మా వల్లే అడవిబిడ్డలకు ‘పోడు’ పత్రాలు

కేంద్రం, రాష్ట్రాల్లోనూ ఏ ప్రభుత్వం ఏర్పడినా ఆ ప్రభుత్వం మెడలు వంచి ప్రజలకు ఉపయోగపడే చట్టాలను చట్టసభల్లో అమలు చేయించి ప్రజలకు అందిం– ప్రభుత్వాల మెడలు వంచి..
– ప్రజా చట్టాలను తీసుకువచ్చిన ఘనత సీపీఐ(ఎం)దే
– డబ్బు రాజకీయాలను ఓడించాలని పిలుపు
– జనాల కోసం పనిచేసే నాయకున్ని గెలిపించాలని విజ్ఞప్తి : సీపీఐ(ఎం) పాలేరు నియోజకవర్గ అభ్యర్థి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ- కూసుమంచి
కేంద్రం, రాష్ట్రాల్లోనూ ఏ ప్రభుత్వం ఏర్పడినా ఆ ప్రభుత్వం మెడలు వంచి ప్రజలకు ఉపయోగపడే చట్టాలను చట్టసభల్లో అమలు చేయించి ప్రజలకు అందించిన ఘనత సీపీఐ(ఎం)దేనని ఆపార్టీ పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని నేలపట్ల, అగ్రహారం, మునిగేపల్లి, గోపాల్‌రావు పేట, జీళ్ళచెరువు, కేశవాపురం, చేగొమ్మ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆనాడు కేంద్రంలో యూపీఏ-1 సర్కార్‌ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఉపయోగపడే ఉపాధి హామీ చట్టాన్ని, సమాచార హక్కు చట్టాన్ని, చట్టసభల్లో ప్రభుత్వాలు మెడలు వంచి ఆమోదింప చేసిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీలదే, ముఖ్యంగా సీపీఐ(ఎం) పార్టీదేనని అన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాడి గిరిజనులు, అడవి బిడ్డలకు పోడు భూములకు హక్కుపత్రాలను అందేటట్లు చేశామని తెలిపారు. కేవీపీఎస్‌ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా సైకిల్‌ యాత్రలు నిర్వహించి ఎస్సీ సబ్‌ ప్లాన్‌ను తీసుకొచ్చేలా చేశామన్నారు. ఈ రోజు ప్రతి ఎస్సీ కాలనీల్లో సీసీ రోడ్లు, వీధిలైట్లు ఏర్పాటు చేశారంటే అది సబ్‌ప్లాన్‌ ఫలితమేనని గుర్తు చేశారు. సీతారామ ప్రాజెక్టుతో గోదావరి జలాలను పాలేరు జలాశయంలో కలుపుతామని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం.. ఆనాడు తాను చేసిన దుమ్ముగూడెం ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం చేసిన పాదయాత్ర ఫలితమేనని వెల్లడించారు.
నేడు పాలేరులో పోటీ చేస్తున్నటువంటి నాయకుల చరిత్ర చూసి ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. వేలకోట్ల కాంట్రాక్టు పనులు చేస్తూ అందులో అవినీతికి పాటుపడుతూ, అక్రమంగా సంపాదించిన డబ్బుతో ప్రజలను అంగడి సరుకులా కొనుగోలు చేసి ఓట్లు వేయించుకుందామని చూస్తున్న బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులను ఓడించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డబ్బు సంచులు పట్టుకొని ఏ పార్టీ అధికారంలోకొస్తే ఆ పార్టీలోకి వెళుతూ ఊసరవెల్లిగా రంగులు మారుతున్న నాయకులను ప్రజలు తిరస్కరించాలన్నారు. జన సమస్యల కోసం, ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల కోసం పోరాటం చేస్తూ ప్రజల మధ్యలో ఉన్నటువంటి సీపీఐ(ఎం) అభ్యర్థి తనను ప్రజలు ఆదరించి, ఆలోచించి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వైరా సీపీఐ(ఎం) అభ్యర్థి భూక్య వీరభద్రం, సీపీఐ(ఎం) పాలేరు డివిజన్‌ ఇన్‌చార్జి బండి రమేష్‌, మండల ఇన్‌చార్జి బుగ్గవీటి సరళ, మండల కార్యదర్శి యడవల్లి రమణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఎర్రబోయిన భారతి, మండల కమిటీ సభ్యులు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ప్రవీణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love