సోదాల పేరుతో, తలుపులు మూసి,
నిరాధారాలను ఆధారంగా చూపి,
నిర్దోషిని దోషిగా చిత్రీకరిస్తే,
సాక్షిగా నిలిచిన నాలుగు గోడలు,
నోరున్న సమాజంతో గోడు వెల్లబోసుకున్నాయి
మాది జీవం లేని ప్రాణమైతే!
సజీవంగా నిలిచిన సమాజ సమాధి మీరు అని!!
బెయిల్, పేరోలు అవినీతికి మేలు అవుతుంటే,
చట్టాలు సెక్షన్లు బలహీనులను బందీ చేస్తుంటే,
మానవ హక్కులన్నీ, ఉక్కు సంకెళ్ళలలో మగ్గిపోతుంటే,
రాజ్యాంగ పీఠిక ఆత్మ అరణ్య రోదన ఎవరికి వినిపించింది!
గంతలు కట్టిన న్యాయదేవత
కార్చిన కన్నీరు ఎవరికి కనిపించింది!!
కదలలేని నిన్ను తన చేతుల్లో పెంచిన అమ్మ ఆఖరి చూపుకై
నీ కనుచూపులు వెతికిన దారులు
తల్లికై తల్లడిల్లుతున్న నిన్ను చూసి, కరిగిపోయిన ఆ జైలు గోడల గుండెలు
ఇరుకైన అండా సెల్, బిగిసుకు పోయి ఓదార్చిన ఇనుప కడ్డీలు.
కాలే చితిలో రగిలే తల్లి కడుపు కోత
జ్వాలలు కార్చిన కన్నీటి దారలు, పరితపించిన పంచభూతాలు,
అర్పించిన అశ్రు నివాళులు!
బూడిదై మిగిలిన నీ జ్ఞాపకాలు, చలనం లేని ఈ ప్రపంచ ఆనవాలు!!
నిజాలను మాట్లాడించిన మీ మౌన పోరాటం,
నిజాయితీని గెలిపించిన నీ దఢ సంకల్పం,
నిర్బంధాలను బంధించి, నియంతల నిగ్గు తేల్చీ,
న్యాయాన్ని నిలబెట్టి, నిష్క్రమించావా
కుర్చీ భుజాలపై ముద్రించిన చేతుల చైతన్యం నిలిపి,
నిన్ను మోసి, తరించిన జాడల జాగతిని చూపి,
ప్రగతి పథాలను నడిపిన, నీ చక్రాల సైకిల్ నొదిలి!
హక్కులకై పోరాడే నీ అక్షరానోదిలి!!
– పగడాల శ్రీనివాస్