నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఒక రోజు విరామానంతరం శాసనసభ, మండలి శనివారం తిరిగి సమావేశం కానున్నాయి. గురువారం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో దానిపై అధ్యయనం చేసి సభలో చర్చించేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవకాశం కల్పిస్తూ శుక్రవారం ఉభయసభలకు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం శాసనసభ, మండలిలో ప్రశ్నోత్తరాలను, జీరో అవర్ ను పూర్తిగా రద్దు చేసి నేరుగా బడ్జెట్‌పై చర్చను ప్రారంభించనున్నారు. రెండు సభలు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుండగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తొలుత శాసనసభలో, ఆ తర్వాత మండలిలో సభ్యుల ప్రశ్నలకు సమాధానాలిస్తారు. బడ్జెట్ ప్రతిపాదించిన రోజు అసెంబ్లీకి వచ్చి మీడియా పాయింట్లో సైతం మాట్లాడిన ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ శనివారంనాటి సభకు వస్తారా? లేదా ? అనేది చర్చనీయాంశమవుతున్నది.