Wednesday, July 15, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుసర్‌ ట్రబుల్‌

సర్‌ ట్రబుల్‌

- Advertisement -

బీఎల్‌ఓల కోసం ఓటర్ల పరుగులు
ఎన్యుమరేషన్‌ ఫారాలు నింపడంలో కష్టాలు .. పంపిణీ 99.99 శాతం…
అందజేత 49.28 శాతం .. హైదరాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో కనిష్ట నమోదు
క్ష‍ేత్రస్థాయిలో పరిస్థితి భిన్నం.. ఈ ‌ప్రక్రియ మరో 10 రోజులే ..
ఆందోళనలో తెలంగాణ ప్రజలు .. గడువు పెంచాలని రాజకీయ పార్టీల విజ్ఞప్తులు

స్పందించని ఎన్నికల సంఘం

​నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్‌) ప్రక్రియకు మరో 10 రోజులు మాత్రమే గడువుంది. ఈ నెల 14 వరకు 99.99 శాతం ఎన్యుమరేషన్‌ ‌ఫారాల పంపిణీ పూర్తి కాగా, 49.28 శాతం మంది ఓటర్లు వాటిని పూరించి బీఎల్‌ఓలకు అందజేశారని ఎన్నికల సంఘం వెల్లడించింది. రంగారెడ్డిలో 99.96, వికారాబాద్‌‌లో 99.90, మేడ్చల్‌ ‌మల్కాజిగిరిలో 99.93 శాతం మినహా మిగతా 30 జిల్లాల్లో 100 శాతం ఫారాల పంపిణీ జరిగిందని ఈసీ చెబుతోంది. అయితే క్ష‍ేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఉమ్మడి హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో ఎన్యుమరేషన్‌ ఫారాల కోసం ‌ఓటర్లు బీఎల్‌ఓలను వెతికే పనిలోనే ఉన్నారు. బీఎల్‌ఓలు ప్రతి ఇంటిని మూడు సార్లు సందర్శిస్తారని ఎన్నికల సంఘం సర్‌ ‌షెడ్యుల్‌ ‌ప్రకటించినప్పుడు పేర్కొంది. గ్రామాలు, చిన్న చిన్న పట్టణాల్లో బీఎల్‌ఓలు ఇండ్లను సందర్శించడం, లేదా బీఎల్‌ఓలు ఉన్న చోటికి ఓటర్లు వెళ్లి ఫారాలు తీసుకోవడం జరిగింది. హైదరాబాద్‌, పూర్వపు రంగారెడ్డి జిల్లాలో మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో ఓటరు ఫారాల పంపిణీ పూర్తి కాలేదని తెలుస్తోంది. బీఎల్‌ఓలు తమ వద్దకు చేరుకోలేకపోయినందున ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తారేమోనని హైదరాబాద్‌లోని చాలా మంది నివాసితుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
ఓటర్‌ ‌నమోదు ఫారాలు పొందిన వారు వాటిని నింపడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కొన్ని ప్రాంతాల్లో బీఎల్‌ఓలకు నింపడం తెలియడం లేదని ఓటర్లు ఆరోపిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం రాష్ర్టంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లుకు గాను 3,38,21,554 మందికి ఓటర్ల ఎన్యుమరేషన్‌ ఫారాలు పంపిణీ చేయగా, 1,66,70,610 ఓటర్లు (49.28 శాతం) వాటిని పూరించి బీఎల్‌ఓలకు అందజేశారు. ఇంకా 50.72 శాతం మంది ఓటర్లు ఓటర్‌ ‌నమోదు ఫారాలను పూరించి ఎన్నికల సంఘానికి అందజేయాల్సి ఉంది. గ్రామీణ జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఓటరు ఫారాల నమోదు తక్కువైంది. మేడ్చల్‌ ‌మల్కాజిగిరి జిల్లాలో అత్యల్పంగా 18.73 శాతం, హైదరాబాద్‌‌ జిల్లాలో 22.22 శాతం, రంగారెడ్డి జిల్లాలో 33.43 శాతం మంది ఓటర్‌ ‌నమోదు ఫారాలను బీఎల్‌ఓలకు అందజేశారు. గ్రామీణ జిల్లాల్లో బీఎల్‌ఓలకు నివాసితులతో పరిచయం ఉండటం, పట్టణ ప్రాంతాల్లో ఆ పరిస్థితి లేకపోవడం, అపార్ట్‌మెంట్లు, తరచూ వలసలు, తప్పుడు చిరునామాల వల్ల ఎన్యుమరేషన్‌ ‌ఫారాల దాఖలు ఆశించిన స్థాయిలో జరగడం లేదని తెలుస్తోంది. ఇండ్లు మారిన వారు ఫారాలు అందుకోలేని సందర్భంలో బీఎల్‌ఓలు వారి ఓటును డిలీట్‌ ‌చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఓటర్‌ ‌నమోదు ఫారాల పంపిణీ దాదాపు పూర్తయిందని ఎన్నికల సంఘం చెబుతున్న లెక్కలను అధికార కాంగ్రెస్‌‌ పార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్ష‍మైన బీఆర్‌ఎస్‌ ఇతర పార్టీలు అంగీకరించడం లేదు. ఇంకా 10 రోజుల్లో సర్‌ ‌ప్రక్రియ పూర్తి కాదని ఆయా పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మంగళవారం మంత్రి పొన్నం, బీఆర్‌ఎస్‌ ‌నాయకులు ఎల్‌ ‌రమణ తదితరులు ఎన్నికల సంఘాన్ని కలిసి గడువు పెంచాలని కోరారు. అయితే ఈసీ మాత్రం పెంపుపై ఇంకా స్పందించలేదు.

ఓటరుగా నమోదు కావాలంటే..
ఎన్నికల సంఘం 2002లో నిర్వహించిన సర్‌లో ఓటరుగా నమోదు కాని వారు విధిగా తమ వారసత్వ ఫారాలు సమర్పించాలి. వారసత్వ పత్రాలు లేని వారు ఎన్నికల సంఘం గుర్తించిన (కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌ ‌కార్డులు, జన్మ ధృవీకరణ పత్రం, పాస్‌ ‌పోర్ట్‌, టెన్త్‌ సర్టిఫికెట్‌, అటవీ హక్కుల ధృవీకరణ పత్రం, భూమి/ఇంటి కేటాయింపు) 11 డ్యాక్యుమెంట్లను సమర్పించాలి. సరైన పత్రాలు లేని వ్యక్తులు కూడా అందుబాటులో ఉన్న వివరాలను సమర్పించవచ్చు, కానీ ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఓటరుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేస్తుంది. క్షేత్రస్థాయి విచారణ జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకుంటుంది. ఓటు తొలగించినా మూడు దశల్లో అప్పిల్‌ ‌చేసుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. అప్పీలు సమయంలో ఓటర్‌ తగిన ఆధారాలు సమర్పించాలి.

రెండు చోట్ల ఓటుంటే…
గతంలో ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాలు లేదా ఇతర రాష్ట్రాల్లో ఓటరుగా నమోదైన వారు ఒకే చోట తమ ఓటును నమోదు చేసుకోవాలి. జిల్లాలు , రాష్ట్రాల వ్యాప్తంగా నకిలీ ఓటరు నమోదులను గుర్తించడానికి ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు డెమోగ్రాఫికల్లీ సిమిలర్ ఎంట్రీస్ (డీఎస్‌ఈ) సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తోంది. నకిలీ నమోదులను గుర్తించిన తర్వాత, అధికారులు విచారణ జరిపి, నోటీసులు జారీ చేసి, తమ ఓటును నిలుపుకోవాలనుకుంటున్న నియోజకవర్గాన్ని ఎంచుకోమని ఓటరును అడుగుతారు. ఆ తర్వాత ఇతర ప్రాంతం నుంచి ఓటును తొలగిస్తారు. నకిలీ ఓట్లు కనుగొనబడితే మాత్రం జరిమానా, ఏడాది వరకు జైలు శిక్షతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

కొత్త ఓటుకు ఫారం 6….
ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం 18 సంవత్సరాలు నిండినా ఓటర్లుగా నమోదు కాని వారికి గణన పత్రం అందదు. దానికి బదులుగా వారు, కొత్త ఓటరు నమోదు కోసం ఉద్దేశించిన ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అలాగే ఇప్పటికే ఉన్న ఓటర్లు, ఇంకా గణన ఫారం అందుకోని పక్షంలో, తమ ప్రాంతంలో పంపిణీ చేసిన గణన ఫారాలపై అందించిన సంప్రదింపు నంబర్ల ద్వారా వెంటనే ఎన్నికల అధికారులను సంప్రదించాలి. వీలు కాని సందర్భంలో ఆన్‌‌లైన్‌ ‌ద్వారా ఓటర్‌ ‌నమోదు ఫారాలను డౌన్‌‌లోడ్‌ ‌చేసుకుని వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. నివాసం మార్చినప్పటికీ తమ పాత నియోజకవర్గంలోనే నమోదై ఉన్న ఓటర్లు, చిరునామా మార్పు తర్వాత ఓటరు నమోదును వలస లేదా బదిలీ చేయడానికి ఉద్దేశించిన ఫారం 8ని ఉపయోగించి దరఖాస్తు చేసుకోవాలి.​

రాష్ట్రవ్యాప్తంగా 88 లక్షల ఓట్లు గల్లంతు!

ఒక్కో జిల్లా లో 8 లక్షల నుంచి 12 లక్షల మేర ఓట్లు రద్దయ్యే అవకాశం! బీఎల్వోల నిర్లక్ష్యం, ఓటర్ల అనాసక్తే దీనికి కారణం ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ఇప్పటికే బీఎల్వోలు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు. ప్రస్తుతం వాటిని డిజిటలైజేషన్ కూడా చేస్తున్నారు. అయితే తాజాగా రాష్ట్ర ఎన్నికల అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 88 లక్షల ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. ఆ ఓట్లలో సగం రాజధానివేనని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. బీఎల్వోలు సరిగా ఫారాలను పంపిణీ చేయకపోవటం, చేసినా ఓటర్లు నింపకపోవటం వంటి కారణాలతో ఓట్లు గల్లంతు అవుతాయని ఎన్నికల అధికారులు చెబుతున్నారు.

అక్కడ భారీగా ఓట్లు రద్దు
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోనే అధికంగా ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉంది. అయితే ఒక్కో జిల్లా నుంచి 8 లక్షల నుంచి 12 లక్షల మేర ఓట్లు రద్దవుతాయని తెలుస్తోంది. ఈ జిల్లాల్లో ఓటరు గుర్తింపు కార్డులు ఒకటికి మించి ఉన్నాయని తేలింది. ఈ సంఖ్య పెద్దయెత్తున ఉండటంతో ఓటరు జాబితాలో తేడా వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -