మోడీ, కేసీఆర్‌ ఇద్దరూ ఒక్కటే

మోడీ, కేసీఆర్‌ ఇద్దరూ ఒక్కటే– బీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం కలిసి కాంగ్రెస్‌పై కుట్ర
– దేశంలో ఆహార కొరత తీరింది ఇందిరమ్మ రాజ్యంలోనే : నల్లగొండలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే
నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్‌
ప్రధానమంత్రి నరేంద్రమోడీ, సీఎం కేసీఆర్‌ ఇద్దరూ ఒకటేనని, వారిద్దరికీ పేదల కష్టాలు పట్టవని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జునఖర్గే విమర్శించారు. రాష్ట్రంలో ఈసారి జరిగేవి అతి ముఖ్యమైన ఎన్నికలని, ఇందిరమ్మ రాజ్యం వస్తేనే తెలంగాణ మరింత ముందుకు వెళుతుందని తెలిపారు. డీసీసీ అధ్యక్షులు శంకర్‌నాయక్‌ అధ్యక్షతన బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. నల్లగొండ జిల్లాకు గొప్ప చరిత్ర ఉందని, దాన్ని ఈ ఎన్నికల్లో నిరూపించుకోవాలని పిలుపునిచ్చారు. నాగార్జునసాగర్‌ వంటి గొప్ప ప్రాజెక్ట్‌ కట్టిన ఘనత ఇందిరా గాంధీకి దక్కుతుందన్నారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు లేకుంటే తెలంగాణ ఎలా ఉండేదని ప్రశ్నించారు. ఇందిరాగాంధీ పేదరిక నిర్మూలన కోసం 20 సూత్రాల కార్యక్రమాన్ని తీసుకువచ్చారని గుర్తుచేస్తూ ఆమెను దూషిస్తూ మాట్లాడటాన్ని ఖండించారు. బీఆర్‌ఎస్‌ పాలనలో విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, రైతులకు రుణమాఫీ రావడం లేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులను కూడా దారి మళ్లించి దుర్వినియోగం చేస్తున్నారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ఒంటరిగా పోరాటం చేస్తుందని, బీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం కలిసి కాంగ్రెస్‌పై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు ప్రజలు మద్దతు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెనర్‌, నల్లగొండ కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, హుజూర్‌నగర్‌ అభ్యర్థి ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మెన్‌ నేతి విద్యాసాగర్‌, కాంగ్రెస్‌ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ బుర్రి శ్రీనివాసరెడ్డి, తిప్పర్తి జెడ్పీటీసీ పాశం రాంరెడ్డి, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్‌ రెడ్డి, మున్సిపల్‌ వైస్‌చైర్మెన్‌ అబ్బగోని రమేశ్‌గౌడ్‌, డీసీసీ బీ డైరెక్టర్‌ పాశం సంపత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love