పోక్సో కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి
బాధితురాలి పైనే ఎదురు కేసులు పెట్టడం దారుణం
చట్టం పలుకుబడిగలవారి చుట్టంగా మారింది : ఐద్వా ఆగ్రహం
నవతెలంగాణ-సిటీబ్యూరో
బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజరు కుమారుడు బండి భగీరథను తక్షణమే అరెస్టు చేయాలని ఐద్వా డిమాండ్ చేసింది. ఈ మేరకు ఐద్వా హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి వై.వరలక్ష్మి, సహాయ కార్యదర్శి కె.నాగలక్ష్మి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని, బాధితురాలికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దారుణంగా ఉందని విమర్శించారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు బాధితులను స్టేషన్‌లోనే ఉంచి, ఆ సమాచారాన్ని నిందితులకు చేరవేశారని తెలిపారు. నిందితులు కరీంనగర్‌లో బాధితురాలిపైనే ‘హనీ ట్రాప్’ కేసు పెట్టే వరకు పోలీసులు వేచి చూసి, ఆ తర్వాతే ఫిర్యాదు స్వీకరించడం చూస్తుంటే చట్టం పలుకుబడి కలిగిన వారి చుట్టంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బేటీ బచావో’ అంటూ గొప్పలు చెప్పుకునే బీజేపీ నేతలు దీనికి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. బీజేపీ నాయకుల నుంచే మహిళలకు, బాలికలకు తీవ్ర ముప్పు పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో దేశాన్ని కుదిపేసిన హత్రాస్, ఉన్నావో కేసుల్లో బీజేపీ ప్రభుత్వాలు ఎలాగైతే నిందితులను కాపాడే ప్రయత్నం చేశాయో, ఇప్పుడు ఇక్కడ అదే ధోరణి కనిపిస్తోందని పేర్కొన్నారు. బాధితురాలికి అండగా నిలవాల్సిన ప్రభుత్వం, పోలీసులు నిందితులకు కొమ్ముకాయడం సరికాదన్నారు. ఇప్పటికైనా రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా బండి భగీరథను వెంటనే అరెస్టు చేసి, బాధితురాలికి రక్షణ కల్పించాలని ఐద్వా హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


