బక్కోడు కాదు.. బకాసురుడు

బక్కోడు కాదు.. బకాసురుడు– ప్రాజెక్టుల పేర్లు చెప్పి ఓట్లడిగే దమ్ముందా..?
– బీఆర్‌ఎస్‌ ఓటమి ఖాయం
– గజ్వేల్‌లో నర్సారెడ్డి, కామారెడ్డిలో నేను ఓడిస్తాం
– కాంగ్రెస్‌ 80కిపైగా సీట్లతో అధికారంలోకొస్తుంది : ఎన్నికల ప్రచారాల్లో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ- గజ్వేల్‌/ నారాయణఖేడ్‌రూరల్‌/ధర్పల్లి
‘రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మతి తప్పి మాట్లాడుతుండో.. మందేసి మాట్లాడుతుండో తెలియదు. 60 ఏండ్లల్లో కాంగ్రెస్‌ ఏం చేసిందని అంటున్నావ్‌. నాగార్జున సాగర్‌, శ్రీరామ్‌సాగర్‌ లాంటి అనేక ప్రాజెక్టులు కట్టి రైతాంగానికి సాగునీరిచ్చింది. మేం కట్టిన ప్రాజెక్టుల పేర్లు చెప్పి ప్రజలను ఓట్లు అడుగుతాం. నీవు కట్టిన కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల పేర్లు చెప్పి ప్రజలను ఓట్లు అడిగే దమ్ముందా.’ అంటూ టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు. మరో వారంలో జరిగే ఎన్నికల్లో 80కి పైగా సీట్లు సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్‌ జిల్లా నిజామాబాద్‌ రూరల్‌, సిద్దిపేట జిల్లా గజ్వేల్‌, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ నియోజకవర్గాల్లో నిర్వహించిన కాంగ్రెస్‌ బహిరంగసభల్లో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు.
నిజామాబాద్‌ జిల్లా ధర్పల్లిలో జరిగిన సభలో రేవంత్‌ మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యం అంటే గరీబోళ్ల రాజ్యం, పేదల రాజ్యమని తెలిపారు. బీఆర్‌ఎస్‌ రాజ్యం అంటే దొరల రాజ్యం, దొంగల రాజ్యం, భూములు కొల్లగొట్టే రాజ్యం, అక్రమ ఇసుక రాజ్యమన్నారు. బిడ్డ కవితను నిజామాబాద్‌ ప్రజలు బండకేసి కొడితే వెంటనే ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తన కుటుంబాన్ని బాగుచేసుకున్నారని, మరి ప్రజల బతుకులు మారాయా అని ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా వరి, పసుపు, ఎర్రజొన్న పంటలు పండిస్తారని, వారి తరపున మాట్లాడకుండా ఇక్కడి రైతాంగానికి స్థానిక ఎమ్మెల్యే నష్టం చేశారని విమర్శించారు. పసుపు బోర్డు తెస్తానన్న ఎంపీ కనబడకుండా పోయాడని అన్నారు. రాష్ట్రంలోని పేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌లు కట్టిస్తానన్న కేసీఆర్‌.. రూరల్‌ నియోజకవర్గంలోని ఏ ఒక్క గ్రామంలో ఒక్కరికైనా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు ఇచ్చిందా అని ప్రశ్నించారు. వారం రోజులు ఓపిక పడితే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తుందని, తమ కష్టాలన్నీ తీరుస్తుందని చెప్పారు. ధరణి ఎత్తేసి భూభారతి ద్వారా ప్రజల భూములు కాపాడుతామని అన్నారు. రేషన్‌ కార్డులు అందిస్తామని చెప్పారు.
కేసీఆర్‌ ఓడిపోవడం ఖాయం
గజ్వేల్‌ సభలో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాదని కేసీఆర్‌కు తెలిసిపోయిందని, గజ్వేల్‌లో ఓడిపోతానని కామారెడ్డి పారిపోయినట్టు విమర్శించారు. కానీ కామారెడ్డిలో తాను కేసీఆర్‌ను చిత్తుచిత్తుగా ఓడిస్తానని, గజ్వేల్‌లో నర్సారెడ్డి చేతిలో ఓడిపోవడం ఖాయమని అన్నారు. కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, సిద్దిపేట ప్రజలను మోసం చేసినట్టు గజ్వేల్‌ ప్రజలను రెండుసార్లు మోసం చేసి గెలిచారని తెలిపారు. సీఎం కేసీఆర్‌ బక్కటోడు కాదని బకాసురుడని అన్నారు. కావేరి సీడ్స్‌ కంపెనీని కాపాడుకొని వరి ధాన్యాన్ని రూ.4,250కు కేసీఆర్‌ విక్రయించుకుంటున్నారని ఆరోపించారు. రైతులకు మాత్రం రూ.1,960లే ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. మిల్లర్లు, ప్రభుత్వం కలిసి రైతులను దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. కామారెడ్డిలో కేసీఆర్‌ను ఓడగొట్టడానికి వేటగాడుగా మారుతున్నానని అన్నారు.
ఎమ్మెల్యేను బండకేసి కొడితే బిల్లులు వస్తాయంటూ భూపాల్‌రెడ్డిపై ఫైర్‌
నారాయణఖేడ్‌ సభలో మాట్లాడుతూ.. నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డిని బండకేసి కొడితే.. సర్పంచ్‌ల బిల్లులు అవే వస్తాయని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ పాలన గాడిదకు గడ్డేసి.. ఆవుకు పాలు పిండినట్టు ఉన్నదని ఎద్దేవా చేశారు. సంజీవరెడ్డి, షెట్కర్‌ కుటుంబాలు కలిస్తే కేసీఆర్‌ జేజమ్మ వచ్చినా ఇక్కడ కాంగ్రెస్‌ గెలుపు ఆపలేరన్నారు. పార్టీని ఐక్యంగా ఉంచడం కోసం సురేష్‌ షెట్కర్‌ తన టిక్కెట్‌ను సంజీవరెడ్డికి ఇచ్చారన్నారు. గ్రామపంచాయతీలుగా గుర్తించిన తాండాలకు నిధులు కేటాయించలేదని తెలిపారు. చెరకు ఫ్యాక్టరీ మూతపడటంతో ఇక్కడి రైతులు వలస కూలీలుగా పనికి వెళ్తున్నారని.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే వారి సమస్యలు పరిష్కరిస్తామన్నారు.

Spread the love