కాళికాదేవి ఛత్రపతి శివాజీకి ఖడ్గం ప్రసాదిస్తున్న చిత్రపటం అందరూ చూసే ఉంటారు. కొందరు ఆ పటాన్ని తమ ఇండ్లలో కూడా పెట్టుకునే ఉంటారు. వాస్తవంలో ఎక్కడా లేని ‘భవాని’ శివాజీకి ప్రత్యక్షమైందా? మరి, ఆయనకు ఆ కత్తి ఎక్కడిదీ? దానికి సంబంధించిన చారిత్రక సత్యాలేమిటీ? తెలుసు కోవాలంటే, కొంచెం వివరాల్లోకి పోవాలి. మరి, భవానీ ప్రత్యక్షమైందన్న కల్పిత కథకు సష్టికర్తలెవరూ?అందరూ తెలుసుకోవాల్సిందే! ఇంగిత జ్ఞానం ఉపయోగించి ఆలోచించాల్సిందే!!
భవానీ ప్రసాదించిందని చెప్పుకునే ఖడ్గానికి సంబంధించిన వాస్తవాలు ఇలా ఉన్నాయి –
1659లో కొంకణితీర ప్రాంతంలో పోర్చుగీసు వారి నౌక ఒకటి మునిగిపోయింది. శివాజీ సైన్యంలో ఒకడైన అంబాజీ సావంత్, మాళవజాతి సైనికుడు ఆనౌకను కొల్లగొట్టాడు. అప్పుడు నౌకలో అతనికి ఒక ఖడ్గం లభించింది. దాన్ని అతను భద్రపరుచుకున్నాడు. కొంతకాలం తర్వాత, అంబాజీ సావంత్ కొడుకు కష్ణా సావంత్ పెద్దవాడయ్యాడు. ఆ ప్రాంతానికి ఒకసారి శివాజీ పర్యటనకు వచ్చినపుడు తన తండ్రి భద్రపరిచిన ఆ ఖడ్గాన్ని కష్ణాజీ సావంత్, శివాజీకి చూపించాడు. శివాజీ ముచ్చట పడి అతనికి 300 హొన్నులిచ్చి తీసుకున్నాడు. శివాజీ ఖడ్గం గురించి మరొక వాదన కూడా ఉంది- పోర్చ్‌గీస్ గవర్నర్ అల్ఫాన్సో అబ్బాకర్క్ 1510లో గోవాని స్వాధీనం చేసు కోవడానికి వచ్చాడు. అప్పుడు అతని సేనాని ఫెర్నాండిస్, శివాజీ సేనాని అంబాజీ సావంత్ చేతిలో ఓడిపోయాడు. అప్పుడు అంబాజీ సావంత్ పోర్చ్‌గీసు వారి నుండి స్వాధీనం చేసుకున్నది అదే ఖడ్గమని చెపుతారు. ఏది ఏమైనా ఏ విధంగా ఎలా అందినా, శివాజీకి అందిన ఒక ఖడ్గం పోర్చుగీసు వారిదన్నది నిజం! కాళికాదేవి లేదా భవానీ ప్రత్యక్షమై శివాజీకి ఖడ్గం బహూకరించిందని చెప్పేది మనువాదులు కల్పించిన కట్టుకథ మాత్రమే అందులో నిజం ఎంత మాత్రమూ లేదు.
పోర్చుగీసు వారి నుండి తనకు అందిన పొడవాటి కత్తి అంటే శివాజీకి ఇష్టంగా ఉండేది. అలాంటి కత్తే తన సైనికుల కోసం తయారు చేయించాలని డచ్ వారిని, ఇంగ్లాండ్ వారిని, ఫ్రాన్స్ వంటి కొన్ని దేశాల వారినీ శివాజీ సంప్రదించాడు. అయితే ఆయా దేశాల వారెవరూ ముందుకు రాలేదు చివరకు స్పెయిన్ దేశం ముందుకొచ్చింది. వేలాది కత్తులు తయారు చేసి పంపింది. ఇతర దేశాల వారికి కాకుండా, కత్తులు తయారు చేసి ఇచ్చే అవకాశం తమకే ఇచ్చినందుకు స్పెయిన్ రాజు సంతోషపడి, మంచి పొడవూ, వెడల్పులతో నిటారుగా ఉండే ఒక ఖడ్గాన్ని ప్రత్యేకంగా తయారు చేయించి- శివాజీకి బహుమతిగా పంపించాడు. దానిలో పది వజ్రాలు, పది వైడూర్యాలు నలభై నాలుగు మరకతాలు పొదిగి తయారు చేసిన ఖడ్గం అది! ఈ రకంగా శివాజీ దగ్గర రెండు ప్రత్యేకమైన కత్తులుండేవని తెలు స్తోంది. ఇవి అలంకరణకు తప్ప, యుద్ధానికి పనికి వచ్చేవి కావు. శివాజీ కత్తులకు సంబంధించిన వాస్తవాలు ఇలా ఉంటే, హిందూ మనువాదుల కల్పిత కథలు వేరే విధంగా ఉన్నాయి.
ఇక తుల్జాకత్తి విషయానికి వద్దాం.1875లో వేల్స్ రాకుమారుడు ఏడవ ఎడ్వర్డ్ భారత దేశానికి వచ్చినపుడు శివాజీ వంశానికి చెందిన కొల్లార్ సంస్థానాధీశుడు ప్రతాప్ సింగ్ భోంస్లే ఆయనకు తుల్జా కత్తిని బహూకరించాడు. ఈ దేశంలోని రాజ కుటుంబాలలో అత్యంత విలువైన వస్తువులు కొన్ని ఉండేవి. ఉదాహరణకు
షాజహబన్ నెమలి సింహాసనం, కోహినూర్ వజ్రం టిప్పూసుల్తాన్ కత్తి అలాగే, ఆ జాబితాలో శివాజీ ఖడ్గం కూడా చెప్పుకోవాలి.
ప్రస్తుతం ఆ ఖడ్గం లండన్‌లోని ఆల్బర్ట్ మ్యూజియంలో ఉంది. ఆ మ్యూజియం నుండి – అదే విషయం గూర్చి అంబేద్కర్ బుద్ధసంఘం అధికారిక ధృవీకరణ పొందింది. శివాజీ ఖడ్గం మీద ఐహెచ్‌ఎస్ అనే ఇంగ్లీషు అక్షరాలు కనబడుతున్నాయి. ఆ అక్షరాలను బట్టి, అది స్పెయిన్‌లో తయారయ్యిందని పరిశోధకులు నిర్థారించారు. ఇంక భవానీ దేవెక్కడీ ప్రత్యక్షం కావడం ఎక్కడా? ఆలోచించుకునే బాధ్యత మనదే కదా?
ఆ తర్వాత చాలాకాలానికి, చిత్పవన్ వంశానికి చెందిన పీష్వాల వారసుడు బాల గంగాధర్ తిలక్. ఈయనా బ్రాహ్మణుడే. శివాజీ వ్యక్తిత్వాన్ని స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా ప్రచారం చేశాడు. 1894లో శివాజీ ఉత్సవాలు,ఆ తర్వాత వినాయక చవితి ఉత్సవాలు జరిపాడు.స్వాతంత్య్ర పోరాట సమయంలో శివాజీని ఒక హిందూ మతోద్ధారకుడిగా ప్రచారం చేశాడు. శివాజీకి భవానీ ప్రత్యక్షమై ఖడ్గం ప్రసాదించిందని కట్టు కథలు ప్రచారం చేశాడు. శివాజీ శౌర్యాన్ని, కష్టాన్ని బుగ్గిపాలు చేసి, అంతా ఆ భవానీ కప అన్నట్లు – అబద్దాలు పుట్టించింది తిలకే. శివాజీ వారసుల్లో ఒకడైన సాహూ మహారాజు తన సంస్థానంలో మొదటిసారి రిజర్వేషన్లు అమలు చేసిన విషయం మన మిక్కడ గుర్తుంచుకోవాలి. చాలాకాలం తర్వాత, జ్యోతిబాఫూలే శివాజీ సమాధిని వెతికించి, వెలికితీయించాడు. కావ్యాలు రాశాడు.
ఈ దేశంలో మనువాదులు చేసిన ఘోరాలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయంటే- బౌద్ధా రామాలన్నీ దేవాల యాలుగా మార్చుకున్నారు. బౌద్ధశిల్పాల్ని హిందూ దేవీదేవతల శిల్పాలుగా చలామణిలోకి తెచ్చుకుని, తమ జీవనా ధారం వెతుకున్నారు. పైగా బుదుణ్ణి విష్ణు అవతారంగా ప్రకటించారు. మనువాదుల పనులు ఇలాగే ఉంటాయనడానికి శివాజీ- శంభాజీలను కూడా ఉదాహరణగా చూపొచ్చు. వారిని కుట్ర పూరితంగా చంపించింది వారే. మళ్లీ వారి ఔన్నత్యాన్ని చాటి చెపుతూ, వారు తమ హిందూ మతోద్ధారకులని ప్రచారం చేసుకున్నదీ, ఇంకా చేసుకుంటున్నదీ వారే! హేతుబద్ధంగా ఆలోచించే వారికి విషయం అర్థమౌతుంది. సమాజంలో ఏది బలంగా ఉంటే, దాన్ని తమలో కలుపుకుని అది తమదే- అని గొప్పలు చెప్పుకోవడం – క్రమంగా దాన్ని నాశనం చేయడం- ఆ రకంగా లబ్ది పొందడం మనువాదుల పద్ధతి. బౌద్ధం స్వతంత్రంగా ఎదిగిన ఒక జీవన విధానమైతే, అది తమ వైదిక మతంలో ఒక భాగమని ప్రచారం చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా వీటి ఆనవాళ్లు బయట పడుతూనే ఉన్నాయి.
దేశంలో ఉన్న ప్రాచీన హిందూ దేవాలయాలేవీ హిందూ దేవాలయాలుగా నిర్మించబడలేదు. అవన్నీ మార్చిన బౌద్ధారామాలో లేక జైన మందిరాలో అయి ఉంటాయని చరిత్ర పరిశోధకులు, వైజ్ఞానిక పరిశీలకులు రుజువు చేశారు. అదే పద్ధతిలో శివాజీ, శంభాజీలనే కాదు, వివేకానందుణ్ణి కూడా తమ హిందూ మతోద్ధారకుడిగా చెప్పు కున్నారు. వివేకానందుడు హేతుబద్దంగా చెప్పిన విషయాలు, సంధించిన ప్రశ్నల జోలికి మాత్రంపోరు. ఎక్కడ ఏ మంచి కనిపించినా, దాన్ని తమలో కలుపుకోవడం మంచిదే. కాని, దాన్ని అలాగే కొనసాగనివ్వాలి కదా? తమ పైత్య మంతా వాటికి రుద్ది, వాటిని ధ్వంసం చేస్తే గాని వారికి తప్తి కలగదు. ఈ దేశ చరిత్ర పొడవునా ఇవే అంశాలు పున రావతమౌతున్నాయి. అసలు ‘అఖండ భారత్’ అనేది చరిత్రలో ఎక్కడా ఎప్పుడూ లేదు. దాన్ని పునరుద్దరిస్తామని నేటి ఆరెస్సెస్ -బీజేపీలు చెప్పడం హాస్యాస్పదంగా తోస్తుంది. ఈ దేశం ఎదగక పోవడానికి బ్రాహ్మణిజమే పెద్ద అడ్డంకి. దాన్ని తొలగించుకుని, ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. విచారించవల్సిన విషయమేమంటే తమ స్వార్ధ పూరిత వ్యక్తిగత ప్రయోజనాల కోసం బహుజన నాయకులే అధికారంలో ఉన్నవారికి భజన చేస్తూ తిరుగుతున్నారు.
దురలవాట్లున్న శంభాజీని గొప్ప హిందూరాజుగా, మొఘల్ పాలకుల్ని విలన్లుగా చూసే మనస్తత్యం నేటి మన పాలకులది. శివాజీదయినా, ఔరంగజేబుదయినా రాజులుగా తమ తమ రాజ్యాలు విస్తరించుకోవాలని చేసిన ప్రయత్నాలే తప్ప వారి మధ్య మత పరమైన విభేదాలూ, విద్యేషాలు, ఘర్షణలూ లేవు. ఎందుకంటే ఔరంగజేబును సమర్ధించే హిందూ రాజులు ఉన్నారు. ఇక్కడ శివాజీ అంగరక్షకులుగా, సైన్యాధ్యక్షులుగా ముస్లింలున్నారు. అయినా- వందల ఏండ్ల నాటి విషయాల్ని అప్పటి విషయాలుగా మాత్రమే చూడాలి. అప్పటి విషయాల ఆధారంగా ఇప్పటి ముస్లింలను ద్వేషించమని చెప్పడం వివేకమనిపించుకోదు. అలాగే మనుస్మతిలో శూద్రులను ఎలా శిక్షించాలో వివరంగా రాసి ఉందని సమకాలీనంలో ఉన్న మన బ్రాహ్మణ సోదరసోదరీమణులను ద్వేషించలేము కదా? మానవ వాదులుగా మనమంతా మనుషులం గనక, మనుషులుగా, సమానులుగా ప్రవర్తించాలని, ఒకరి నొకరు గౌరవించు కోవాలని- పనులన్నీ ‘మనిషి కేంద్రంగా’ జరుపుకుంటూ ఉండాలని మాత్రం తప్పకుండా అంటాం!
ఛావా, కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ, పద్మావత్ వంటి సినిమాలు తీసి, చరిత్రను వక్రీకరించి, సమకాలీనంలో దేశంలో ఉన్న ముస్లింలను హిందువులంతా ద్వేషిస్తూ ఉండాలని కోరుకుంటున్న అధికార పార్టీ కుట్రను సామాన్య ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మరోవైపు దేశంలో కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ఆలోచించే జనాభా పెరుగుతోంది. మరీ ముఖ్యంగా దేశంలోని యువత, వైజ్ఞానిక దక్పథం -మానవవాదం వైపు మొగ్గుచూపుతూ ఉంది. సినిమా అనగానే కల్పనలూ, అభూత కల్పనలుంటాయని వారికి తెలుసు. సినిమాహాలు ఎప్పటికీ క్లాసు రూం కాదు. మేధావులు హేతుబద్దంగా చర్చించుకునే సెమినార్ హాలు కూడా కాదు. అయినా ఇలాంటి విషయాలు చదువుకున్న వారికీ, వివేచన గలవారికి మాత్రమే అర్థం అవుతాయి. కేవలం రాజకీయంగా మాత్రమే ఎదిగిన ‘గౌరవ నీయులైన మూర్ఖు’లకు అర్థం కావుకదా? భారతీయత అంటే సమైక్యత, సంఘీభావం, సమానస్థాయి!- అంతేగానీ, నేటి పాలకులు ప్రోత్సహిస్తున్నట్లుగా ద్వేషం ఎన్నటికీ కాదు – సమైక్య భావనే భారతీయుల మూల సిద్ధాంతం!!
వ్యాసకర్త: త్రిపురనేని రామస్వామి
జాతీయ పురసార తొలి గ్రహీత
డాక్టర్ దేవరాజు మహారాజు