సింగరేణి ఎన్నికల్లో పోటీపై కవిత సంచలన ప్రకటన

నవతెలంగాణ – హైదరాబాద్: సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) పోటీ చేయడం లేదంటూ వస్తోన్న వార్తలపై ఆ సంఘం గౌరవ అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత క్లారిటీ ఇచ్చారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) పోటీ చేస్తుందని ఆమె తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆమె ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు. సింగరేణిని కాపాడింది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని.. కార్మికుల హక్కులను సాధించింది టీబీజీకేఎస్ అని అన్నారు. సింగరేణిలో 20 వేల డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించిన ఘనత కేసీఆర్‌దన్నారు. కార్మికుల గొంతుక టీబీజీకేఎస్ బాణం గుర్తుపై ఆత్మసాక్షిగా ఓట్లేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కవిత కోరారు. కార్మికుల పక్షాన నిలబడె ఏకైక సంఘం టీబీజీకేఎస్.. ఎన్నికల్లో టీబీజీకేఎస్‌ను గెలిపించుకుంటేనే కార్మికులకు న్యాయం జరుగుతుందన్నారు. కాగా, ఈ నెల 27వ తేదీన సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

Spread the love