నవతెలంగాణ-నిర్మల్
కస్తూర్భా గాంధీ విద్యాలయాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కస్తూర్భా గాంధీ విద్యాలయాల్లో కల్పిస్తున్న సౌకర్యాలపై ప్రిన్సిపాల్స్, ప్రత్యేకాధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రత్యేకాధికారులంతా నిరంతరం కేజీబీవీలను తనిఖీలు చేయాలనీ, సమస్యలను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. తనిఖీలకు సంబంధించిన సమాచార నివేదికలను అందజేయాలన్నారు. మధ్యాహ్న భోజనాన్ని రుచిచూసి, నాణ్యతను తెలుసుకోవాలని, విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం, అల్పాహారం అందేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వంటగదిని ప్రతిరోజూ పరిశుభ్రంగా ఉంచాలని, వంటకు నాణ్యమైన కూరగాయలను, వస్తువులను మాత్రమే వాడాలని సూచించారు. కిచెన్ గార్డెన్లను నిర్వహించాలని, ప్రతీ కేజీవీబీలో రక్షణ గోడ, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ లాంటి సౌకర్యాలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాలల్లో అన్ని రకాల కమిటీలను ఏర్పాటు చేసి ఇందులో విద్యార్థులను భాగస్వామ్యం చేయాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో దోమలు వ్యాప్తి చెందకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో మురుగు నీరు నిల్వఉండకుండా చర్యలు చేపట్టాలని, ఫాగింగ్, ఆయిల్ బాల్స్ వేయాలన్నారు. వైద్య శిబిరాలు నిర్వహించాలని, ప్రతి కేజీబీవీలో అనారోగ్యబారిన పడిన విద్యార్థులకు ప్రత్యేక గదిని ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతీ కేజీవీబీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన చేయాలని, ఉన్నత ఫలితాలు సాధించేలా కృషి చేయాలని సూచించారు. అనంతరం మండలాల వారిగా కేజీబీవీలలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను, సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, ఇతర అంశాలపై చర్చించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీఈఓ రవీందర్‌రెడ్డి, ప్రత్యేక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.