– గాంధీనగర్-ఇల్లందు రైల్వే లైన్‌కు ప్రయత్నిస్తా..
– ఇల్లందు నియోజకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్ధి దుగ్గి కృష్ణ
మొక్కలు, పార్కులు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, రోడ్లు, డివైడర్లు.. లాంటి పనులు చేస్తూ రూ.కోట్లలో అభివృద్ధి చేశామని చెబుతుంది బీఆర్ఎస్. కానీ ఇవన్నీ అవసరాలు.. ఉపాధి కాదంటున్నారు సీపీఐ(ఎం) ఇల్లందు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి దుగ్గి కృష్ణ. ప్రజలకు కావాల్సింది ఉపాధి.. ధరల అదుపు.. అని అంటున్నారు. ఎన్నికల ప్రచారంలోకి వెళ్లినప్పుడు వీటిపై ప్రజలు అడుగు తున్నారు. అధికార పక్షాన్ని నిలదీయడానికి సీపీఐ(ఎం) అభ్యర్థుల అవసరాన్ని గుర్తి స్తున్నారు. ఓటు వేయడానికి ముందుకు వస్తున్నారు.. అంటూ తన ప్రచార విషయాలను నవతెలంగాణతో ఆయన పంచుకున్నారు. ఇల్లందు, కామేపల్లి, టేకులపల్లి, గార్ల, బయ్యారం మండలాల్లోని పలు గ్రామాలు, తండాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
నియోజవకర్గ సమగ్రాభివృద్ధికి ప్రణాళిక ఉందా..?
ప్రస్తుతం ఉన్న పార్టీలు పరిశ్రమలు, ఉపాధి కల్పిస్తామనే భరోసా ఇవ్వడం లేదు. నియోజకవర్గంలో సహజవనరులు అపారం. వాటిని వెలికితీసి పరిశ్రమలు స్థాపించి ఉపాధి కల్పించడానికి కృషి చేస్తా. ఇల్లందు మండలం మొండితోగులో పసుపు వర్ణం మార్బుల్స్ రాజస్థాన్‌లో దొరికేవాటికి దీటుగా ఉన్నాయి. టేకులపల్లి మండలంలో అబ్రకం, గార్లలో బైరైటీస్, బయ్యారంలో ఐరన్ ఓర్, కామేపల్లిలో గ్రానైట్ అపారంగా ఉన్నాయి. నాణ్యమైన తునికాకు లభిస్తోంది. ఇతర రాష్ట్రాలకు సరఫరా అవుతోంది. ఇక్కడే పరిశ్రమలు నెలకొల్పవచ్చు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ద్వారా వేలాది ఉద్యోగాలు యువతకు లభిస్తాయి. ఊటవాగు, మున్నేరు, బయ్యారం చెరువులపై ప్రాజెక్టులు నిర్మించవచ్చు. లక్షలాది ఎకరాల పంటపొలాలు పండుతాయి. ఆహారోత్పత్తి పెరుగుతుంది. రైతులకు, వ్యవసాయ కూలీలకు ఉపాధి దొరుకుతుంది.
ఏజెన్సీ ప్రజల ఇబ్బందులు
ఇల్లందులో కోట్ల రూపాయలతో బస్‌డిపో నిర్మించినా మారుమూల గ్రామాలకు మాత్రం బస్ సౌకర్యం లేదు. ఎమ్మెల్యే, ఎంపీపీ, జడ్పీ చైర్మెన్, సర్పంచుల ఊర్లకే బస్ సౌకర్యం లేదు. బ్రిటీష్ కాలం నుంచి నేటి వరకు 145 ఏండ్లుగా ఇల్లందులో బొగ్గు బావులు, ఓసీల ద్వారా లక్షల కోట్ల బొగ్గు వెలికి తీశారు. రైల్వే లైన్ నిర్మించి బొగ్గు తరలించారు. కానీ ప్రయాణికుల సౌకర్యం కోసం మాత్రం ఎలాంటి రైలూ లేదు.
రవాణా సౌకర్యాలు ఉంటేనే ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందుతుంది. గాంధీనగర్-ఇల్లందుకు 12కి.మీ రైల్వే లైన్ నిర్మించి మణుగూరు – కొత్తగూడెం నుంచి వెళ్ళే రైళ్లు గాంధీనగర్, ఇల్లందు మీదుగా కారేపల్లికి నడపాలని 2012లో కేంద్రం సర్వేకు ఆమోదించింది. ఎంపీలు, ఎమ్మేల్యేలు దృష్టి పెట్టకపోవడం వల్ల మరుగునపడింది. దీని కోసం పట్టుబడుతాను.
ప్రజలకు మీరిచ్చే సందేశం..?
అనేక సమస్యలకు నిలయంగా నియోజకవర్గం ఉంది. పైపై మెరుగులు దిద్ది అభివృద్ధి అంటే సరిపోదు. అధికార పక్షాన్ని నిలదీయడానికి, సమస్యల పరిష్కారానికి ప్రతిపక్షం అవసరం. ప్రతిపక్షం బలంగా ఉంటేనే అధికారపక్షం బాగా పనిచేయగలుగుతుంది. పార్టీలు మారేవారిని పక్కన పెట్టాలి. కాబట్టి ఇల్లందు అసెంబ్లీ నియోజవర్గం బ్యాలెట్లో ఒకటో నెంబర్ సుత్తి, కొడవలి, నక్షత్రం ఉంటుంది. నిశబ్ద విప్లవంలా అత్యధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నా.