అయోతీ థాస్‌: తొలి కులరహిత ద్రవిడోద్యమ మార్గదర్శి

అయోతీ థాస్‌: తొలి కులరహిత ద్రవిడోద్యమ మార్గదర్శి”స్వేచ్ఛా స్వాతంత్య్రాల గురించి, దేశభక్తి గురించి, స్వదేశీ జాగరణ గురించి మాట్లాడి జనాల నుండి చందాలు వసూలు చేసుకునే ఈ రాజకీయ నాయకులు ప్లేగు వంటి వ్యాధులు ప్రబలినప్పుడు, కరువు కాటకాలు వచ్చినపుడు అడ్రసు లేకుండా పోతారు. ప్రజల కన్నీళ్లు తుడవడానికి ఎవరూ రారు. వారికి అందించాల్సిన కూడు, నీడా వంటి కనీసావసరాలు అందించరు. కష్టకాలంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఈ నాయకులు కలలో కూడా అనుకోరు. వారు చేప్పే దేశభక్తి అంతా వారి స్వార్థ ప్రయోజనాల కోసమే – అని ప్రజలు గ్రహించాలి!” అని ‘తమిళన్‌’ అక్టోబర్‌ 23, 1912 నాటి సంచికలో ఆ పత్రికా సంపాదకుడు సి.అయోతీ థాస్‌ రాజకీయ వ్యవస్థను తీవ్రంగా విమర్శించారు. దాంతో దక్షిణ భారత దేశం ఉలిక్కిపడింది. ఎవరీ అయోతీ థాస్‌ అని తెలుసుకోవడం ప్రారంభించింది.
దక్షిణ భారతదేశంలో కులాన్ని ప్రశ్నిస్తూ తొలిసారి గొంతెత్తిన కార్యకర్త-అయోతీ థాస్‌. ఆది ద్రావిడ నేపథ్యం నుండి వచ్చిన ఆయన రాజకీయం, సాహిత్యం, మతం వంటి అనేక రంగాలలో అవిరళ కృషి చేసినవారు. తమిళ పండితుడు, వృత్తి రీత్యా సిద్ధ వైద్యుడు. పందొమ్మిదవ శతాబ్దం చివరలో ఆది ద్రావిడ ప్రజల అభ్యున్నతి కోసం నడుం బిగించి 1891లో ‘కుల రహిత ద్రవిడ మహాసభ’ను స్థాపిం చారు. ఈ విషయంలో రెట్టమలై శ్రీనివాసన్‌ అనే మరో సంఘ సంస్కర్త ఈయనకు సహకరించారు. బౌద్ధం స్వీకరించిన అయోతీ థాస్‌, పరయల (మాలల) అసలు మతం బౌద్ధమని తేల్చారు. అందరినీ అందులోకి మారమని సూచించారు. కులరహిత సమాజం బౌద్ధం ద్వారానే సాధ్యమని ఉద్భోదించారు.
తరతరాలుగా వైష్ణవ సంప్రదాయంలో కూరుకుపోయిన కుటుంబం వీరిది. అయినప్పటికీ తన హేతుబద్ధమైన ఆలోచనలతో బ్రాహ్మణాధిపత్యాన్ని మతపరమైన పెత్తందారీ పోకడల్నీ అయోతీథాస్‌ పక్కకు తొలగిస్తూ వచ్చారు. ఆ కాలంలోనే అంటే 19వ శతాబ్దపు చివరికాలంలో బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం సంస్థలు హిందూ మత పునరుద్ధరణకు పూనుకున్నాయి. 1861-91 మధ్య కాలంలో క్రైస్తవులు, ముస్లింలు మినహా మిగిలిన వారందరినీ బలవంతంగా హిందువులుగానే పరిగణించారు. అయితే అయోతీ థాస్‌ ‘హిందూ’ అనే గుర్తింపును నిరాకరించారు. కారణమేమంటే హిందూను గుర్తిస్తే అందులో ఉన్న కుల నిర్మాణాన్ని, నిచ్చెనమెట్ల కుల సంస్కృతిని, అసమానతలను స్వీకరించాలి. అందు కని ఆయన దాన్ని తిరస్కరించడంతో పాటు, తన అనుయాయులందరినీ తిరస్కరించమని సూచించారు. కుల హింసలను గుర్తు చేసుకుని, ఆది ద్రావిడుల్ని ఆ పరిధిలోంచి బయటికి రమ్మని పిలుపు నిచ్చారు. అప్పుడే తమిళ శైవమతంలో కూడా పునరుద్ధరణకు ప్రయత్నాలు జరిగాయి. ఇది బ్రాహ్మణ వ్యతిరేకత గురించి మాట్లాడింది కానీ, కుల నిర్మూలన గురించి మౌనంగానే ఉంది. అందువల్ల అయోతీ థాస్‌ శైవమతం స్వీకరించలేదు.పైగా శైవమతం వైపు కూడా ఆకర్షితులు కాకూడదని తనవారికి ఉద్భోదించారు.
ఈ ప్రయత్నాలు ఇలా ఉండగా అయోతీథాస్‌ రాజకీయంగా కూడా కొన్ని ప్రయత్నాలు చేశారు. తను స్థాపించిన ‘కుల రహిత ద్రావిడ మహాసభ’ పక్షాన 10 డిమాండ్లతో ఒక వినతి పత్రం తయారు చేసి, భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీకి పంపారు. వారు వాటిని తమ 12వ సమావేశంలో చర్చించారు కూడా! అయితే, అందులో ఒక్క డిమాండుకు కూడా సుముఖత వ్యక్తపరచలేదు. ఆ డిమాండ్లలో ఉచిత విద్య, బంజరు భూముల కేటాయింపు, పరయల (మాలల) ఆలయ ప్రవేశం మొదలైనవి ఉన్నాయి. ఆలయ ప్రవేశం ఇక్కడ భక్తికి సంబంధించిన విషయం కాదు. మనుషులుగా సమానహోదా, సమాన హక్కుకు సంబంధిం చిన విషయం. కాంగ్రెస్‌ పార్టీతో పని కాలేదని అయోతీ థాస్‌ తన ప్రయత్నం మానుకోలేదు. ప్రత్యామ్నాయ ప్రయత్నాలు ప్రారంభించారు. ఎమ్‌.వీర రాఘవా చారియర్‌, జి. సుబ్ర హ్మణ్య అయ్యర్‌, సి.ఆనందాచార్లు కలిసి 1884లో ‘మద్రాస్‌ మహాజనసభ’ను స్థాపించారు. ఇది కాంగ్రెస్‌కు ప్రత్యా మ్నాయం కాగలదని భావించారు. లోగడ కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించిన అవే పది డిమాండ్ల వినతిపత్రం అయోతీ థాస్‌ మళ్లీ ఈ మద్రాసు మహాజనసభకు పంపిం చారు. కానీ, అక్కడా చుక్కెదురైంది. నిర్వాహక సభ్యులు వినతి పత్రాన్ని తిరస్కరించడమే కాదు, ఆయనను ఘోరంగా అవమానించారు.
జరిగిన అవమానంతో అయోతీ థాస్‌ తీవ్రమైన మనోవేదనకు గురయ్యారు. తాము హిందు వులమే అయితే జాతి విచక్షణ ఎందుకూ? కుల దూషణలెందుకూ? దేవుడు అందరివాడైనప్పుడు ఆలయ ప్రవేశం తమకెందుకు ఉండదూ? వంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఆయన వాటికి సమాధానాలు కనుగొనే ప్రయత్నంలో వేదాలు, బ్రాహ్మణత్వం, ఆచారాలు వంటి వాటి గూర్చి అధ్య యనం ప్రారంభించారు. విషయాలు ఆర్థమౌతున్నకొద్దీ ఆయనలో ఒక ఉద్యమకారుడు రూపుదిద్దుకో సాగాడు. 1870 దశకంలో తన పాతికేండ్లప్రాయంలో తమిళనాడు నీలగిరి ప్రాంతంలోని తోడర్‌- కొండజాతులను సమైక్య పరిచి 1875లో అద్వైతా నంద సభకు రూపకల్పన చేశారు. అప్పుడే రెవరెండ్‌ జాన్‌ రధినమ్‌తో పరిచయం ఏర్పడింది. ఈయన మద్రసులో అది ద్రావిడుల కోసం నెస్లియన్‌ మిషన్‌ పాఠశాల నిర్వహిస్తున్నా డు. ఆయన పరిచయంతో అయోతీ థాస్‌కు కొత్త ఉత్సాహం లభించింది. దాంతో 1885లో ‘ద్రవిడ పాండ్యన్‌ అనే వార్తా పత్రికను ప్రారంభించాడు. ఎప్పటి నుంచో చేస్తూ వచ్చిన అధ్యయనాల కారణంగా ఒక సంవత్సరం తర్వాత 1886లో ”ఆది ద్రావిడులు హిందువులు కారు” – అని భారతదేశ చరిత్రలోనే ఒక విప్లవాత్మకమైన ప్రకటన చేశారు.
1891లో ద్రవిడ మహాసభను స్థాపించి, ఆది ద్రావిడులకు ఒక పిలుపునిచ్చారు. వారంతా తమను తాము హిందువులుగా కాక, ‘కుల రహిత తమిళులు’గా ప్రకటించుకోవాలని కోరారు. ఆ రోజుల్లో అదొక సాహసోపేతమైన చర్య. ఈ రోజుల్లో కొందరు ప్రభుత్వ వ్యవస్థలతో పోరాడి, కులరహిత సర్టిఫికేట్లు తీసుకుంటున్న సంగతి మనకు తెలుసు. కానీ, ఇప్పటికి 130 ఏండ్ల ముందు ఆ ప్రకటన చేయడమంటే-ఆయన ఎంత ధైర్యం చేసి ఉండాలీ? ఎంత ముందు చూపు ఉండి ఉండాలీ? ఒకసారి అయోతీ థాస్‌ తన అనుచరులతో ధియాసాఫికల్‌ సొసయిటీ వ్యవస్థాపక అధ్యక్షుడయిన కొలొసెల్‌ హెచ్‌.ఎస్‌.ఓల్కాట్‌ను కలుసుకున్నారు. బౌద్ధం స్వీకరించాలన్న తన కోర్కెను ఆయనకు తెలియజేశారు. ఆయన అయోతీ థాస్‌ శ్రీలంకకు వెళ్లే ఏర్పాటు చేశాడు. శ్రీలంకలో అయోతీ థాస్‌ సింహళ బౌద్ధ భిక్షువు సుమంగళ నాయక్‌ నుండి ధమ్మదీక్ష స్వీకరించారు. చెన్నై తిరిగివచ్చాక 1898లో ‘శాక్య బౌద్ధ సంఘాన్ని’ స్థాపించి దాన్ని శాఖోపశాఖలుగా విస్తరింపజేశారు. ఈయన అప్పుడు ఏర్పాటు చేసిన శాక్య బౌద్ధ సొసయిటీయే కాలక్రమంలో ఇండియన్‌ బుద్దిస్ట్‌ అసోసియేషన్‌గా మారిపోయింది. తర్వాత కాలంలో బౌద్ధానికి సంబంధించి అనేక శాఖలు, సంఘాలు ఏర్పడుతూ వచ్చాయి.
ద్రవిడ ఉద్యమ పితామహుడిగా నిలిచిన అయోతీ థాస్‌, రచయితగా చేసిన కృషి కూడా తక్కువది కాదు. 1.అంబికయ్యన్‌ కథ 2.ఇంద్ర జాతి చరిత్ర 3.ఇంద్ర దేశ బౌద్ధపండుగలు 4.శాక్య మహర్షి చరిత్ర 5.తిరుక్కురల్‌ దేవునికి శుభాకాంక్షలు 6.తిరువళ్లువర్‌ చరిత్ర 7.నందన్‌ చరిత్ర 8. ఆధునిక కులాల్లో భయాందోళనలు 9. బుద్ధుడు రాత్రీ పగలు లేని కాంతి 10.మురుగ భగవానుని చరిత్ర 11.వివాహ వివరణ 12. ప్రాచీన తమిళ భాష బుద్ధుడు ఆదివేదం 13.వేష బ్రాహ్మణవేదాంత వివరణ-మొదలైనవి.
‘అయోతీ థాస్‌’గా ప్రసిద్ధుడైన ఈయనను తల్లిదండ్రులు పెట్టిన పేరు కథవ రాయన్‌. ఇప్పుడు ఆ పేరు చెబితే ఆయనను ఎవరూ గుర్తుపట్టరు. అయోతీ థాస్‌ అనేది ఆయనకు ఆయనే పెట్టుకున్న పేరు. బాల్యంలో ఈయన అయోధ్య దాసర్‌ పండిట్‌ అనే ఉపాధ్యాయుడి వద్ద చదువు నేర్చుకున్నారు. తమిళం, ఇంగ్లీషు, పాళీ భాషల్ని, తత్త్వశాస్త్రాన్ని, సిద్ద వైద్యాన్నీ ఇలా అనేక విషయాలు నేర్చుకున్నారు. అందువల్ల గురువుగారిపట్ల ఆ బాలుడికి ఏర్పడ్డ గౌరవభావంతో తన పేరు కూడా అయోధ్య దాసర్‌గా చెప్పుకునేవాడు. అంటే తను కూడా గురువంతటి వాణ్ణి కావాలన్న ఆకాంక్ష అతనితో అలా చేయించింది. ఆ పేరే స్థిరపడి అయోతీ థాస్‌గా మారింది. తమిళ పలుకుబడి థాస్‌ అంటే మన తెలుగులో దాసుడు అనే అర్థం.
వీరిది విద్యావంతుల కుటుంబం. ఈయన తండ్రి కాంతప్పన్‌, ఫ్రాన్సిస్‌ వైటీ ఎల్లిస్‌ అనే బ్రిటీషు అధికారి దగ్గర పనిచేసేవాడు. తన కుటుంబం తరతరాలుగా భద్రపరుచుకుంటూ వచ్చిన తిరుక్కురల్‌, నాలదియార్‌లను కాతప్పన్‌ ఫాన్సిస్‌ ఎల్లిస్‌కు తాళపత్రాలలో అందిస్తే – ఆయన వాటి విలువను గ్రహించి, ఇంగ్లీషులోకి అనువదించాడు. తర్వాత పుస్తకాలుగా ముద్రించి ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆ రకంగా తమిళుల సాంస్కృతిక సంపదైన తిరుక్కురల్‌ వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకుంటూ ఉంటే – మన తెలుగు కవి వేమన పద్యాలను సేకరించి, ఇంగ్లీషులోకి అనువదించి ప్రపంచానికి పరిచయం చేసిన మన ఛార్లెస్‌ ఫిలిస్‌, బ్రౌన్‌ (1798-1884) గుర్తుకొస్తారు.
అయోతీ థాస్‌ 20 మే 1845న రోయపెట్ట, మద్రాసులో జన్మించారు. మళ్లీ అదే మే నెల 5వ తేదీన 1914లో 69వ యేట కన్నుమూశారు. తండ్రి ఉద్యోగం కారణంగా వీరి కుటుంబం నీలగిరికి వలస వెళ్ళింది. ఒక రకంగా పెరియర్‌, ద్రవిడర్‌ కజగమ్‌, బి.ఆర్‌.అంబేద్కర్‌లకు ఈయనే స్పూర్తి ప్రదాత! ఈయన మరణించిన చాలా కాలానికి ఆయుర్వేదం, యునాని వంటి వైద్య విధానాలతో పాటు సిద్ధ మెడిసిన్‌ను కూడా ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ గుర్తించింది. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సిద్ద – ను మాజీ భారత ప్రధాని డా.మన్‌మోహన్‌సింగ్‌ ప్రారం భించారు. చాలాకాలం అయోతీ థాస్‌ పేరు మరుగున పడిపోయింది. అయితే తన దళిత సాహిత్య అకాడెమీ పక్షాన ఇజిల్‌ మలై(గతంలో కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రిగా పనిచేశారు) అయోతీ థాస్‌ రచనల్ని మళ్లీ వెలుగులోకి తెచ్చారు. కేంద్ర మంత్రిగా పని చేసిన అంబుమణి రామ్‌దాస్‌ చొరవతో కూడా అయోతీ థాస్‌ జీవనం – కృషి ఈ తరానికి పరిచయమయ్యాయి.
– సుప్రసిద్ధ సాహితీ వేత్త, విశ్రాంత ప్రొఫెసర్‌ (మెల్బోర్న్‌ నుంచి)

డాక్టర్‌ దేవరాజు మహారాజు

Spread the love