కవిగా, విమర్శకుడిగా ప్రసిద్ధిగాంచిన బన్న ఐలయ్య 36 సంవత్సరాలు కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగంలో అధ్యాపకులుగా పనిచేసి – ప్రొఫెసర్, హెడ్, డీన్, ప్రిన్సిపాల్‌గా అంచెలంచెలుగా ఎదిగారు. తెలుగు శాఖ అధ్యక్షులుగా, పాఠ్య ప్రణాళికా మండలి అధ్యక్షులుగా, ఎస్సీ ఎస్టీ సెల్ డైరెక్టర్‌గా, అదనపు పరీక్షల నియంత్రణ అధికారిగా, పీఠాధిపతిగా, ప్రిన్సిపాల్‌గా ఎన్నో పదవులను సజావుగా నిర్వహించి ఆ పదవులకే వన్నెతెచ్చారు. బన్న అయిలయ్య పదవీ విరమణ సందర్భంగా షష్టిపూర్తి అభినందన సంచిక తీసుకురావాలని పాత విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు కలిసి చేసిన ప్రయత్నమే ఈ బహత్ సంచిక. 600 పేజీలతో ఒక అభినందన సంచిక తీసుకురావడం అపూర్వం, అద్భుతం.
ఈ సంచికను ”అభినందన, ఆత్మీయం, అక్షర యానం” అనే విభాగాలుగా వర్గీకరించారు. మొదట ‘అభినందన’ లో 28 మంది ప్రముఖులు తమ సందేశాలను అందజేశారు. ‘ఆత్మీయం’ లో 107 వ్యాసాలున్నాయి. ఇందులో తన పాత క్లాస్ మెట్లు, తన గురువులు, కొలీగ్స్, మిత్రులు, కవులు, రచయితలు, ఉద్యమకారులు, తన అభిమానులు, విద్యార్థులు, బంధువులు- ఇలా ఎంతోమంది తమ పరిచయాలనుండి బన్న అయిలయ్య విశిష్టతను, గొప్పతనాన్ని తెలియజేశారు. అధ్యాపకుడిగా బన్న అయిలయ్య నిబద్దతను- అంకితభావాన్ని కొన్ని వ్యాసాలు, పరిపాలనాదక్షునిగా కొన్ని వ్యాసాలు, విద్యార్థుల పురోగతిని కాంక్షించే గురువుగా కొన్ని వ్యాసాలు, స్నేహితులు- బంధువులు- విద్యార్థులకు పంచిన ఆత్మీయతను వెల్లడించిన వ్యాసాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ వ్యాసాలు అన్నీ బన్న అయిలయ్య వివిధ పార్శ్వాలను, బహుముఖీనతను తెలియజేస్తాయి. ‘అయి లయ్య చైతన్య శక్తి’ అని కాత్యాయని విద్మహే వివరించగా, తెలంగాణ అరిస్టాటిల్ అని కత్తి పద్మారావు కొనియాడగా ఆధునిక కవి విమర్శకులని రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి, సంయమనం- సమన్వయం- సమగ్ర వ్యక్తిత్వం అని నందిని సిద్ధారెడ్డి విశ్లేషించారు. నిలువెత్తు విజ్ఞాన భాండాగారం అని కొలిపాక శ్రీనివాస్, నిత్య సాహిత్య స్ఫూర్తి అని కోయి కోటేశ్వరరావు చివరకు ‘సామాజిక అస్తిత్వ చైతన్యమే అయిలన్న జీవితం’ అని అన్నవరం దేవేందర్ నిర్ధారించారు. బన్న అయిలయ్య సహదయులు, స్నేహశీలి అని తెలిసినా, ఇందులోని వ్యాసాలు చదువుతుంటే అది ఎంత నిజమో అందరికీ తెలిసిపోతుంది.
‘అక్షర యానం’ విభాగంలో కవిగా, విమర్శకుడిగా, సాహిత్య వేత్తగా బన్న అయిలయ్య రచనలను వివిధ కోణాలలో విశ్లేషిస్తూ 45 మంది తమ వ్యాసాలను రాశారు. ‘చైతన్య జ్వలిత అయిలయ్య కవిత’ అని ఎలగొండ రాములు రాయగా, ‘రహస్య చిత్రం’ కవితా సంపుటి మీద కొందరు రాయగా, నిప్పు కణిక దీర్ఘకావ్యం మీద అందులోని సామాజికాంశాల మీద సునారి కిష్టయ్య, దళిత దక్పథం మీద కల్వడపు రమేష్, దళిత బహుజన తత్వము మీద దార్ల వెంకటేశ్వరరావు, ఆత్మగౌరవ సంకేతంగా జీవి రత్నాకర్ మొదలైన వారు విశ్లేషించారు. తెలంగాణ కథ మీద బన్న ఐలయ్య గారి కషిని వివరిస్తూ ప్రొఫెసర్ సూర్య ధనంజరు, స్వప్న భువకర్ వ్యాసాలను రాశారు. ‘విమర్శకుడిగా ఆచార్య బన్న అయిలయ్య’ గా అంపశయ్య నవీన్, ‘నిశిత పరిశీలకుడు ఆచార్య అయిలయ్య’ గా డాక్టర్ ముదిగొండ సుజాతారెడ్డి, దళిత సాహిత్య విమర్శకుడిగా ఏటూరి జ్యోతి, మంథని శంకర్- కవితా విమర్శకుడిగా భూదాటి వెంకటేశ్వర్లు, అస్తిత్వవాద విమర్శలో బన్న అయిలయ్య అని సిహెచ్ లక్ష్మణ చక్రవర్తి, తెలంగాణ సాహిత్య చరిత్ర పునర్నిర్మాణ ఉపయుక్తగా డాక్టర్ ఎస్ రఘు, ‘ధార’ విమర్శ పుస్తకాన్ని విశ్లేషిస్తూ సుంకిరెడ్డి నారాయణరెడ్డి, కరిమిండ్ల లావణ్య రాసిన వ్యాసాలు ఉన్నాయి. ‘అయిలయ్య కొన్ని వచన రచనలు’ పై బివిఎన్ స్వామి, ‘సామాజికాంశాల పర్యవేక్షకులు డాక్టర్ బన్న అయిలయ్య’ అంటూ డాక్టర్ టి శ్రీరంగస్వామి, ‘ఆచార్య బన్న పీఠికలు -సాహిత్య సారాంశ దీపికలు’ అంటూ పొన్నాల ఉపేందర్, ‘బాల సాహిత్యానికి చేయూతనిచ్చిన బన్న’ అని డాక్టర్ వి ఆర్ శర్మ వివరణాత్మక వ్యాసాలు రాయగా- ‘బోధనకు విమర్శకు దిక్సూచి’ అంటూ డాక్టర్ పెద్ది వెంకటయ్య కొనియాడారు. ఈ 45 వ్యాసాలు కొన్ని రిపీటెడ్ గా కనిపించినా ఎవరి దక్పధం వారిదే, ఎవరి శైలి వారిదే అని చదివిన తర్వాత అవి డిఫరెంట్ గా ఉన్నాయని మనం తప్పకుండా గుర్తిస్తాం. ఈ వ్యాసాలన్నీ సాహిత్యకారుడిగా బన్న అయిలయ్య విశ్వరూపాన్ని చూపిస్తాయి. బన్న అయిలయ్య జీవితాన్ని, సాహిత్యాన్ని గురించి తెలుసుకోవాలనుకునేవారికి ఈ సంచిక ఒక దిక్సూచిలా ఉపయోగపడుతుంది.
– కె.పి.అశోక్ కుమార్
9700000948