Wednesday, July 15, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఅంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో విమానాశ్ర‌యాలను నిర్మించండి

అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో విమానాశ్ర‌యాలను నిర్మించండి

- Advertisement -

ఎంఆర్‌వో, ఎయిర్ కార్గో, హ్యాంగ‌ర్ వ‌స‌తులు క‌ల్పించాలి
కాక‌తీయ సంస్కృతికి అద్దం ప‌ట్టేలా వ‌రంగ‌ల్ ఎయిర్‌‌పోర్టు
ఆదిలాబాద్‌ భూసేక‌రణా చేప‌డ‌తాం : కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడుతో సీఎం రేవంత్‌రెడ్డి

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్రంలో నిర్మించ‌నున్న వ‌రంగ‌ల్ (మామునూరు), ఆదిలాబాద్ విమానాశ్ర‌యాల‌ను అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాల‌తో నిర్మించాల‌ని కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి రామ్మోహ‌న్ నాయుడుకు ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. వ్యూహాత్మ‌కంగా, వాణిజ్య‌ప‌రంగా ఈ రెండు విమానాశ్ర‌యాలకు ఉన్న సానుకూల అవకాశాలు, ప‌రిస్థితుల‌ను సీఎం వివ‌రించారు. మంగ‌ళ‌వారం ఢిల్లీలోని పౌర‌విమాన‌యాన శాఖ కార్యాల‌యంలో రాజీవ్ గాంధీ భ‌వ‌న్‌లో రామ్మోహ‌న్ నాయుడుతో సీఎం.రేవంత్ రెడ్డి స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా వ‌రంగ‌ల్ విమానాశ్ర‌య ప‌నుల‌పై కేంద్ర మంత్రితో సుదీర్ఘంగా చ‌ర్చించారు. రైలు, రోడ్డు మార్గాలతో అనుసంధాన‌మై ఉండ‌డంతో పాటు కాక‌తీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, కాజీపేట కోచ్ ఫ్యాక్ట‌రీ, ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల‌తో వ‌రంగ‌ల్ కీల‌క న‌గ‌రంగా ఉంద‌ని సీఎం తెలిపారు. రానున్న రోజుల్లో పారిశ్రామికంగా మ‌రింత‌గా వ‌రంగ‌ల్‌ను అభివృద్ధి చేస్తామ‌ని కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడుకు ముఖ్యమంత్రి తెలియ‌జేశారు. ఉత్త‌ర తెలంగాణ‌లోని ఉమ్మడి ఆదిలాబాద్‌, క‌రీంన‌గ‌ర్, వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మంతోపాటు నల్లగొండ జిల్లాల‌కు కేంద్రంగా వ‌రంగ‌ల్ ఉంటుంద‌ని అన్నారు. వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యంలో ఎంఆర్‌వో (మెయింటెనెన్స్‌, రిపేర్స్‌, ఓవ‌ర్‌హాలింగ్‌), ఎయిర్‌కార్గో, హ్యాంగ‌ర్ వ‌స‌తులు క‌ల్పించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

ఇప్ప‌టికే భూ సేక‌ర‌ణ పూర్తి చేసిన కారణంగా వెంటనే టెండ‌ర్లు పిలిచి ప‌నులు ప్రారంభించాల‌ని కోరారు. 2028, జూన్ 2 నాటికి ఎయిర్‌పోర్ట్ ప‌నులు పూర్తి చేసి ప్రారంభోత్స‌వానికి సిద్ధం చేయాల‌ని కేంద్ర మంత్రికి విజ్ఞ‌ప్తి చేశారు. ఈ సంద‌ర్భంగా వ‌రంగ‌ల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణాల‌కు సంబంధించిన డిజైన్ల‌పై కేంద్ర మంత్రి, సీఎం చ‌ర్చించారు. వ‌రంగ‌ల్‌కు ఘ‌న‌మైన చ‌రిత్ర ఉన్నందున‌, కాక‌తీయ చ‌రిత్ర‌, సంస్కృతికి అద్ధం ప‌ట్టేలా డిజైన్లు ఉండాల‌ని భావిస్తున్న‌ట్టు సీఎం తెలిపారు. అందుకు కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడు సుముఖ‌త వ్య‌క్తం చేశారు. ఆదిలాబాద్‌లో ర‌క్ష‌ణ శాఖ ఆధ్వర్యంలో ఎయిర్ పోర్ట్‌తో పాటు పౌర విమానాశ్ర‌యం నిర్మించాల‌ని రామ్మోహ‌న్ నాయుడును సీఎం కోరారు. రెండు ఎయిర్‌పోర్టులకు అవసరమైన భూమిని సేక‌రిస్తామని సీఎం చెప్పారు. వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యంలో మాదిరే ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోనూ ఎంఆర్‌వో, ఎయిర్‌కార్గో, హ్యాంగ‌ర్ వ‌స‌తులు నెల‌కొల్పాల‌న్నారు. వ‌రంగ‌ల్‌, ఆదిలాబాద్ రెండు విమానాశ్ర‌యాల్లోనూ విమాన శిక్ష‌ణ సంస్థ‌లను నెల‌కొల్పాల‌ని సీఎం విజ్ఞ‌ప్తి చేశారు. హుస్సేన్ సాగ‌ర్ నుంచి ప్ర‌కాశం బ్యారేజీకి సీ ప్లేన్‌లు న‌డిపే అంశాన్ని ప‌రిశీలించాల‌ని సూచించారు. అందుకు అవ‌స‌ర‌మైన ప్ర‌తిపాద‌న‌లు స‌మ‌ర్పించాల‌ని కేంద్ర మంత్రి సీఎంకు సూచించారు. స‌మావేశంలో నల్లగొండ ఎంపీ ర‌ఘువీర్ రెడ్డి, ఆర్ అండ్ బీ స్పెష‌ల్ చీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్‌, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు, ఎక్స్ అఫీషియో స్పెష‌ల్ చీఫ్ సెక్రెటరీ కె.రామ‌కృష్ణారావు, స్పెష‌ల్ సెక్రెటరీ కోఆర్డినేష‌న్ అద్వైత్ కుమార్ సింగ్, పౌర‌విమాన‌యాన శాఖ కార్యదర్శి ముర‌ళీధ‌ర్ మోహోల్‌, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మెన్ విపిన్ కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

అభివృద్ధికి రాజ‌కీయాల‌తో సంబంధం లేదు: రేవంత్ రెడ్డి
అభివృద్ధికి రాజ‌కీయాల‌తో సంబంధం లేద‌నీ, రాజ‌కీయాలను ఎన్నిక‌ల స‌మయానికే ప‌రిమితం చేయాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడితో భేటీ అనంత‌రం సీఎం విలేక‌రుల‌తో మాట్లాడారు. దేశాల అభివృద్ధిలో విమానాశ్ర‌యాలు కీల‌క పాత్ర పోషిస్తున్నాయ‌ని గుర్తుచేశారు. తెలంగాణ‌లోనూ విమానాశ్ర‌యాల అభివృద్ధి ద్వారా యువ‌త‌కు ఉద్యోగాల క‌ల్ప‌న‌, అభివృద్ధికి పాటుప‌డుతున్నామ‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వం వివిధ అంశాల్లో త‌మ‌కు స‌హ‌క‌రిస్తున్నదనీ, ఎక్క‌డైనా స‌మ‌స్య‌లుంటే కేంద్ర మంత్రుల‌ను క‌లిసి చ‌ర్చిస్తున్నామ‌ని తెలిపారు. ఏదైనా స‌మాచారలోపం ఉంటే దానిని ప‌ర‌స్ప‌రం మార్చుకోవ‌డం ద్వారా అధిగ‌మిస్తున్నామ‌ని వివరించారు. అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాల్లో కేంద్ర మంత్రుల‌ను క‌లిసేందుకు ఢిల్లీకి వ‌స్తున్నామ‌ని, దానిపైనా రాజ‌కీయాలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -