ కవితలు ఉండడం విశేషం. ఇంకా పిల్లలతో చేయించిన రచనలు ‘చిరు సవ్వడులు’, ‘పూలతోట’ వంటి బడి పిల్లల వివిధ ప్రక్రియల్లో రచనలు తెచ్చారు. ఇదేకాక బండారు చినరామారావు సంపాదకత్వంలో వచ్చిన ‘బాలసుధ’లో వీరి పిల్లల రచనలు వచ్చాయి. మాటూరు పాఠశాలలో వేము రాములు పనిచేస్తున్న సమయంలో బాల వికాసం, బాలల రచనలకు అందించే డా. చింతోజు బ్రహ్మయ్య- బాలమణి బాల ప్రతిభా పురస్కారాలు వీరి పిల్లలకు దక్కాయి. మధిర బాలోత్సవం మొదలుకుని అనేక ఉత్సవాల్లో వేము రాము రాసిన నవలలు అచ్చయ్యాయి. వృత్తీ రీత్యా ప్రవృత్తిరీత్యా గుర్తింపును పురస్కారాలను అందుకున్నారీయన. వీటిలో ‘మన తెలుగు తేజం’ జాతీయ పురస్కారం, కవి కోకిల, డా.బి.ఆర్. అంబేద్కర్ నేషనల్ అవార్డ్, మథర్ థెరిసా అవార్డు, జాతీయ ఉగాది పురస్కారం, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం’ వంటివి వాటిలో కొన్ని.
బాల సాహితీవేత్తగా అచ్చయిన వీరి పుస్తకం ‘విరులు’ బాల గేయ సంపుటి. ఇది తెలుగు విశ్వవిద్యాలయం వారి ఆర్థిక సహాయంతో అచ్చయ్యింది. ఈయనే అన్నట్టు ‘పిల్లలు విరిసేటి విరులు / పిల్లలు పూసేటి పూలు / పిల్లలు అందాల గిరులు / పిల్లలు పారేటి ఝరులు’/ పిల్లలు ఆటల పిడుగులు / పిల్లల గంతుల చిరుతలు / పిల్లలు అందరి బుడతలు / పిల్లలు ఎగిరే ఉడుతలు’… ఇంకా ‘పిల్లలు వెలుగుల దివ్వెలు / పిల్లలు జనకుల ఊసులు / …పిల్లలు ప్రేమ దీపాలు’ అట… నిజం కదా! వాళ్ళ కోసం ఈ గేయాల ‘విరులు’ పూయించారు కవి వేము రాములు. తన ఈ గేయ సంపుటిలో పిల్లల కోసం అనేక గేయాలను చక్కగా కూర్చారీయన. ఇందులో ‘చందమామ’ గేయంలో ‘మామా మామా చందమామ / అంబరాన ఉన్న మా మామ / తారల మధ్య వెలిగే మామ / అందరి మామ చందమామ’ అంటూనే ఇంకా ఇలా చెబుతాడు కవి రాములు, ‘చిన్న పిల్లల ఆట బొమ్మవు / వెన్నెనిచ్చే చందమామవు / చక్కని చుక్కల రేడువు / చల్లని వెన్నెల ఇస్తావు / తారల మధ్య రాజువు నీవు / చిన్న పిల్లల గీతము నీవు / రాత్రిలో వెలుగును ఇస్తావు / పడమరకు పయనిస్తుంటావు’. వాన గురించి ఒక గేయంలో రాస్తూ ‘..నేల దాహము తీరుటకు / రైతు చావులు ఆగుటకు’ వాన రావాలని అంటాడు. ఇంకోచోట ‘వాన తప్పక రావాలి / మహిన హర్షము నింపాలి / ప్రాణుల దాహము తీరాలి / జీవులు చల్లంగుండాలి’ అని రాసాడు. వీరి కొన్ని గేయాలు ఆలోచనలు కలిగించేవిగా ఉంటే ఇంకొన్ని గేయాలు వారిలో ఆలోచనలతో పాటు కుతుహలాన్ని నింపేందుకు తోడ్పడుతాయి. వాటిలో ఎవరు గొప్ప’, నవ్వు వంటివి చూడవచ్చు. ఇంతేకాదు పిల్లి, బోమ్మ, గౌను. కారవు, పూదోట, గులాబీ, రైలు, ఉడత, కాకి, సెల్‌ఫోన్ వంటివి గమ్మత్తుగా సాగే గేయాలు. బొమ్మ అంటే ఇష్టపడని పిల్లలు ఉండరు కదా, దీనినే చిన్నారి పాపాయిగా మారిన కవి ‘అందమైన బొమ్మ ఒకటి / అంగడిలో నుండి అమ్మ / ప్రేమతోడ నాకు తెచ్చె… /బలె బలె బంగారు బొమ్మ / చూడ చక్కని నా బొమ్మ…/ బొమ్మతోటి ఆడుకుంట / ఇష్టముతో దాచుకుంట /…చూడ చక్కని నా బొమ్మ / చూడాలనిపించే నా బొమ్మ / ముద్దులొలికే నా బొమ్మ / అందరు మెచ్చే నా బొమ్మ’ అని పాడుతాడు. అమ్మకు, నాన్నకు జేజేలు పలుకుతూనే ఇంకాస్త ముందుకెళ్ళి గురువులకు, రైతులకు, సైనికులకు… ‘జేజేలమ్మా జేజేలు / జన్మను ఇచ్చిన అమ్మకు / నడకులు నేర్పిన నాన్నకు / జేజేలమ్మా జేజేలు / చదువును నేర్పిన గురువులకు / అందరికి అన్నంపెట్టే / అన్నదాతలందరికీ ఇవిగో / జేజేలమ్మ జేజేలు / దేశాన్ని నిత్యము కాచె / వీర సైనికులందరికి /..జేజేలమ్మా జేజేలు’ అంటూ పలుకుతారు. రాములు పాఠాలు చెప్పే పంతులు కదా! అనేక గేయాల్లో ఆయన భాషా విన్యాసం, పదాలతో, జంట పదాలతో ఆడుకోవడం మనం చూడవచ్చు. బాధ్యతగా పాఠాలు చెబుతూనే తన వంతు కర్తవ్యంగా చక్కని పాటలను పిల్లలకందిస్తున్న తన ఇంటిపేరులో వేము వున్నా తీయ తీయని గేయాలకు అందించిన కవి వేము రాములుకు అభినందనలు.
డా|| పత్తిపాక మోహన్
9966229548