వక్ఫ్ చట్టంపై దేశంలో చర్చోపచర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై పార్లమెంటులో చర్చ జరిగినప్పుడు బీజేపీ ఓ అబద్ధం చెప్పింది. టర్కీ (తుర్కియే) దేశంలో వక్ఫ్ అనేదే లేదన్నది ఆ పార్టీ వాదన. అయితే వక్ఫ్ టర్కీలో ఉండటమే కాదు…దాని సామాజిక, సాంస్కృతిక నిర్మాణంలోనూ అంతర్భాగ మన్నది వాస్తవం. రాజధాని అంకారా నడిబొడ్డున వక్ఫ్ వారసత్వాన్ని ప్రతిబింబించే మ్యూజియం ఉంది. దాన్ని 2007లో ఓ ఆధునిక భవనంలో ఏర్పాటు చేశారు. దాన్నే 2009లో యూరోపియన్ మ్యూజియం ఫోరం గుర్తించింది. ప్రవేశ ద్వారం ఎడమ వైపు పురాతన చేతిరాత ప్రతులు, పత్రికలు కన్పిస్తాయి. లోపల అద్భుతమైన కళాఖండాలు దర్శనమిస్తాయి. మ్యూజియంలో ఒట్టోమన్ యుగం నాటి తివాచీలు వీక్షకులను ఆకర్షిస్తాయి. శతాబ్దాల సామూహిక జ్ఞాపకాలకు చెందిన ఈ తివాచీలను జాగ్రత్తగా భద్రపరిచారు. మ్యూజియంలో వందలాది వస్తువులను ఉంచారు. టర్కీలోని వక్ఫ్ చరిత్రను సింహావలోకనం చేసుకునేందుకు ఈ మ్యూజియం ఉపయోగపడుతుంది. వక్ఫ్ చరిత్ర ఒట్టోమన్ సామ్రాజ్యానికి పునాది. నాటి టర్కీని ఇప్పుడు తుర్కియే అని పిలుస్తున్నాము. అది 2018 నాటికి 1,002 సోషల్ ఎయిడ్ అండ్ సాలిడారిటీ వక్ఫ్‌కు కేంద్రంగా ఉంది. ప్రతి జిల్లాలోనూ కనీసం ఒక శాఖ పనిచేస్తోంది. పేదలకు ఆర్థికంగా సాయపడడం వాటి ప్రాథమిక లక్ష్యం. తుర్కియే వక్ఫ్ వ్యవస్థ ఆధునిక పునరుజ్జీవనం ఇరవైయ్యవ శతాబ్దం మధ్యలో ప్రారంభమైంది. ఆ సమయంలో ప్రారంభమైన సంస్కరణలు దానిని బాగా ప్రభావితం చేశాయి. 1967లో అమలులోకి వచ్చిన కొత్త వక్ఫ్ చట్టం వ్యవస్థను పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషించింది.
యజమానుల చేతికి వక్ఫ్ ఆస్తులు
ఈ సంస్కరణల ఆధారంగానే 2008లో వక్ఫ్ చట్టాన్ని ప్రవేశపెట్టారు. గతంలో ప్రభుత్వ సంస్థలు స్వాధీనం చేసుకున్న వక్ఫ్ ఆస్తులను తిరిగి వాటి యజమానులకు అప్పగించాలని ఈ చట్టం నిర్దేశించింది. ఒక్క ఇస్తాంబుల్‌లోనే 77 వక్ఫ్ ఆస్తులను వాటి యజమానులకు అప్పగించారు. ఇవన్నీ మత, సాంస్కృతిక, చారిత్రక కట్టడాలే. స్టేడియం, ఆస్పత్రి, ప్యాలెస్, విశ్వవిద్యాలయం, వాణిజ్య సముదాయాలు కూడా వీటిలో ఉన్నాయి. దేశంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2018 నాటికి సుమారు 5,250 వక్ఫ్ ఆస్తులను పునరుద్ధరించడం జరిగింది. 2019 నాటికి తుర్కియేలో 52 వేల మజ్బుత్ వక్ఫ్‌లు, 5,268 కొత్త వక్ఫ్‌లు, 256 అనుబంధ వక్ఫ్‌లు, 167 మైనార్టీ వక్ఫ్‌లు ఉన్నాయి. అద్దెల రూపంలో మజ్బుత్ వక్ఫ్‌లకు వస్తున్న ఆదాయాన్ని దాతృత్వ ప్రయోజనాల కోసం ఖర్చు పెడతారు.
ఆపన్నులకు సాయమే వాటి లక్ష్యం
తుర్కియాలో కార్పొరేట్ వక్ఫ్ అభివృద్ధి చెందడం మరో ఆసక్తికరమైన పరిణామం. అక్కడ బాగా స్థిరపడిన నగదు (ఎండోమెంట్) వక్ఫ్ వ్యవస్థ కూడా ఉంది. ఏ రకమైన వక్ఫ్ అయినప్పటికీ దాని ప్రధాన లక్ష్యం ఆపన్నులకు సాయం చేయడమే. వారి సామాజిక అవసరాలకు మద్దతివ్వడమే. 1954లో ప్రారంభమైన వక్ఫ్ బ్యాంక్ ఇప్పుడు తుర్కియేలోని ప్రతి నగరంలోనూ కన్పిస్తుంది. 1922 ఖిలాఫత్ ఉద్యమ సమయంలో భారతీయుల నుండి వచ్చిన విరాళాల ద్వారా స్థాపించబడిన బంకసీ….భారత్, తుర్కియేల మధ్య చారిత్రక బంధాలకు చిహ్నంగా నిలుస్తోంది. కాగా దేశంలో నివసిస్తున్న ఇతర మైనార్టీలకు వక్ఫ్ రక్షణ కవచంలా నిలుస్తోంది. అనేక సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ తుర్కియేలోని చర్చిలు, ప్రార్థనా మందిరాలు, పాఠశాలలు వంటి మైనారిటీల ఆస్తులు బాగానే ఉన్నాయి.
ప్రజలను మభ్య పెడుతున్న కమలనాథులు
తుర్కియేలో వక్ఫ్ పనితీరు ఇంత సలక్షణంగా ఉంటే బీజేపీ నాయకులు మాత్రం అవాస్తవాలు, కట్టుకథలతో ప్రజలను మభ్యపెడుతున్నారు. లోక్‌సభలో ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు సంబిత్ పాత్రా, నిషికాంత్ దూబే వ్యాప్తి చేసిన తప్పుడు సమాచారాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మరింత ప్రచారంలో పెట్టింది. ఆ తర్వాత బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజ్యసభలో దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. 1924లో తుర్కియే వక్ఫ్‌ను ప్రభుత్వ అధీనంలోకి తెచ్చారని ఆయన అంగీకరించినా వాస్తవాలన్నీ వెలుగు చూడలేదు. తుర్కియే వక్ఫ్ వ్యవస్థ ఎన్నడూ రద్దు కాలేదు. పైగా అది అభివృద్ధి చెందుతూనే ఉంది. కానీ దురదృష్టవశాత్తూ మన దేశంలో ముస్లిం ఎండోమెంట్లు పాలకుల నిర్లక్ష్యానికి, నిర్వహణా లోపానికి, రాజకీయ ఉదాశీనతకు గురవుతున్నాయి. దేశాన్ని పరిపాలించిన ప్రభుత్వాలు వక్ఫ్ సామర్ధ్యాన్ని సమాజ అభ్యున్నతి కోసం ఉపయోగించుకోవడంలో విఫలమయ్యాయి. ఇప్పుడు దారుణంగా ల్యాండ్ జిహాద్‌పై పోరాడుతున్నామన్న పేరుతో వక్ఫ్ ఆస్తులపై కన్నేశారు.
-ఫీచర్స్ అండ్ పాలిటిక్స్