నేలకొండపల్లి కూడలిలో సాంబయ్య అంటే తెలియని వారు ఉండరు. ఒకప్పుడు ఎండనక, వాననక సైకిల్‌పై ఊరూరా తిరుగుతూ బట్టలు అమ్మిన సాంబయ్య, తన కష్టార్జితంతో ఒక చిన్న బట్టల దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ”తక్కువ లాభం – నాణ్యమైన సరుకు” అనే సూత్రంతో సాంబయ్య చేసే వ్యాపారం చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరినీ ఆకట్టుకుంది. సాంబయ్య మాటలో ఉండే మర్యాద, బట్టల నాణ్యత అతనికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. క్రమంగా వ్యాపారం వద్ధి చెంది, దుకాణం ఎప్పుడూ కొనుగోలుదారులతో కిటకిటలాడుతూ ఉండేది.
సాంబయ్య ఎదుగుదల పక్కనే దుకాణం నడుపుతున్న భూపతికి కంటిమీద కునుకు లేకుండా చేసింది. భూపతి స్వభావరీత్యా స్వార్థపరుడు, వినియోగదారులను ఎలాగైనా వంచించి అధిక లాభాలు గడించాలనే మనస్తత్వం కలవాడు. సాంబయ్య దుకాణానికి వెళ్లే జనాన్ని చూసి భూపతి అసూయతో రగిలిపోయేవాడు. సాంబయ్య వ్యాపారాన్ని దెబ్బతీస్తే తప్ప తన దుకాణం పుంజుకోదని భావించిన భూపతి, ఒక కుతంత్రాన్ని పన్నాడు. సరిగ్గా అదే సమయంలో, తన పని భారాన్ని తగ్గించుకోవడానికి సాంబయ్య ఒక నమ్మకమైన సహాయకుడి కోసం వెతుకుతున్నాడని భూపతికి తెలిసింది.
భూపతి తన దగ్గర పనిచేసే గురునాథాన్ని పిలిచి ఒక రహస్య పథకం చెప్పాడు. గురునాథం అతి వినయం నటించడంలో దిట్ట. భూపతి మాట ప్రకారం, గురునాథం చిరిగిన దుస్తులు ధరించి, దీనమైన ముఖంతో సాంబయ్య దగ్గరకు వెళ్ళాడు.
”అయ్యా! నా భార్యాబిడ్డలు ఆకలితో అలమటిస్తున్నారు, నాకు ఏ పనైనా ఇప్పించండి, ప్రాణం ఉన్నంతవరకు మీకు విశ్వాసంగా ఉంటాను” అంటూ సాంబయ్య కాళ్లపై పడ్డాడు. సున్నితమైన మనసుగల సాంబయ్య, గురునాథం కన్నీళ్లు చూసి చలించిపోయాడు. మనిషి నటన వెనుక ఉన్న కుట్రను గ్రహించలేక, అతడిని తన దుకాణంలో పనికి కుదుర్చుకున్నాడు.
గురునాథం అనతి కాలంలోనే సాంబయ్య నమ్మకాన్ని పూర్తిగా చూరగొన్నాడు. దుకాణం తాళాలు, లెక్కలు, సరుకు ఎక్కడ కొంటున్నారో అనే వివరాలన్నీ సాంబయ్య అతనికి చెప్పేవాడు. సాంబయ్య తన భవిష్యత్తు వ్యాపార రహస్యాలను, కొత్త రకం బట్టలు ఎప్పుడు తెప్పిస్తున్నాడో కూడా గురునాథానికి వివరించేవాడు. గురునాథం ప్రతిరోజూ రాత్రివేళ సాంబయ్య వేసే ప్రతి అడుగును భూపతికి చేరవేసేవాడు. దీనివల్ల సాంబయ్య కొత్త సరుకును అంగడిలోకి తీసుకురాకముందే, భూపతి అవే రకాలను తక్కువ ధరకే అమ్మి సాంబయ్య వ్యాపారాన్ని దెబ్బతీయడం మొదలుపెట్టాడు.
కొద్ది నెలల్లోనే సాంబయ్య దుకాణం వెలవెలబోయింది. చేసిన అప్పులు పెరిగిపోయాయి, రావాల్సిన బాకీలు ఆగిపోయాయి. సాంబయ్య ఆర్థికంగా కుంగిపోతున్న తరుణంలోనే, గురునాథం అకస్మాత్తుగా పని మానేసి భూపతి దుకాణంలో భాగస్వామిగా చేరిపోయాడు. అప్పుడు గానీ సాంబయ్యకు తాను చేసిన పొరపాటు అర్థం కాలేదు. తన ఎదుగుదలకు కారణమైన రహస్యాలను శత్రువు పంపిన వేగులకి తానే స్వయంగా అందించానని తెలిసి కుమిలిపోయాడు. కట్టుకున్న ఇల్లు, ప్రాణంగా చూసుకున్న దుకాణం అప్పుల పాలయ్యాయి. కానీ సాంబయ్య ధైర్యాన్ని కోల్పోలేదు.
పడిపోయిన చోటే మళ్ళీ లేవాలని నిర్ణయించుకున్న సాంబయ్య, మళ్ళీ తన పాత సైకిల్‌ను బయటకు తీశాడు. ఈసారి గుడ్డిగా ఎవరినీ నమ్మకూడదనే గుణపాఠాన్ని తన గుండెల్లో పదిలం చేసుకున్నాడు. కేవలం తన శ్రమను, తన మీద తనకున్న నమ్మకంతో మళ్ళీ పల్లెల బాట పట్టాడు.
మరోవైపు, మోసంతో సంపాదించిన ఆస్తి భూపతికి, గురునాథానికి ఎంతో కాలం నిలవలేదు. వారిద్దరి మధ్య లాభాల వాటాల విషయంలో విభేదాలు మొదలయ్యాయి. ఒకరిని ఒకరు నమ్మకపోవడంతో వ్యాపారం కుప్పకూలింది. కొనుగోలుదారులు కూడా వారి వంచనను గమనించి రావడం మానేశారు. చివరికి, సాంబయ్య తన నిజాయితీతో, నిరంతర శ్రమతో మళ్ళీ ఉన్నత స్థితికి చేరుకున్నాడు. మోసంతో గెలిచిన భూపతి, గురునాథం మాత్రం చివరకు దిక్కుతోచని స్థితిలో మిగిలిపోయారు.
– డా.పోతగాని సత్యనారాయణ, 9182531202
గుడ్డి నమ్మకం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



