
మహిళా సాధికారతే లక్ష్యంగా మహిళలు ఐక్యంగా ముందుకు సాగాలని ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య సుమలత అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం సుమలత నవ తెలంగాణతో మాట్లాడారు. చట్ట సభలతో సహా అన్ని రంగాలలో ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడంలో ప్రభుత్వాలు వెనుకబడి ఉన్నాయని అన్నారు. సాంప్రదాయాలు మూఢాచారాలు మూఢనమ్మకాల మాటున ఇంకా మహిళలను వంటింటికే పరిమితం చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో మహిళలు దీటుగా రాణిస్తున్నారని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఔరా అనిపించుకుంటున్నారని అన్నారు. చట్ట సభలతో సహా అన్ని రంగాల్లో మహిళలకు సమాన హోదా హక్కులు కల్పించాలని వాటి పరిరక్షణకై మహిళలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మహిళల రక్షణకై పాలక ప్రభుత్వాలు కఠినమైన శిక్షలను ఆలస్యం కాకుండా అమలు చేసినట్లయితే ఆడవాళ్ళ పై జరుగుతున్న అత్యాచారాలు అఘాయిత్యాలు తగ్గుముఖం పడతాయి అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు కూడా ఆడ మగ తేడా లేకుండా మగ పిల్లలతో సరి సమానంగా చూడాలని ఉన్నత చదువులు చదివించాలని ఉన్నత స్థాయిలో తమ పిల్లలను చూసి గర్వించాలని అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వంటి ఉన్నత స్థితిలో వారిని స్ఫూర్తిగా తీసుకొని ఎదుగుదలకు ప్రయత్నం చేయాలని అన్నారు. మహిళల్లో మరింత చైతన్యం రావాలని అది చదువుతుంది సాధ్యమని అన్నారు. దేశంలో ఇంకా ఎక్కడో చోట సతీసహగమనం అమలు కావడం పేపర్లో చూస్తుండడం బాధాకరంగా ఉందని భవిష్యత్తులో ఎక్కడ ఎప్పుడు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు.