దేశంలో బీజేపీ అరాచకాలు పరాకాష్ఠకు చేరాయి : సీఎ కేసీఆర్

నవతెలంగాణ-హైదరాబాద్ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ లతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాదులో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో బీజేపీ అరాచకాలు పరాకాష్ఠకు చేరాయని అన్నారు. బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర ఆర్థిక ఆంక్షలు విధిస్తోందని తెలిపారు. బీజేపీయేతర ప్రభుత్వాలను పనిచేయనివ్వడంలేదని మండిపడ్డారు. ఇందిరాగాంధీ అమలు చేసిన ఎమర్జెన్సీ దిశగా బీజేపీ వెళుతోందని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పునే ప్రధానమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి పాటించకుంటే ఎలా? అని నిలదీశారు. కేంద్రం తీరు ఎమర్జెన్సీని తలపిస్తోందని, ఇకనైనా కేంద్రం కళ్లు తెరవాలని కేసీఆర్ హితవు పలికారు. వెంటనే ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ప్రజాస్వామ్యానికి విఘాతం అని పేర్కొన్నారు. రాజ్ భవన్ లు బీజేపీ రాష్ట్ర కార్యాలయాలుగా మారాయని, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాల్సిన గవర్నర్లు బీజేపీకి స్టార్ క్యాంపెనర్లుగా వ్యవహరిస్తున్నారంటూ ఘాటుగా విమర్శించారు. అలంకారప్రాయమైన గవర్నర్ వ్యవస్థతో ఏదో చేయాలనుకుంటున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కర్ణాటకలో ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టినా బీజేపీకి బుద్ధిరాలేదని పేర్కొన్నారు. ఇదే వరుసలో త్వరలోనే దేశం మొత్తం కూడా బీజేపీకి గుణపాఠం చెబుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు.

Spread the love