– జూన్ నుంచి ప్రక్రియ ప్రారంభం
– ప్రయివేటు టెల్కోలకు శాటిలైట్ ఇంటర్నెట్ అనుమతులు: కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడి
న్యూఢిల్లీ : ప్రభుత్వ టెలికం కంపెనీ బిఎస్‌ఎన్‌ఎల్ దేశ వ్యాప్తంగా ఒక్క లక్ష 4జి మొబైల్ టవర్లను స్వదేశీ పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిందని కేంద్ర టెలికం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సిందియా తెలిపారు. వీటిని వచ్చే జూన్ నుంచి 5జిగా మార్చే ప్రక్రియను చేపట్టనున్నామని చెప్పారు. సెప్టెంబర్ 2023 నుంచి 2025 మార్చి 5 మధ్య 83,629 బిఎస్‌ఎన్‌ఎల్ టవర్లను 4జిగా ఆధునీకరించామని ఇటీవలే పార్లమెంట్‌కు మంత్రి తెలిపారు. మరో 74,123 సైట్లను 4జిగా మార్చనున్నామన్నారు. ఆత్మనిర్భర్ భారత్ యోజన కింద వీటిని అప్‌గ్రేడ్ చేస్తోన్నామని చెప్పారు. ప్రభుత్వం డైరెక్ట్ టు డివైస్ ఉపగ్రహ సేవలను ప్రారంభించిందని సింధియా తాజాగా వెల్లడించారు. ఈ సాంకేతికతలో నెట్‌వర్క్‌కు కనెక్ట్ కానప్పుడు కూడా స్మార్ట్‌ఫోన్ నుంచి సందేశాలను పంపొచ్చన్నారు. అప్పుడు కనెక్టివిటీ మొబైల్ టవర్ నుంచి కాకుండా ఉపగ్రహం నుంచి నేరుగా అందుతుందన్నారు.
ఆ రెండింటికి లైసెన్స్..
భారత్‌లో ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించడానికి దరఖాస్తు చేసుకున్నారన్నారు. దీని కోసం ఇతర అనేక కంపెనీలు సైతం ఆసక్తిని చూపిస్తున్నాయన్నారు. శాటిలైట్ ఇంటర్నెట్ కమ్యూనికేషన్ సేవల కోసం ఇప్పటికే రిలయన్స్, భారతీ ఎయిర్‌టెల్‌కు అనుమతులు ఇచ్చామని చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో నాలుగు టెలికం కంపెనీలు ఉన్నాయన్నారు. 2014లో 90కోట్ల మంది మొబైల్ వినియోగదారులు ఉండగా.. ప్రస్తుతం ఈ సంఖ్య 120 కోట్లకు పైగా పెరిగిందన్నారు. 97 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులున్నారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్‌కు శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించకపోవడంపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. మరోవైపు ప్రయివేటు టెల్కోలకు స్పెక్ట్రం ఫీజులు, వేలం లేకుండానే ఈ సేవలకు అనుమతులు ఇవ్వడంపై ఆందోళనలు వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే.