మోడీజీ.. నా పద్మశ్రీ మీకే ఇస్తున్న: బజ్‌రంగ్‌ పునియా

నవతెలంగాణ ఢిల్లీ: భారత రెజ్లింగ్‌ సమాఖ్య (WFI) కొత్త అధ్యక్షుడిగా సంజయ్‌ సింగ్‌ ఎన్నికవడంతో రెజ్లింగ్‌లో మరోసారి కలకలం మొదలైంది. ఈ ఫలితాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇప్పటికే రెజ్లర్‌ సాక్షి మలిక్‌ రిటైర్మెంట్ ప్రకటించగా.. తాజాగా మరో దిగ్గజ రెజ్లర్‌ (Wrestler) బజ్‌రంగ్‌ పునియా (Bajrang Punia) ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని వెనక్కి ఇస్తున్నట్టు సోషల్‌ మీడియా వేదికగా  సంచలన నిర్ణయం ప్రకటించాడు. ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి పునియా లేఖ రాశారు. ఆ లేఖలోని వివరాలు ఇలా ఉన్నాయి.
‘‘ప్రియమైన మోడీజీ.. మీరు మీ పనుల్లో బిజీగా ఉంటారని తెలుసు. కానీ ఈ దేశంలో రెజ్లర్ల పరిస్థితిని మీ దృష్టికి తీసుకొచ్చేందుకు ఈ లేఖ రాస్తున్నా. డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ ఈ ఏడాది జనవరిలో మహిళా రెజ్లర్లు ఆందోళన చేసిన విషయం మీకు తెలిసే ఉంటుంది. వారికి మద్దతుగా నేను కూడా ఆ నిరసనలో పాల్గొన్నా. ఆ ఆరోపణలపై చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో మేం ఆందోళనను విరమించాం. కానీ, నెలలు గడిచినా బ్రిజ్‌భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడంతో మేం మళ్లీ రోడెక్కాల్సి వచ్చింది. న్యాయం కోసం మా పతకాలను గంగా నదిలో కలిపేద్దామనుకున్నాం. అప్పుడు కూడా అతడిపై చర్యలు తీసుకుంటామని కేంద్రం హామీ ఇచ్చింది’’ అని బజ్‌రంగ్‌ తన లేఖలో పేర్కొన్నాడు.
‘‘కానీ, ఇప్పుడు డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికల ఫలితాలతో రెజ్లింగ్‌ సమాఖ్య మళ్లీ బ్రిజ్‌భూషణ్‌ చేతుల్లోకే వెళ్లినట్లయ్యింది. ఈ ఫలితాలను భరించలేక సాక్షి మలిక్‌ రిటైర్మెంట్‌ ప్రకటించింది. ఇప్పుడు మేం న్యాయం కోసం ఎక్కడికెళ్లాలో అర్థం కావట్లేదు. ఈ ప్రభుత్వం మాకు ఎంతో చేసింది. 2019లో నాకు పద్మశ్రీ దక్కింది. అర్జున, ఖేల్‌రత్న వంటి అవార్డులు కూడా వచ్చాయి. కానీ, ఈ రోజు మహిళా రెజ్లర్లు తమకు భద్రత లేని కారణంగా ఆటకు వీడ్కోలు పలకాల్సి వచ్చింది. ఇది నన్ను ఎంతగానో కుంగదీసింది. అందుకే నా పద్మశ్రీని మీకే తిరిగిచ్చేయాలని నిర్ణయించుకున్నా’’ అని పునియా తన లేఖలో వెల్లడించాడు.
బ్రిజ్‌భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ వినేశ్‌ ఫొగాట్‌, సాక్షి మలిక్‌, బజ్‌రంగ్‌ పునియా తదితర అగ్రశ్రేణి రెజ్లర్లు రెండు విడతలుగా ఉద్యమం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అతడి నమ్మకస్థుడైన సంజయ్‌ సింగ్‌ డబ్ల్యూఎఫ్‌ఐకి అధ్యక్షుడు కావడంతో ఈ వేధింపులు ఇలాగే కొనసాగుతాయని రెజ్లర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సాక్షి మలిక్‌ గురువారం రిటైర్మెంట్‌ ప్రకటించింది.

Spread the love