భగత్‌ సింగ్‌

Bhagat Singh(ఏకపాత్రాభినయం)

నా దేశం అస్వతంత్ర భారతం
అంధకార బంధురం
అలుముకున్న నిర్బంధం
మాట్లాడే హక్కు లేని జీవితం
స్వేచ్ఛ లేని స్వాతంత్రం ..ఛా…
ఒరే… జాన్‌ సాండార్స్‌
వర్తకం కోసం వచ్చి,
భారతీయులు నెత్తికెక్కి ,
పదవి నెక్కి, మదం మెక్కి, గద్దెనెక్కిన
ఒరే తెల్ల కుక్క ఖబడ్దార్‌
మేము యువకులం
మేము నవతరం
చచ్చేదాకా ఎదురుచూసే
గానుగలం పినుగులం కానే కాదు.
మేము యువకులం
దేశం కోసం రక్తతర్పణం చేసే యువకులం
మేము తప్ప మరెవ్వరు చేయగలరా..
ఎస్‌ … మేమే చేయగలం ఉత్తుంగ తరంగాలం,
ఉద్దండ పిండాలం
శ్వాస ఎంత ముఖ్యమో.. దేశానికి స్వాతంత్రం అంతే ముఖ్యం.
శ్వాస కోసం-స్వేచ్ఛ కోసం ప్రపంచ చరిత్ర పేజీలను
ఒక్కసారి తెరిచి చూడండి. యువకులు ధారపోసిన రక్తమెంతో… ఒక పాగల్‌ చాకిరే సిరాజుత్‌ దౌలా,
ఉద్ధం సింగ్‌, ఝాన్సీ, గదర్‌ వీరులే… అడుగడుగునా యువకులే దర్శనమిస్తారు. నికార్సైనా యువకులే…
ముందు వెనుక చూడకుండా
చావును ఆలింగనం చేసుకున్న వాళ్లే… ఛాతినీ తెరిచి చావు ఎదుట నిలబడ్డ వాళ్లు..
మరఫిరంగి ముఖద్వారం ముందు
సవాల్‌ చేసిన వాళ్లు..
చేతులకు వేసిన సంకెళ్ళు
‘లయ’తో జాతీయ గీతాలు ఆలపించాయి.
నువ్వు తాగిన నీ తల్లి పాల రుణం తీర్చుకో..
నడుం బిగించు,
అమ్మ కారుస్తున్న
ఒక్కొక్క కన్నీటి బొట్టు మీద ఒట్టు పెట్టి,
కష్టాలను తొలగించు,
కులం వద్దు మతం వద్దు
సమానత్వం మా సరిహద్దు
తోటి మనుషులను
ప్రేమించలేని మీరు పాలకులా..?
ఒక మనిషి మరో మనిషి పరాయి వాడుగా కనిపించని నవ సమాజం కోసం పోరాడాలి
అవును! మేము
విప్లవాన్నే కోరుకుంటున్నాం. విప్లవం అంటే ?
తుపాకులు బాంబులు కాదు. విప్లవం అంటే మౌలిక మార్పు అలాంటి మార్పు కోసం నడువు, నడుం బిగించు,
విశ్వ మానవ సౌభ్రాతత్వాన్ని తీసుకొద్దాం.
యువకుల్లారా!
జీవితాన్ని ప్రేమిస్తాం, మరణాన్ని ప్రేమిస్తాం
అగ్నిపర్వతం మీద నిలబడ్డ వాళ్ళం.
ఉరికంబం పై ఊయలగా
ముద్దాడిన వాళ్ళం.
నేను బలైన మన భవిష్యత్తును
మీరు నిర్మించాల్సిందే..
యువతరమా !
నవలోకం తేవాల్సిందే..
ఇంక్విలాబ్‌ జిందాబాద్‌.
– భూపతి వెంకటేశ్వర్లు, 9490098343

Spread the love