సత్యం 35 ఏళ్ల యువకుడు. ఆశలతో, చిన్న మొత్తంలో మొదలైన ఓ సరదా అతని జీవితాన్ని చీకటిలోకి నెట్టేసింది. ఐపీఎల్ బెట్టింగ్ యాప్‌లో తొలిసారి వంద రూపాయలు గెలవడంతో అతనికి కొత్త ఆశ కలిగింది. ఒక్కసారిగా లక్షలు సంపాదించగలనన్న భ్రమలో మునిగిపోయాడు. ఆతర్వాత చిన్న చిన్న నష్టాలను తట్టుకుని ముందుకు సాగాడు. కానీ కొన్ని నెలల్లోనే కొన్ని లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. అప్పులు పెరిగి, బంధువులు, స్నేహితులందరూ దూరమయ్యారు. కుటుంబ సభ్యులు చివరి అవకాశం ఇస్తూ, నా దగ్గరికి కౌన్సెలింగ్‌కు తీసుకురాగా, అతను తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు.
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు మన మనసును, ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తాయి. మొదట ఒక చిన్న మొత్తంతో ఆడించి, కొంత నష్టపోయినా తిరిగి గెలుస్తానన్న ఆశను పెంచుతాయి. మన మెదడు డోపమైన్ అనే కెమికల్‌ను విడుదల చేస్తుంది. ఇది ఆనందాన్ని కలిగించే హార్మోన్. మొదట గెలిచిన ఆనందంతో, ఆడటం కొనసాగిస్తారు. కానీ కొంతకాలానికి, గెలుపుల కంటే ఎక్కువ నష్టాలు వస్తాయి. అప్పటికే మెదడు ఈ యాప్స్‌కు అలవాటైపోయి, ఆగలేని పరిస్థితి ఏర్పడుతుంది.
బెట్టింగ్ ప్రభావం- కుటుంబాలపై దెబ్బ
బెట్టింగ్ వ్యసనం ఉన్నవారు ఇంట్లో ఎవరితోనూ మట్లాడరు. డబ్బు తిరిగి తెచ్చుకోవాలన్న తాపత్రయం, అప్పుల ఒత్తిడి వల్ల ఇంట్లో గొడవలు మొదలవుతాయి. చివరకు కుటుంబ బంధాలు తెగిపోతాయి. చాలామంది భార్యాభర్తల పట్ల నమ్మకం కోల్పోయి విడాకులు కోరుతున్నారు. ఆ ప్రభావం పిల్లల భవిష్యత్తుపై పడుతుంది.
తీవ్ర ప్రభావాలు – ఆత్మహత్యలు, మానసిక సమస్యలు
నష్టం తీవ్రంగా పెరిగినప్పుడు డిప్రెషన్ (ఉదాసీనత), ఆత్మహత్యా భావనలు పెరుగుతాయి. చాలామంది దీనికి బలవుతున్నారు. సమాజం ఈ వ్యసనాన్ని చిన్నగా చూడకూడదు. ఇది మద్యం, డ్రగ్స్ లాంటి ప్రమాదకరమైన వ్యసనమే.
సమస్య నుంచి బయట పడటానికి మార్గాలు
1. సహాయం కోరాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి సైకాలజిస్టులను సంప్రదించాలి.
2. కుటుంబ సభ్యులు సహకరించాలి. బాధితులను తప్పుపట్టకుండా వారికి మద్దతుగా ఉండాలి.
3. ఆర్థిక నియంత్రణ పాటించాలి. డబ్బు ఖర్చు చేయడంపై నియంత్రణ పెంచాలి.
4. న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి. బెట్టింగ్ యాప్‌లపై కేసులు పెట్టి వీటిని ఆపే ప్రయత్నం చేయాలి.
సత్యం లాంటి వారిని కోల్పోకుండా, ముందుగా వారికి సహాయం చేయడం అవసరం. బెట్టింగ్ యాప్‌లు కేవలం గెలుపు ఆశ చూపిస్తాయి కానీ చివరికి మన జీవితాన్ని మింగేస్తాయి. మనకు ప్రియమైనవారు ఈ వ్యసనంలో పడకుండా చూడాలి. సమాజం కలిసికట్టుగా ముందుకు వచ్చి ఈ మానసిక వ్యాధిని అరికట్టాలి.
”సమయానికి ఆగితే గెలుపు, అలా కాకపోతే జీవితమే ఓటమి!”
డా|| హిప్నో పద్మా కమలాకర్, 9390044031
కౌన్సెలింగ్, సైకో థెరపిస్ట్, హిప్నో థెరపిస్ట్