అందమే ఆనందమై విరిసిన పాట

అందమే ఆనందమై విరిసిన పాటమనసు ఆనందంగా ఉన్నప్పుడు మన చుట్టూ ప్రశాంతమైన వాతావరణమే కనిపిస్తుంది. మనసు అందాల లోకాల్లో విహరిస్తుంటుంది. ప్రేమ నిండిన హృదయాలే అంతటా కనిపిస్తాయి. నవరాగాలు పలికిస్తాయి. విశాల ప్రపంచమంతా హాయిగా ఊయలలూగుతూ కనబడుతుంటుంది. అలాంటి ఆనందమే అందంగా, అందమే ఆనందంగా దర్శనమిస్తుంది. ఆ ఆనందాన్ని పాటగా పలికించిన కవి సముద్రాల జూనియర్‌ (సముద్రాల రామానుజాచార్యులు) 1953 లో పి.ఎస్‌.రామకృష్ణారావు దర్శకత్వంలో వచ్చిన ‘బ్రతుకు తెరువు’ సినిమాలోని ఆ పాటనిపుడు పరిశీలిద్దాం.
సముద్రాల జూనియర్‌ సంప్రదాయ గీతాలకు పెద్దపీట వేసిన కవి. తీయనైన వలపు పాటల్ని కూడా ఎంతో ఇంపుగా రాసిన కవి ఆయన. అందాల ఆనందాల పరవశమౌ గీతాన్ని ఆయన ఎంతో అద్భుతంగా రాశాడు.
ఆనందమే అందంగా పరిమళిస్తున్న సమయం.. మనసు పాటల సరాగాలతో పరవశిస్తున్న తరుణం.. జీవితమే తీయని అనుభూతుల సమాహారంగా కనబడుతుంది.. అలాంటి జీవితాన్ని పాటగా పాడాలనిపిస్తుంది. ప్రకృతిని పరమాద్భుతంగా చూడగలిగిన మనసు అంతటా సౌందర్యాన్ని చూస్తూ, ఆ సౌందర్యాన్ని గానంగా ఆలపిస్తుంటుంది.
పడమర దిక్కున సూర్యుడు దిగిపోతున్న తీరు ఒక వింత వర్ణమై మైమరపింపజేస్తుంది. ఎటు చూసినా విరిసిన పువ్వులలోని పుప్పొడి మనసుకు తీయదనాన్ని, ఆహ్లాదాన్ని అందిస్తున్న వైనాన్ని కవి తెలియజేస్తున్నాడు. మనసుల్లోని నిత్యనూతన భావాలను ఆవిష్కరించే సమయాలని కవి కళ్ళముందుంచుతున్నాడు. ఒడిలో చెలి గానం మైమరపిస్తుందంటున్నాడు. జీవితమే మధురమైన ప్రేమానురాగాలుగా ఆవిష్కృతమవుతున్నాయని చెబుతున్నాడు.
మొదటి చరణంలో కవి జీవితంలోని ఆనందాన్ని, దాన్ని ఆవిష్కరించే సన్నివేశాల్ని, సందర్భాల్ని గురించి చెప్పాడు. ఆ ఆనందాన్ని ఎలా పొందాలో, పొందినపుడు ఆ అనుభూతి ఎలా ఉంటుందో చెప్పాడు. ఇక రెండవ చరణంలో జీవితం పడిలేచే సముద్ర తరంగమని, సముద్రం ఒడిలో ఉవ్వెత్తున్న ఎగిసిపడిన తరంగాల సమూహమని, సుడిగాలిలో ఎగురుతున్న గాలిపటమని చెబుతున్నాడు. అంటే.. జీవితంలో సంతోషమే కాదు కష్టాలూ ఉంటాయని, ఈదరగాలుల వలె కష్టాలు ఎగిసివస్తాయని, సుడిగాలిలాంటి కష్టాలలో మన జీవితం గాలిపటంలాగా ఎగురుతూ ఉంటుందని బోధిస్తున్నాడు. జీవితంలోని ఆనందాన్ని, ఆ ఆనందంలోని మకరందాన్ని ఎలా హాయిగా ఆస్వాదించామో, కష్టాన్ని కూడా అలాగే ఆస్వాదించగలగాలని అంతర్లీనంగా బోధిస్తున్నాడు కూడా.
కష్టసుఖాల కలయికనే జీవితమని, ఆ జీవితమే మకరందమని అంటున్నాడు. ఇది ఒక నాటకరంగమని కూడా చెబుతున్నాడు. జీవితం విలువని తెలిపే పాట ఇది.
పాట:-
అందమే ఆనందం/ ఆనందమే జీవిత మకరందం/ పడమట సంధ్యారాగం కుడి ఎడమల కుసుమపరాగం/ ఒడిలో చెలి మోహనరాగం/ జీవితమే మధురానురాగం/ పడిలేచే కడలి తరంగం/ ఒడిలో జడిసిన తారంగం/ సుడిగాలిలో ఎగిరే పతంగం/ జీవితమే ఒక నాటకరంగం/ అందమే ఆనందం/ ఆనందమే జీవిత మకరందం.
– డా||తిరునగరి శరత్‌చంద్ర,

[email protected]
సినీ గేయరచయిత, 6309873682

Spread the love