స్కూళ్లలో పుస్తకాలు, యూనిఫాం, స్టేషనరీ అమ్మకాలపై నిషేధం

స్కూళ్లలో పుస్తకాలు, యూనిఫాం,
స్టేషనరీ అమ్మకాలపై నిషేధం– నిరంతర పర్యవేక్షణ : హైదరాబాద్‌ డీఈవో రోహిణి సర్క్యులర్‌ జారీ
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రయివేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల్లో ఇక నుంచి యూనిఫాం, పుస్తకాలు, ఇతర స్టేషనరీ అమ్మకుండా నిషేధం విధిస్తూ హైదరాబాద్‌ జిల్లా విద్యాశాఖ అధికారిణి ఆర్‌.రోహిణి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా పరిధిలోని మండల ఉప విద్యాధికారులు, ఇన్‌స్పెక్టర్లకు ఈనెల 27న ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా పరిధిలోని స్టేట్‌ సిలబస్‌, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ సిలబస్‌ బోధించే అన్ని ప్రయివేట్‌ స్కూళ్లలో యూనిఫామ్‌, షూస్‌, బెల్ట్‌ల అమ్మకాలు జరగకుండా చూడాలని మండల విద్యాధికారులను ఆదేశించారు. పాఠశాలల ఆవరణలో విక్రయాలు జరగకుండా పర్యవేక్షించేందుకు మండలాల వారీగా కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ నిబంధనలను అతిక్రమించిన పాఠశాలలు, యాజమాన్యంపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడకూడదని చెప్పారు. దీనికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని డిప్యూటీ ఈవోలు, ఐవోఎస్‌లను ఆదేశించారు. అయితే, కోర్టు ఆదేశాల ప్రకారం పాఠశాల కౌంటర్‌లో పుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, స్టేషనరీ విక్రయాలు ఏవైనా ఉంటే.. అవి వాణిజ్యేతరంగా, లాభాపేక్ష లేకుండా ఉండాలని తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని డీఈవో హెచ్చరించారు.

Spread the love