పాలస్తీనాకు సంఘీభావంగా అకడమిక్‌ సిబ్బంది విధుల బహిష్కరణ

పాలస్తీనాకు సంఘీభావంగా అకడమిక్‌ సిబ్బంది విధుల బహిష్కరణలాస్‌ఏంజెల్స్‌ : పాలస్తీనాకు సంఘీభావంగా అందోళన చేస్తున్న విద్యార్థులపై అణచివేతను నిరసిస్తూ లాస్‌ఏంజెల్స్‌లోని కాలిఫోర్నియా యూని వర్శిటీలో అకడమిక్‌ సిబ్బంది మంగళవారం తమ విధులను బహిష్కరించారు. పాలస్తీనా అనుకూల నిరసనలు, ఆందోళనల పట్ల కాలిఫోర్నియా యూనివర్శిటీ వ్యవహరించిన తీరును వారు నిరసించారు. కాలిఫోర్నియా యూనివర్శిటీ లాస్‌ఏంజెల్స్‌ కేంపస్‌ అధికారికంగా సమ్మెలో వుందని యునైటెడ్‌ ఆటో వర్కర్స్‌్‌ (యుఎడబ్ల్యు) లోకల్‌ 4811 మంగళవారం ఉదయం ఎక్స్‌్‌లో పోస్టు పెట్టింది. కాలిఫోర్నియా వర్శిటీకి చెందిన పది కేంపస్‌లు, లారెన్స్‌ బర్కిలీ నేషనల్‌ లేబరేటరీకి చెందిన దాదాపు 48వేల మంది అకడమిక్‌ సిబ్బంది ఈ యూనియన్‌లో సభ్యులుగా వున్నారు. ‘ఎవరి యూనివర్శిటీ? ఇది మా యూనివర్శిటీ’ అంటూ నిరసనకారులు నినదించారు. డిక్సన్‌ ప్లాజా వద్ద వారు ఆందోళన నిర్వహించారు. ఈ మేరకు యూనివర్శిటీ విద్యార్ధి వార్తాపత్రిక డైలీ బ్రూయిన్‌ వార్తలను ప్రచురించింది. స్వతంత్ర పాలస్తీనాకు అనుకూలంగా వారు నినాదాలు చేశారు. కేంపస్‌ ప్రవేశ మార్గాన్నిదిగ్బంధించారు. గాజాలో కాల్పుల విరమణ తక్షణమే పాటించాలని వారు కోరారు. శాంతియుతంగా ఆందోళనలు నిర్వహించే హక్కు తమకు వుందని పేర్కొన్నారు. అకడమిక్‌ వర్కర్లు, విద్యార్ధులు, కమ్యూనిటీ సభ్యులు శాంతియుతంగా ఆందోళనలు నిర్వహిస్తున్నపుడు, కేంపస్‌లో మకాం వేసినపుడు యూనివర్శిటీ యాజమాన్యం తప్పుడు మార్గం అనుసరించింది.కాలిఫోర్నియా వర్శిటీ శాంతాక్రజ్‌ కేంపస్‌లో అకడమిక్‌ వర్కర్లు గత సోమవారం తమ విధులను బహిష్కరించారు.

Spread the love