డాక్టర్ డోనాల్డ్ ట్రంప్ పన్నుల మాత్ర వికటించి ప్రపంచమంతా అతలాకుతలమైంది! ఒకవైపు ధరల పెరుగుదల భయంతో అమెరికాలో వేలం వెర్రిగా కొనుగోళ్లకు జనం పరుగులు తీశారు. వారే మరోవైపు డోనాల్ట్ ట్రంప్, అతగాడి ఆత్మ ఎలన్ మస్క్ విధానాలను వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగారు. 150 సంస్థల పిలుపు మేరకు ఏప్రిల్ ఐదవ తేదీన మా జోలికి రావద్ద్దు (హాండ్స్ ఆఫ్) నినాదంతో 20లక్షల మంది దేశమంతటా ప్రదర్శనలు నిర్వహించారు. ప్రపంచ వ్యాపితంగా మూడవ రోజు సోమవారం కూడా స్టాక్ మార్కెట్లు పతనమై 9.5లక్షల కోట్ల డాలర్ల సంపద ఆవిరైంది. హంకాంగ్ స్టాక్ మార్కెట్ సూచీ గరిష్టంగా 13శాతం కుదేలైంది. మంగళవారం నాడు మనదేశంతో సహా ఆసియా దేశాల మార్కెట్లు కొద్దిగా తేరుకున్నాయి. ‘నేనైతే తగ్గాలనుకోవంటం లేదు, ఏదన్నా జరిగినపుడు కొన్ని సమయాల్లో ఒక గోలీ వేసుకోక తప్పదు’ అని ట్రంప్ వ్యాఖ్యానించాడు. అమెరికన్ల హక్కులు, స్వేచ్చ మీద దాడి చేస్తూ బలవంతంగా లాక్కుంటు న్నారంటూ ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమకారుల పిలుపుమేరకు జనం స్పందించారు. అక్కడి 50 రాష్ట్రాల రాజధానులు, పార్లమెంటు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు 1,400కుపైగా చిన్నా పెద్ద ప్రదర్శనలు నిర్వహించారు. లండన్, పారిస్ వంటి ఇతర దేశాల నగరాల్లో కూడా నిరసన తెలిపారు. ధనవంతుల పాలన ఇంకే మాత్రం సాగదు, వారికి జన ఘోష వినిపించేట్లు చేస్తామంటూ ప్రదర్శకులు నినదించారు. నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటామని సంతకాలు చేసిన వారే దాదాపు ఆరులక్షల మంది ఉన్నారు.
వాషింగ్టన్ డిసిలోని జార్జి వాషింగ్టన్ స్మారక స్థూపం వద్ద ప్రధాన సభ జరిగింది. అమెరికా కార్మిక సంఘాల సమాఖ్య అధ్యక్షురాలు లిజ్ షూలెర్ ప్రధాన వక్త. పోరాడేవారి నోరు మూయించేందుకు ట్రంప్ సర్కార్ చూస్తున్నది కానీ ఆటలు సాగనిచ్చేది లేదని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వంతో బేరమాడే హక్కులను యూనియన్లకు లేకుండా కాలరాస్తోందని, కార్మిక సంఘాలను దెబ్బతీస్తోందన్నారు.ప్రభుత్వ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు ఎవరెట్ కెలీ మాట్లాడుతూ ఉద్యోగులను సులభంగా దెబ్బతీయవచ్చని ట్రంప్, మస్క్ భావిస్తున్నారు. ‘మాసభ్యులు మిలిటరీలో పనిచేసిన వారే అని గుర్తుంచుకోవాలని, తమను బెదిరించలేరని’ హెచ్చరించాడు. డెమోక్రటిక్ పార్టీ ఎంపీ జామీ రస్కిన్ మాట్లాడుతూ ‘అమెరికాను స్థాపించిన వారు రాసిన రాజ్యాంగం..మేము పౌరులం అంటూ ప్రారంభమైంది తప్ప మేము నియంతలం’ అని కాదన్నాడు. ఇక్కడ ప్రదర్శనకు పది వేల మంది వస్తారనుకుంటే పది రెట్లు వచ్చినట్లు నిర్వాహకులు ప్రకటించారు. వాషింగ్టన్ నగరంలో ప్రదర్శన చేసిన వారు కిరాయిబాపతు తప్ప మరొకటి కాదని ఎలన్ మస్క్ నోరుపారేసుకున్నాడు. ఆ మేరకు తన ఎక్స్‌లో అనేక వీడియోలను పోస్టు చేశాడు. వారెందుకు ప్రదర్శన చేశారో కూడా వారికి తెలియదన్నాడు. నిరసనకారులు ట్రంప్‌ను ఎంతగా వ్యతిరేకిస్తున్నారో లక్షా 21వేల మంది కేంద్ర ఉద్యోగులను తొలగించిన ఎలన్ మస్క్‌ను కూడా అంతే నిరసిస్తున్నారు. రానున్న పదేండ్లలో ధనికులకు ఐదులక్షల కోట్ల డాలర్ల మేర పన్నుల రాయితీ ఇస్తూ ట్రంప్ సర్కార్ ఇటీవల నిర్ణయించింది. ఇదే సమయంలో వైద్యం, పెన్షన్ వంటి సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున కోతలను ప్రతిపాదించింది.తమ మీద మరిన్ని భారాలను మోపే పన్నులతో పాటు ఈ విధానాలకు కూడా శనివారం నాడు నిరసనలో వెల్లడించారు. ట్రంప్ వెనక్కు తగ్గకపోతే రానున్న రోజుల్లో ఆందోళనలు కొనసాగే అవకాశం ఉంది.
ట్రంప్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని చైనా వ్యాఖ్యానించింది. ఈనెల తొమ్మిదవ తేదీలోగా చైనా వెనక్కు తగ్గాలని లేకుంటే మరో యాభై శాతం వడ్డిస్తానని ట్రంప్ ప్రకటించాడు. ఎవరూ తగ్గకపోతే చైనా వస్తువులపై ట్రంప్ పన్ను 104 శాతానికి చేరనుంది. అతగాడిని ప్రసన్నం చేసుకొనేందుకు మనదేశం గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, ఎక్స్ తదితర కంపెనీలకు లబ్ది కలిగేలా డిజిటల్ సర్వీసు పన్ను రద్దు చేసింది. ఖరీదైన మోటారు సైకిళ్లు, విస్కీల మీద పెద్ద మొత్తంలో తగ్గించింది. ఇంత చేసిన తర్వాత రెండు దేశాల మధ్య ఒప్పందం సంగతి తేల్చాలని మన విదేశాంగ మంత్రి జై శంకర్ అమెరికా మంత్రి మార్కో రూబియోకు ఫోన్లు చేస్తున్నారు. పారిశ్రామిక వస్తు ఎగుమతులు, దిగుమతుల మీద ఎలాంటి పన్ను విధించకూడదని తాము కోరుతున్నామని, వీటిమీద చర్చలకు సిద్ధమని, కుదరకపోతే తాము కూడా ప్రతికూల పన్నులు వేసేందుకు సన్నద్దమౌతున్నట్లు ఐరోపా సమాఖ్య అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ చెప్పారు. మూడు నెలల పాటు పన్నుల వసూలు వాయిదా వేయాలన్న సూచనను ట్రంప్ తిరస్కరించాడు. అయినప్పటికీ మంగళవారం నాడు ప్రారంభంలో ఆసియా స్టాక్‌్ మార్కెట్లు స్వల్పంగా కోలుకున్నాయి.
అమెరికాలో బహుళజాతి కార్పొరేట్లకు వత్తాసు పలుకుతున్న ట్రంప్, వారి కనుసన్నల్లో పనిచేసే మీడియా సంస్థలు అనేక అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయి. మెక్సికో నుంచి చైనా పెంటానిల్ అనే మత్తు మందును అక్రమంగా సరఫరా చేస్తోందని, అక్రమ వలసలు అమెరికాను దెబ్బతీస్తున్నాయని చేసిన ప్రచారం నిజంగా అసలు సమస్యలే కాదు. వాటిని అరికట్టేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. ఆ సాకుతో వాణిజ్యం యుద్ధ్దం చేయాల్సిన అవసరం లేదు. అధికారానికి వచ్చిన వెంటనే అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపే పేరుతో చేసిన హడావుడి తర్వాత ఎందుకు కొనసాగించలేదు. ‘స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలతో ధరలు తగ్గుతాయి, ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుంది, దిగుమతులపై పన్నులు అమెరికన్ల ఉపాధిని కాపాడతాయి, ఇందుకోసం తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులను భరించకతప్పదు’ అనే రీతిలో జనాన్ని నమ్మించచూస్తున్నారు. వీటిలో ఏ ఒక్కటైనా కార్మికవర్గ జీవన ప్రమాణాలను పెంచేదిగానీ, ఉపయోగపడేది గానీ ఉందా, వేతనాలను అదుపు చేయటం వారి లాభాలను గరిష్టంగా పెంచుకొనే కార్పొరేట్ల ఎత్తుగడలు తప్ప మరేమైనా ఉన్నాయా అన్న చర్చ కార్మికవర్గంలో ప్రారంభమైంది. గత మూడు దశాబ్దాలుగా అమెరికా వస్తు ఉత్పాదక సంస్థలు దేశం వదలి పోతుంటే 78 ఏండ్ల ట్రంప్ గతంలో ఎప్పుడైనా నోరు విప్పాడా? ఇప్పుడెందుకు గుండెలు బాదుకుంటున్నాడు? పెట్టుబడిదారులు తమకు ఏది లాభంగా ఉంటే ఆ విధానాలను రూపొందించే వారిని పాలకులుగా గద్దెనెక్కి స్తారు. 2018లో ఇదే ట్రంప్ చైనా మీద వాణిజ్య యుద్ధం ప్రారంభించాడు. అమెరికాలో పోయిన ఉద్యోగాలు తిరిగి వస్తాయని అప్పుడు కూడా చెప్పాడు. తర్వాత ఎన్నికల్లో ఓడిపోయి చరిత్రకెక్కాడు. అక్కడి ఉక్కు, తదితర కంపెనీలకు లాభాలు తప్ప కార్మికులకు వేతనాలు పెరగలేదు.రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత వినాశకరమైన ఆర్థిక విధానాన్ని ట్రంప్ పాటిస్తున్నట్లు అమెరికా మాజీ అర్థిక మంత్రి లారెన్స్ సమర్స్ వ్యాఖ్యానించాడు.1930దశకం తర్వాత అతి పెద్ద వాణిజ్య యుద్ధాన్ని ట్రంప్ ప్రారంభించినట్లు చెబుతున్నారు.
సమస్య పెట్టుబడిదారీ వ్యవస్థలోనే అంతర్గతంగా ఉంది. కార్మికుల ఉద్యోగాలు పోవటానికి, వేతనాలు తగ్గటానికి కారణం చైనా, మెక్సికో, కెనడా, ఐరోపాల నుంచి వస్తున్న దిగుమతులే కారణమని ట్రంప్ యంత్రాంగం చిత్రిస్తున్నది. స్వదేశీ పరిశ్రమలకు ప్రోత్సాహం పేరుతో భారీ ఎత్తున్న పన్ను రాయితీలు ఇచ్చిననప్పటికీ దేశభక్త జనరల్ మోటార్స్ వంటి కంపెనీలు స్వదేశంలో ఫ్యాక్టరీలను మూసివేసి మెక్సికో, తదితర దేశాలకు తరలిపోయాయి. పన్నుల విధింపు కంపెనీలకు తప్ప కార్మికులకు మేలు చేయవని తొలిసారి అధికారంలో ఉన్నపుడు ఉక్కు దిగుమతుల వ్యవహారం వెల్లడించింది. కరోనా కాలం నుంచి చూస్తే కార్పొరేట్లకు లాభాలు కార్మికులకు భారాలు పెరిగాయి. ఈ నేపధ్యంలో దిగువ చర్యలు తీసుకోవాలని కార్మికవర్గం డిమాండ్ చేస్తోంది. విదేశాల్లో ఉపాధి కల్పించి కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికన్ కార్పొరేషన్ల మీద పన్ను విధించి, ఆ మొత్తాన్ని ఇతర రంగాల్లో కార్మికులను నిలుపుకొనేందుకు వినియోగించాలి. పన్నులు గనుక ఖర్చులను పెంచేట్లయితే ధరలను గట్టిగా నియంత్రించాలి. ఆహారం, ఔషధాలు, గృహ తదితరాల ధరలను స్తంభింప చేయాలి. కార్పొరేట్ల కోసం కార్మికులు మూల్యం చెల్లించకూడదు. కార్మిక సంఘాల హక్కులకు భంగం కలగకుండా అంతర్జాతీయ కార్మిక హక్కులను అమలు చేసి మాత్రమే వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలి. కీలకమైన ఉక్కు, ఆటోమొబైల్ వంటి పరిశ్రమలను బడా కంపెనీలకు దూరంగా ప్రజల భాగస్వామ్యంలో నిర్వహించాలి.
పెట్టుబడిదారులు వారు పారిశ్రామికవేత్తలైనా, వాణిజ్యంచేసే వారైనా లాభాలు వచ్చాయా లేదా? అన్నది తప్ప ఎలాంటి విలువలు, వలువలు, సిద్ధాంతాలు ఉండవు. ఎప్పటికెయ్యది లాభమో అప్పటికా విధానాలను తమ ప్రతినిధులైన పాలకుల ద్వారా రూపొందించి అమలు చేస్తారు. కమ్యూనిజం వ్యాప్తి నిరోధానికి కంకణం కట్టుకున్నట్లు చెప్పిన అమెరికా ప్రత్యర్థిగా ఉన్న బలమైన సోవియట్‌ను దెబ్బతీసేందుకు ప్రచ్చన్న యుద్ధం సాగించింది. అదే కాలంలో ప్రపంచంలో పెద్ద మార్కెట్‌గా ఉన్న చైనాలో తన వస్తువులను అమ్ముకొనేందుకు, చౌకగా అక్కడ ఉత్పత్తి చేసి దిగుమతులు చేసుకొని లబ్దిపొందాలని ఎత్తువేశారు. దాంతో అప్పటి వరకు ఐరాసలో కమ్యూనిస్టు చైనాకు నిరాకరించిన భద్రతామండలి శాశ్వత సభ్యత్వాన్ని ఇచ్చేందుకు అంగీకరించింది. ఇదే సమయంలో స్వేచ్చా వాణిజ్యం పేరుతో ప్రపంచీకరణ సిద్దాంతాన్ని ముందుకు తెచ్చింది. ప్రపంచ వాణిజ్య సంస్థపేరుతో నిబంధనలు రూపొందించింది. నాలుగు దశాబ్దాల తర్వాత సమీక్షించుకుంటే ఈ విధానం తమకంటే చైనా, ఇతర దేశాలకు ఎక్కువ ప్రయోజనకరంగా ఉన్నట్లు గ్రహించి ప్రపంచం మొత్తం తనకు వ్యతిరేకంగా తొండి చేస్తున్నట్లు ఇప్పుడు అమెరికా ఆరోపిస్తోంది.తమకు రక్షణ చర్యలు,మరిన్ని రాయితీలు కల్పించాలని ట్రంప్ ద్వారా కార్పొరేట్ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. స్వేచ్చా వాణిజ్యానికి వీలు కల్పించాలని కోరేదీ, దానికి విరుద్దమైన రక్షణ విధానాలను కోరేదీ కూడా పెట్టుబడిదారులే. చైనా నుంచి వస్తువులను స్వేచ్చగా దిగుమతి చేసుకొనేందుకు, పెట్టుబడులను ఆనుమతించాలని మన దేశంలో కోరుతున్నదీ, చౌకగా వచ్చే వస్తువులతో తమ పరిశ్రమల మనుగడకు ముప్పు గనుక ఆంక్షలు పెట్టాలి లేదా పన్ను విధించాలని కోరుతున్నదీ పెట్టుబడిదారులే .చైనా పెట్టుబడులను కేంద్రం అడ్డుకుంటే మోడీ మెడలు వంచి అనుమతించేందుకు ఒప్పించారు. అమెరికాను వ్యతిరేకిస్తున్న దేశాల మీద ప్రతీకార పన్ను ఏటా ఆరువందల బిలియన్ డాలర్ల మేర రాబడి వస్తుందని చెబుతున్న ట్రంప్ రానున్న పదేండ్లల్లో ఐదు లక్షల కోట్ల డాలర్ల మేరకు కార్పొరేట్లు, ధనికులకు పన్ను రాయితీలిచ్చేందుకు తీర్మానం చేయించాడు. అంటే అలా వచ్చేదాన్ని ఇలా అయినవారికి వడ్డించేందుకు సిద్ధమయ్యాడు. మరోవైపున కార్మికుల సంక్షేమ చర్యలకు కోత పెట్టేందుకు పూనుకున్నాడు.తమ దేశాలకు చెందిన సంస్థల వస్తువులను అమ్ముకొనేందుకు అవసరమైన మార్కెట్ల వేటలో భాగంగానే ప్రపంచాన్ని వలసలుగా మార్చుకొనేందుకు తలెత్తిన పోటీలో రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. భౌతిక వలసల్లో బ్రిటన్‌ది పైచేయి కాగా ఇప్పుడు అది సాధ్యం కాదు గనుక మార్కెట్లను కబళించే క్రమంలో అమెరికా ముందుకు వచ్చింది. దానికి ప్రతిఘటన ఫలితమే వాణిజ్యపోరు!
ఎం కోటేశ్వరరావు
8331013288