బీసీలు రాజ్యాధికారం చేపట్టాలి

బీసీలు రాజ్యాధికారం చేపట్టాలి– ‘ధరణి’ ఫెయిల్‌ అని రాష్ట్ర ప్రభుత్వమే చెప్పింది
– నీళ్లు, నిధులు, నియామకాలు సాధనే జనసేన లక్ష్యం
– ధర్మ యుద్ధం చేసేందుకే బీజేపీకి మద్దతు : ఎన్నికల ప్రచార సభల్లో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌
నవతెలంగాణ-కొత్తగూడెం/సూర్యాపేట
రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌ ఫెయిలయిందని ప్రభుత్వమే చెప్పిందని, రైతులకు ఉపయోగం లేని ఈ ధరణిని ఎత్తివేయాలని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీలు రాజ్యాధికారం చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని చెప్పారు.బీజేపీకి మద్దతుగా గురువారం కొత్తగూడెం, సూర్యాపేట ఎన్నికల ప్రచార సభల్లో పవన్‌కళ్యాణ్‌ పాల్గొన్నారు. కొత్తగూడెం సింగరేణి ప్రకాశం స్టేడియంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. దేశ అభివృద్ధి ఒక బీజేపీతోనే సాధ్యమన్నారు. తెలంగాణ ఉద్యమ స్పూర్తితోనే ఆంధ్రాలో రౌడీలు, గుండాలను ఎదుర్కొంటున్నానని చెప్పారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పారు. రాష్ట్రంలో 19 లక్షల మంది కౌలు రైతులు ఉంటే.. లేరని చెప్పాడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం పాలకులపై ఉందని తెలిపారు. అభివృద్ధి అంతా హైదరాబాద్‌ చుట్టే జరుగుతుందని, రాష్ట్రంలో ఇతర ప్రాంతాలు అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం విఫలం అయిందని చెప్పారు. ఎకరం భూమి రూ.100 కోట్లు అయిందని చెప్పారు.
నీళ్లు, నిధులు, నియామకాలు సాధనే జనసేన లక్ష్యం
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పొట్టి శ్రీరాములు సెంటర్‌లో జరిగిన రోడ్‌ షోలో ఆయన మాట్లాడుతూ.. నీళ్ళు, నియామకాలు, నిధులు సాధనకు జనసేన పాటుపడుతుందని తెలిపారు. నల్లగొండ జిల్లాలో తమ్ముడు సినిమా విజయవంతానికి వచ్చినప్పుడు ఫ్లోరోసిస్‌ బాధితులను చూడగానే తన మనసు కలచి వేసిందన్నారు. అదే 2008లో జనసేన పార్టీ స్థాపనకు మూల కారణమైందన్నారు. 2009లో నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్‌ గ్రామాల్లో తిరిగి వాటర్‌ ప్లాంట్స్‌ పెట్టేందుకు ముందుకు వస్తే స్థానిక రాజకీయ శక్తులు అడ్డుకున్నాయని విమర్శించారు. తనపై ఎక్కువగా ప్రభావం చూపింది గద్దర్‌ మాటలేని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీతో కలిసి 100 స్థానాల్లో పోటీ చేస్తుండగా, జనసేన 8 స్థానాల్లో పోటీలో ఉందన్నారు. డబల్‌ ఇంజన్‌ సర్కారు దిశగా జనసేన కృషి చేస్తుందని స్పష్టం చేశారు.

Spread the love