ఉక్రెయిన్‌కు నాటో దళాలను పంపాలన్న మాక్రాన్‌ను అడ్డుకున్న బైడెన్‌

ఉక్రెయిన్‌కు నాటో దళాలను పంపాలన్న మాక్రాన్‌ను అడ్డుకున్న బైడెన్‌– పొలిటికో
ఉక్రెయిన్‌లో కీవ్‌ దళాలకు శిక్షణ ఇవ్వడానికి పాశ్చాత్య శిక్షకులను పంపాలని ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ చేసిన ప్రతిపాదనను అమెరికా ప్రెసిడెంట్‌ జో బైడెన్‌ నిరోధించినట్లు పొలిటికో పేర్కొంది. శుక్రవారం ప్రచురించిన ఒక కథనం ప్రకారం, ఉక్రెయిన్‌కు నాటో దళాలను పంపడం వల్ల కలిగే పర్యవసానాల గురించి బైడెన్‌ ఆందోళన వ్యక్తం చేశాడు. ఉక్రెయిన్‌కు నాటో నిపుణులను పంపించే లక్ష్యంతో మాక్రాన్‌ పాశ్చాత్య దేశాల సంకీర్ణాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాడని వార్తా సంస్థలు గతంలో అనేక కథనాలను ప్రచురించాయి.
ఈ విషయాన్ని పారిస్‌ అధికారికంగా ధవీకరించలేదు. ”ఇంకా తీసుకోవలసిన నిర్ణయాలపై” తాను వ్యాఖ్యానించనని మాక్రాన్‌ పేర్కొన్నాడు. అయినప్పటికీ, ఫ్రెంచ్‌ ప్రధాన మంత్రి గాబ్రియేల్‌ అట్టల్‌ ఉక్రెయిన్‌కు సైనిక శిక్షకులను పంపడంపై ”నిషేధం” లేదని చెప్పాడు. ఫ్రెంచ్‌ శిక్షకులు ఇప్పటికే ఫ్రాన్స్‌లో, దాని పొరుగు దేశాల భూభాగంలో దాదాపు 10,000 మంది ఉక్రేనియన్‌ దళాలకు శిక్షణ ఇచ్చారని ఆయన అన్నాడు. బాల్టిక్‌ ప్రాంతంలోని లిథువేనియా, ఎస్టోనియా వంటి అనేక నాటో సభ్య దేశాలు ఈ ఆలోచనకు మద్దతునిచ్చాయి. ఉక్రెయిన్‌కు శిక్షకులను పంపడానికి తమ సంసిద్ధతను వ్యక్తం చేశాయి. కొన్ని దేశాలు ఇప్పటికే ఉక్రెయిన్‌లో ”సైనికులకు శిక్షణ ఇస్తున్నాయని” ఎస్టోనియన్‌ ప్రధాన మంత్రి కాజా కల్లాస్‌ పేర్కొన్నాడు. కానీ ప్రత్యేకంగా అవి ఏఏ దేశాలు అనే విషయాన్ని పేర్కొనలేదు. కీవ్‌ కూడా మాక్రాన్‌ ప్రణాళికను ధవీకరించింది. ఫ్రెంచ్‌ శిక్షకులను ఉక్రేనియన్‌ శిక్షణా సౌకర్యాలను సందర్శించడానికి, ఉపయోగించడానికి, అనుమతించడానికి ఉక్రెయిన్‌ టాప్‌ కమాండర్‌ అలెగ్జాండర్‌ సిర్స్కీ ఇప్పటికే అన్ని పత్రాలను పూర్తి చేసినట్లు పేర్కొన్నాడు. సీనియర్‌ ఉక్రేనియన్‌ చట్టసభ సభ్యుడు అలెక్సీ గోంచరెంకో కూడా ఫ్రెంచ్‌ సైనిక నిపుణుల మొదటి బందం ఇప్పటికే దేశానికి చేరుకుందని పేర్కొన్నాడు.
ఉక్రెయిన్‌లోని విదేశీ సైనిక సిబ్బంది ఎక్కడి నుంచి వచ్చినప్పటికీ, వారు సైనికులు/ శిక్షకులు అనే దానితో సంబంధం లేకుండా దాడులకు చట్టబద్ధమైన లక్ష్యాలుగా పరిగణించబడతారని రష్యా పదేపదే హెచ్చరించింది. ”వాస్తవం ఏమిటంటే, ఉక్రేనియన్‌ సైన్యానికి శిక్షణ ఇవ్వడంలో పాల్గొనే శిక్షకులకు ఎటువంటి ప్రత్యేక రక్షణలు ఉండవు. వారు ఫ్రెంచా, కాదా అనేది పట్టింపు ఉండదు” అని క్రెమ్లిన్‌ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్‌ ఈ వారం ప్రారంభంలో చెప్పాడు.

Spread the love