కేంద్రీకృత వ్యూహంతో బీజేపీ త్రిముఖ దాడి

BJP's three-pronged attack with a centralized strategyఅయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల నేపథ్యంలో వీస్తున్న ఎదురుగాలిని తట్టుకోవడానికి బీజేపీ అగ్రనాయకత్వం ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షా వేస్తున్న ఎత్తులుపై ఎత్తులు అభాసు పాలవుతున్నాయి. ఆర్భాటంగా ప్రకటించిన తతం గాలు చాపచుట్టుకోవలసి వస్తున్నది. ప్రతిపక్షాల నుంచేగాక రాజ్యాంగ నిపుణుల నుంచి మీడి యా నుంచి విమర్శలు రావడంతో అని వార్యంగా వెనక్కు తగ్గవలసి వస్తున్నది. జమిలి ఎన్నికల నినాదం ఆ ఎత్తుగడలకు పరాకాష్టగానే రూపుదిద్దుకుంది. డబుల్‌ ఇంజన్‌ హడావుడి కూడా అదే. కేంద్రం లోని మోడీనే రాష్ట్రాలలో ఊరేగించి ఒకే సారి రాష్ట్రాలనూ కైవసం చేసుకోవచ్చనే అప్రజాస్వామిక ఆలోచన దీని వెనక వుం దని అందరికీ అర్థమై పోయింది. ఒకేదేశం, ఒకే ఎన్నిక, ఒకే పన్ను, ఒకే మతం, ఒకే పార్టీ, ఒకే రేషన్‌, ఒకే మతం, అన్న చందంగా చేసే రాజకీయమే దేశభక్తిగా చలామణి చేయడం ఎంతో కాలం చెల్లదని ఒప్పుకోవలసి వచ్చింది. జమిలి ఎన్ని కలను రుద్దడం తేలికకాదనీ పైగా ఈ సమయంలో వ్యతిరేకత కూడా తెచ్చిపెట్టవచ్చని గ్రహించిన తర్వాత ప్రస్తుతానికి కేంద్రం వెనక్కు తగ్గింది. అయి తే మరోవైపున ఇందుకోసమే ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అధ్యక్ష తన అధ్యయన కమిటీని నియమితమైంది. ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపదిముర్మును ఆహ్వానించకుండానే కేవలం మోడీ కనుసన్నల్లో పూర్తయిన కొత్త పార్ల మెంటు భవనంలో దీన్ని ఆమోదించడం ఆసక్తికరం. మోడీ విధేయత కారణంగా గతంలో రాష్ట్రపతి పదవి పొందిన కోవింద్‌నే మళ్లీ తెరపైకి తేవడం యాదృ చ్చికం కాదు. వాస్తవానికి పదవీ విమరణ చేసిన ఒక రాష్ట్రపతికి అధికారిక బాధ్యత అప్పగించడం ఇదే ప్రథమం. కేంద్ర ప్రభుత్వ అధికారులను కమల ప్రచా రకులుగా వాడుకోవడం కోసం ఉద్దేశించిన రథ ప్రభారీ ప్రహసనం ఆ విధంగానే విమర్శల పాలైంది. కేంద్ర పథకాల ప్రచారమంటూ అధికారులను స్వంత పార్టీ సైన్యంగా మార్చేసుకుని ఆ ముసుగులోనే పార్టీ ప్రచారం చేయించు కోవడానికి పెట్టుకున్న రథ్‌ ప్రభారీ పేరును చల్లగా మార్చుకోవలసి వచ్చింది. ఎన్నికల కమిషన్‌ నోటీసుతో ఎన్నికలు జరిగే అయిదు రాష్ట్రాల్లోనూ ఈ కార్యక్రమం వుండబోదనే ప్రకటనా చేయవలసి వచ్చింది. అయితే ప్రధాని దీన్ని ప్రారం భించడం, దేశవ్యాపితంగా ఈ ప్రచార ప్రహసనం యథావిధంగా కొనసాగుతుంది. అంటే మౌలికంగా మోడీ ఆలోచనా ధోరణిలో గానీ, రాజ్యాంగ వ్యతిరేక రాజకీయాలలోగానీ మార్పులేదని స్పష్టమవుతుంది.
రాముడి ఆశీస్సులు ఆయనకేనా?
అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో బలాబలాలను బట్టి రాజకీయ వాతావరణాన్ని బట్టి చూస్తే బీజేపీకి పెద్ద అనుకూలత లేదని చాలాచోట్ల ఓడిపోవచ్చనీ సర్వేలు చెబుతున్నాయి. మూడు హిందీ రాష్ట్రాలలో పాత వారిని కొనసాగించలేని, ప్రస్తుతమున్న వారిని కొన సాగించలేని స్థితిలో బీజేపీ వుంది. ఈ సంకట స్థితిని అధిగమించడానికి రామభక్తి నుంచి రాజకీయ కుయు క్తుల వరకూ దేనికీ వెనకాడటం లేదు. అయోధ్య పరి ణామాలు సుప్రీం కోర్టు తీర్పు తదితర అంశాలు మళ్లీ ముందుకొచ్చాయి. 2019 ఎన్నికలు ముగియ గానే అయోధ్యలో భూమిపూజలో ప్రధాని మోడీ ప్రత్యక్ష మయ్యారు. ఇప్పుడు కూడా అయోధ్య ట్రస్టు ప్రతిని ధులు మోడీని కలిసి 2024 జనవరిలో విగ్రహ మహాప్రతిష్టాపనకు హాజరు కావల సిందిగా ఆహ్వానం అందించారు. ఆయన దాన్ని మీడియాలో పెద్ద విష యంగానే ప్రచారంలో పెట్టారు. బీజేపీ మిత్రపక్షంగా దీర్ఘకాలం కొనసా గడమే గాక అయోధ్య ఘటనలలోనూ ఆరోపణలకు గురైన మహారాష్ట్ర శివ సేన ఉద్దవ్‌ఠాక్రే వర్గం ఎంపీ సంజ రురౌత్‌ దీనిపై స్పందిస్తూ రాముడు బీజేపీకి, మోడీకి మాత్రమే సంబంధిం చిన దేవుడు కాదు కదా అని ఆక్షేపిం చారు. అయోధ్య ఆలయం ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్‌కు ఇది చాలా కోపం తెప్పించింది. ప్రధాని గనక పిలిచామంటే అదోరకంగా వుండేది. మోడీకి రాముడి ఆశీస్సులున్నాయి గనకే దేశాధినేతగా అధికారం చలా యించగలుగుతున్నారని, మిగిలినవాళ్లు వీధుల్లో తిరుగుతున్నారని ఫక్తు రాజకీయవాదన చేశారు. మరోవిధంగా చెప్పాలంటే రాముడి ఆశీస్సులు ఆయనకే వున్నాయని కితాబిచ్చారన్నమాట. అయోధ్యలో భూమాఫియా పెరిగి కబ్జాలు, దౌర్జ న్యాలు చేస్తున్నారనే వార్తలు వస్తుంటే,ఒక పూజారి కూడా వారి చేతుల్లో ఈ మధ్యనే హత్య కు గురైతే ఇంతవరకు అతీగతీ లేదు. ఈ సమ యంలోనే వారణాసిలో జ్ఞాన్‌వ్యాపీ మసీదు, బృందావన్‌లో కృష్ణమందిరం సమస్యలను కూడా కోర్టుల్లో తిరిగి తీసుకురావడం కూడా ఈ మతరాజకీయంలో భాగమే. ఢిల్లీలో రామ్‌లీలా మైదానంలో రావణదహనంలో పాల్గొంటూ మోడీ పరోక్షంగా ఎవరైతే కులగణన పేరిట ప్రజల్లో చీలికలు తెస్తున్నారో వారిని కూడా ఇలాగే దహనం చేయాలని తీవ్రమైన మాటన్నారు. ఇండియా వేదికను దృష్టిలో పెట్టుకునే ప్రధాని ఇంత మాట న్నారని మీడియా పోల్చి రాసింది.
మార్క్సిస్టులపై దాడి, నచ్చిందే చరిత్ర!
ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ సంప్రదా యికంగా చేసే దసరా ప్రసంగంలో ఇంచుమించు ఇదే సెలవిచ్చారు. సాంస్కృతిక మార్క్సిస్టులను వోక్‌ పీపుల్‌ను (మేల్కొల్పు జనాభా)ను తోసిపుచ్చాలని భగవత్‌ ఉవాచ. కొన్నేళ్ల కిందట మోడీ లోక్‌సభలో ఆందోళన జీవులంటూ అపహాస్యం చేయడం గుర్తుం డే వుంటుంది. ఈ మాటలన్నీ కూడా చైతన్యం కదలిక తీసుకొచ్చేవారిపైనే ఎక్కుపెట్టబడిన ఆయుధాలే. పశ్చిమ దేశాల్లో విముక్తి కోసం పోరాడే వారిని వోక్‌ పీపుల్‌ అంటుంటారట. దేశంలో సమస్త అనర్థాలకూ వారే మూలకారణమని మోహన్‌ భగవత్‌ ప్రకటిం చారు. వీరు ప్రజల్లో అసంతృప్తి పెంచుతారట, చీలి కలు తెస్తారట, ఆఖరుకు మణిపూర్‌లో కూడా వీరి వల్లనే కుకీ, మైతేయిల మధ్య తగాదా వచ్చిందట.ఈ దేశంలో వున్నవారంతా హిందువులనేనని ప్రకటిం చిన సరఫ్‌ుసంచాలక్‌ నోట ఈ మాటలు రావడం దేనికి నిదర్శనం? సనాతన ధర్మమే శరణ్యమనే సంఘపరివార్‌ భావమే అది. అల్ప సంఖ్యాకులు, అణగారిన వర్గాలు, మహిళలు నోరుమూసుకుని పడుంటే ఏ గొడవలు రావని తాత్పర్యం. రాజ్యాంగం మొదటి అధికరణమే చెబుతున్నట్టు ఇండియా దటీజ్‌ భారత్‌గా గాక ఈ దేశాన్ని భారత్‌ అనే పిలవాలని తీర్మానించడం కూడా ఈ మహాపథకంలో భాగం. ఇండియా పేరుతో పాటు దాని చరిత్రనూ మార్చడం దాని కార్యాచరణ రూపం. జరిగిన చరిత్రను మరింత శాస్త్రీయంగా ప్రామాణికంగా పరిశోధించి భావి తరాలకు అందించడం గాక హిందూరాజులను కీర్తించే విధంగా చరిత్ర పాఠాలుండాలని, మొగల్‌ చరిత్ర తీసేయాలనీ ఎన్‌సిఇఆర్‌టి చెప్పడమూ అందుకే. అంతేనా?చరిత్రకూ పురాణాలకూ మధ్య తేడా చెరిపెయ్యాలి.చంద్రయాన్‌ పాఠంతో పాటు ప్రాచీనకాలంలోనే మనవాళ్లు ఆకాశవిహారం చేశారనీ పుష్పక విమానం వుండేదనీ చెప్పాలని ఎన్‌సిఇఆర్‌టి ఆదేశం. ఇదే సమయంలో నిజమైన చరిత్రలో అవస రమైన అంశాలు తెలియకుండా చేయడం కోసం గాంధీజీ హత్య, గుజరాత్‌ మతహత్యాకాండ వంటివి తీసేయాలి. ఇవి అమలులోకి రావడం తర్వాత జరి గినా ముందు ఈ వార్తలు విడుదల చేయడం ద్వారా మతఛాందసాలను సంతృప్తి పరచాలి. అయితే విద్యారంగం ఉమ్మడి జాబితాలో వుంది గనక పాఠ్యాం శాల పరంగా నిర్ణయాలు రాష్ట్రాలు తీసుకుంటాయి గనక కొత్త విధానం వాటిపై రుద్డడం జరుగుతున్నది. కరళ తమిళనాడు, బెంగాల్‌వంటి రాష్ట్రాలు ఇందుకు గట్టిగా నిరాకరించినా ఏపితో సహా పలు రాష్ట్రాలు అత్యుత్సాహంగా అమలు చేయడం ఆందోళన కలి గించే వాస్తవం. సహకార రంగం తమ అదుపులోకి తెచ్చుకోవడానికి అడుగులు వేస్తున్నారు. పర్యాటక రంగం కూడా తమ అధీనంలోకి తీసుకుంటున్నారు.
రాష్ట్రాలపై ఆర్థిక బిగింపు
ఈ ఏకపక్ష కేంద్రీకృత రాజకీయ సాంస్కృతిక ఆధిపత్యధోరణిని చలాయించడం కోసం మరింత వేగంగా ఆర్థిక కేంద్రీకరణ తీసుకొస్తున్నారు. పరి మిత అధికారాలు గల ఢిల్లీ రాష్ట్ర నమూనా ఇందుకు ఆదర్శంగా కనిపిస్తున్నది. సుప్రీంకోర్టులోనే ఇందుకు వ్యతిరేకంగా తీర్పు రాగా రాజ్యాంగ సవరణతో తోసి పుచ్చి సర్వాధికారలు చేజిక్కించుకుంది కేంద్రం. ఉప ముఖ్యమంత్రితో సహా ఆ రాష్ట్ర నేతలను ఖైదుచేసి అడుగడుగునా ప్రభుత్వ నిర్ణయాలకు అడ్డుతగులు తున్నది. జమ్మూకాశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడంలో మతతత్వ రాజకీయమూ కేంద్ర పెత్తనమూ రెండూ వున్నాయి. అసలు స్వాతంత్య్రా నంతరం ఒక రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం ఇదే ప్రథమం, రాష్ట్రాలకు ఆర్థిక సహాయం చేయకుండా పరాధీనతలోకి నెట్టడం నిధులు కేటాయించకపోవడం నిరంతర ప్రహసనంగా మారింది. ఏపీ, తెలంగాణల అనుభవమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. కేరళ నిరంతరం దీనిపై పోరాడు తూనే వుంది. నిధులు ఇవ్వకపోవడం తెచ్చుకునే అప్పులపై ఆంక్షలు పెట్టడం రాష్ట్రాలను అడకత్తెరలో నెడుతున్నది. అప్పులు పెరిగాయని మళ్లీ ఆ బీజేపీ నేతలే గగ్గోలు మొదలెడతారు. రాష్ట్రాల వాటా తేల్చే ఫైనాన్స్‌ కమిషన్‌ పరిధినే తగ్గించడంతో పాటు చేసిన సిఫార్సులనూ కేంద్రం తొక్కిపడుతుంది. జిఎస్‌టి కారణంగా పెట్రోలు, డీజిల్‌ తప్ప మరేవీ రాష్ట్రాలకు అందకుండా పోయాయి. మిగిలిన మేరకైనా రాష్ట్రా లకు వాటా ఇవ్వకుండా సెస్సులు, సర్‌చార్జిలను పెంచి వాటికి వాటా లేకుండా చేస్తారు. రాష్ట్రా లపై శత్రుపూరితంగా దుష్ప్రచారం చేస్తారు. బీహార్‌లో ఎఐఎంఎస్‌ పెట్టడానికి రాష్ట్రాలు సరైన స్థలం చూపించలేదని తెలంగాణలో కిషన్‌రెడ్డి, బీహార్‌లో మన్సుఖ్‌మాండవీయ ఒకే విధమైన ఆరోపణలు చేస్తారు. రైల్వేలకు కేరళ సహకరించ లేదని మంత్రి అశ్వనీవైష్ణవ్‌, కర్నాటక తోడ్పడ లేదని రాజీవ్‌ చంద్రశేఖర్‌ తిట్టిపోస్తారు. సంక్షేమ పథకాలను వక్రంగా చిత్రించడమే గాక సహాయ నిరాకరణ చేస్తారు. కర్నాటక ప్రభుత్వం అన్నభాగ్య పేరిట పథకం చేపట్టి ఎఫ్‌సిఐతో ఒప్పందం కుదర్చుకుంటే కేంద్రం ఒత్తిడి తెచ్చి రద్దు చేయి స్తుంది. పంజాబ్‌లో ఆప్‌ పథకాలపైనా కేంద్ర మంత్రులు దాడి చేస్తారు. రాష్ట్రాలకేగాక కేంద్రం అదుపుకూడా లేకుండా పిఎం కేర్స్‌ పేరిట భారీ నిధి వసూలు చేస్తారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి సహా యం చేసిన వారికి పన్ను, పిఎం కేర్స్‌ అయితే కార్పొ రేట్‌ సామాజిక బాధ్యత అంటూ వివక్షత చూపిస్తారు.
చెదురుమదురుగా కనిపించే ఈ అంశాలన్నీ ఒక్కచోటికి చేర్చిచూస్తే మోడీ సర్కార్‌ కుటిలవ్యూహం ఏమిటో బోధపడుతుంది. కులం, మతం, జాతి దురభిమానం వంటివి రగిలించడం ఒకవైపు, దేశ విశాలత్వాన్ని భిన్నత్వాన్ని చూపే రాష్ట్రాల వన రుల హక్కుల పైన దాడి మరోవైపు చేయడం ద్వారా వాటిని బలహీనపర్చాలి. తద్వారా రాష్ట్రాలలో తమ ను బలంగా సవాలు చేస్తున్న ప్రతిపక్షాలను దెబ్బతీ యాలి. ఫ్రధాని మోడీనే సర్వశక్తి మంతుడుగా సకల నిర్ణయ సంధాతగా చూపించాలి. మిగిలిన నేతలనూ, పార్టీలనూ ఆఖరుకు ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కూడా దమ్మీలను చేయాలి. అయితే చైతన్యవంతులైన భారతీయులు, రాజ్యాంగం, న్యాయస్థానాలు అన్నిటినీ మించి ప్రజాన్యాయస్థానం అందుకు అవకాశ మివ్వడం కల్ల.
తెలకపల్లి రవి

Spread the love