– మధ్యప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ సిఫారసు
– కాంగ్రెస్ నుంచి వ్యతిరేకత
– మేధావులు, సామాజికవేత్తల నుంచి కూడా..
భోపాల్ : మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంఫ్ సిద్ధాంతాలను, భావజాలాన్ని వ్యాప్తి చేసే పనిలో పడింది. ఇందులో భాగంగా ఆరెస్సెస్ ప్రముఖ నాయకులు రచించిన పుస్తకాలను కళాశాలల్లో ప్రవేశపెట్టే చర్యలకు దిగుతున్నది. వీటితో పాటు మరికొన్ని పుస్తకాలను చేర్చాలని చూస్తున్నది. భారతీయ సాంప్రదాయ విజ్ఞానాన్ని విద్యా పాఠ్యాంశాల్లో చేర్చే ప్రయత్నాల్లో భాగంగా వీటిని సేకరించాలని ఆదేశిస్తూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 88 పుస్తకాల జాబితాను కళాశాలలకు పంపింది. సురేశ్ సోనీ, దీనానాథ్ బాత్రా, డి అతుల్ కొఠారీ, దేవేంద్రరావు దేశ్‌ముఖ్ వంటి ప్రముఖ ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు రచించిన పుస్తకాలు ఇందులో ఉన్నాయి. వీరంతా ఆరెస్సెస్ విద్యా విభాగమైన విద్యాభారతితో సంబంధం కలిగి ఉన్నారు. వివిధ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఈ పుస్తకాలను ప్రవేశపెట్టేందుకు వీలుగా ప్రతి కళాశాలలో ‘భారతీయ జ్ఞాన్ పరంపర ప్రకోష్ఠ’ (భారతీయ జ్ఞాన సంప్రదాయ కణం) ఏర్పాటు చేయాలని ఉన్నత విద్యాశాఖ సిఫారసు చేసింది. కాగా, సంబంధిత సబ్జెక్టులు మాత్రమే బోధించాలనీ, కళాశాలలలో రాజకీయ భావజాలంపై విభేదాలు పెంచకూడదని కాంగ్రెస్ నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. కాగా, ఈ పుస్తకాల్లో అభ్యంతరకరం ఏమీ లేదనీ, దేశ నిర్మాణం, దేశభక్తి అనే భావజాలాన్ని తాము బోధిస్తామని బీజేపీ వెల్లడించింది. అయితే, బీజేపీ సర్కారు చర్యపై ఇటు రాజకీయంగానే కాదు.. మేధావులు, సామాజికవేత్తల నుంచి కూడా వ్యతిరకత వ్యక్తమవుతున్నది. ఆరెస్సెస్ వంటి సంస్థకు చెందిన నాయకులు రచించిన పుస్తకాలను విద్యా పాఠ్యాంశాల్లోకు చేర్చే ప్రయత్నం విద్యను కాషాయీకరణ చెందించటమేనని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ 88 పుస్తకాల సెట్‌ను ఆలస్యం చేయకుండా కొనుగోలు చేయాలని మధ్యప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ కళాశాలల ప్రిన్సిపాల్‌లకు రాసిన లేఖలో ఉన్నత విద్యా శాఖ సీనియర్ అధికారి డాక్టర్ ధీరేంద్ర శుక్లా ఆదేశించారు.